– వెల్లటూరులో అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర కిట్స్ పంపిణీ
– పంపిణీ చేసిన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ , స్వామీజీలు
జి.కొండూరు (వెల్లటూరు): ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం సామాజిక బాధ్యతగా భావించి ప్రజలకు విశేష సేవలను అందిస్తున్న అథ్యాత్మిక సంస్థ అక్షయపాత్ర ఫౌండేషన్ సేవలు స్ఫూర్తిదాయకమనని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.
జి.కొండూరు మండలంలోని వెల్లటూరు శివారు భీమవరపాడు గ్రామంలో కష్టాలలో ఉన్న వరద బాధితులకు నిత్యావసర వస్తువుల 800 కిట్లను ఎమ్మెల్యే కృష్ణప్రసాదు గారు, ఫౌండేషన్ స్వామీజీలు, మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) , ఆదివారం పంపిణీ చేశారు. రూ.1500 విలువైన, నాణ్యమైన కిట్లను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.
ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 22 లక్షల మందికి, ఏపీలో 2 లక్షల మందికి ప్రతిరోజూ భోజనాలు ఏర్పాటు చేయడం ఎంతో గొప్ప విషమన్నారు. కోవిడ్ సమయంలో కూడా అక్షయపాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సేవలను అందించారన్నారు. స్వామీజీలను సత్కరించి, వారికి కొండపల్లి బొమ్మను బహుకరించారు. ఎన్డీఏ మహాకూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.