-ఉద్యోగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
– టిడ్కో ఇళ్ళపై ఆంధ్రజ్యోతి తప్పుడు రాతలు
– వివరణ అడిగి రాయాలన్న కనీస సంప్రదాయాన్నీ పాటించడంలేదు
మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
1- నిన్న ఉద్యోగులతో చర్చలు సానుకూలంగా జరిగాయి. ఈరోజు మళ్లీ ఉద్యోగ సంఘాలతో చర్చిస్తాం. సమస్యకు పరిష్కారం ఉంటుందని భావిస్తున్నాం. ఈరోజుతో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. హెచ్ఆర్ఏ శ్లాబ్ లపై కూడా చర్చించాం. ఇది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం… ఎవరికైనా కొన్ని అభిప్రాయ భేదాలు రావొచ్చు. ఇది కూడా అలాంటిదే. సీఎం గారి దృష్టికి నిన్నటి అంశాలను తీసుకెళ్తాం. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా, చిత్తశుద్ధితో ఉంది.
2- టిడ్కో ఇళ్ళపై ఆంధ్రజ్యోతి పత్రిక తప్పుడు వార్తలు వండి వార్చుతుంది. వాస్తవాలు తెలుసుకుని రాయాలి, సమాచారం కావాలంటే, ప్రభుత్వ అధికారులను, మంత్రిగా తననైనా వివరణ అడగి రాయాలన్న కనీస సంప్రదాయాలను కూడా పాటించకుండా ఇష్టం వచ్చినట్టు అసత్యాలతో కూడిన వార్తలను రాయడం మంచి పద్ధతి కాదు. మీకున్న ఉద్దేశాలను, దురుద్దేశాలను టిడ్కో ఇళ్ళపై రుద్ది అబద్ధపు వార్తలు రాయటం సమంజసం కాదు.
3- టిడ్కో ఇళ్ళల్లో మూడు కేటగిరీలు ఉన్నాయి. వాటిల్లో 300 ఎస్ఎఫ్టీ, 365 ఎస్ఎఫ్టీ, 430 ఎస్ఎఫ్టీ ఇళ్ళు నిర్మిస్తున్నాం. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఈ ఇళ్ళకు సంబంధించి లబ్ధిదారులే పూర్తిగా రుణాలు చెల్లించాల్సి ఉండేది. 20 ఏళ్ళపాటు అసలు వడ్డీలతో సహా కట్టాల్సి వచ్చేది. అప్పు తీరిన తర్వాతే ఆ ఇంటిపై వారికి సర్వ హక్కులు వచ్చేవి. జగన్ మోహన్ రెడ్డిగారు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు… మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 ఎస్ఎఫ్టీ ఇళ్ళను.. ఒక్క రూపాయి కట్టించుకుని పేదలకు రిజిస్ట్రేషన్ చేసి, పూర్తి హక్కులతో ఇస్తున్నాం. టిడ్కో ఇళ్ళు మొత్తం 2. 62 లక్షలు ఉంటే.. వాటిల్లో 300 చ. అడుగుల ఇళ్ళు 1.43 లక్షల ఇళ్ళను ఉచితంగా ఇచ్చి, వారిని సొంత ఇంటిదారులను చేస్తున్నాం. వారికి, ఏ అప్పు లేకుండా వెంటనే సర్వ హక్కులతో ఇల్లు సొంతమవుతుంది. మిగిలిన రెండు కేటగిరీలకు సంబంధించిన ఇళ్ళకు, లబ్ధిదారుని పేరిట ఇచ్చే బ్యాంకు రుణాలకు ప్రభుత్వం ఫెసిలిటేటర్ గా ఉంటుంది.
4- పథకం ఇంతా పక్కాగా, పేదలకు న్యాయం జరిగేలా అమలు చేస్తుంటే… లబ్ధిదారుల పేరిట రుణాలు అంటూ.. ఆంధ్రజ్యోతి తప్పుడు సమాచారంతో రాతలు రాయడాన్ని ఖండిస్తున్నాం.
– ప్రజల్లో అపోహలు సృష్టించి, ఎవరికో రాజకీయ ప్రయోజనం కల్పించడానికి ఈ తరహా వార్తలు రాయడంభావ్యం కాదు. లేనిపోని అపోహలు సృష్టించి.. లబ్ధిదారులను ఆందోళనకు గురి చేయవద్దు అని ఆంధ్రజ్యోతి యాజమాన్యాని చెబుతున్నాం. మీ విలువ కాపాడుకోవాలని హితవు చెబుతున్నాం.