– రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి
తాడేపల్లి : సీఎం చంద్రబాబు పాలనలో రైతన్నలకు మేలు జరుగుతోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖమంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. రాష్ట్ర వ్యవసాయ మిషన్ చైర్మన్ మర్రిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. తాడేపల్లిలో ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు.
ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడన్నారు. వ్యవసాయాన్ని, రైతులను గాలికొదిలేశాడన్నారు. వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించాడన్నారు. అధిక విద్యుత్ ఛార్జీలు భారంతో వ్యవసాయ పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయన్నారు. వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో జగన్ పాలనలో ఎందరో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. సీఎం చంద్రబాబు అధికారంలోకి రాగానే వ్యవసాయానికి మోటార్లు బిగించే కార్యక్రమాన్ని అడ్డుకున్నారన్నారు.
జగన్ రెడ్డి తీసుకొచ్చిన చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్టును రద్దుశారని మంత్రి తెలిపారు. రైతులకు మేలు కలిగేలా పొలం పిలుస్తోంది కార్యక్రమాన్నిచేపట్టారన్నారు. వ్యవసాయంలో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ, డ్రోన్ వినియోగంపై రైతులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు పంపిణీ చేశామన్నారు.
వ్యవసాయ ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో భాగంగా సౌర విద్యుత్ వినియోగం పెరిగేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రకృతి సేద్యానికి పెద్ద పీట వేస్తున్నామన్నారు.
కష్టపడిన వారికే అందలం
గడిచిన 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వం రైతు సమస్యలపై మర్రి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అలుపెరగని పోరాటం చేశారని మంత్రి సవిత కొనియాడారు. జిల్లాల్లో పర్యటించి రైతుల పడుతున్న కష్టాలపై జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారన్నారు. పార్టీలో కష్టపడేవారికి చంద్రబాబు, లోకేశ్ ఎప్పుడు ప్రాధాన్యం ఇస్తుంటారని మంత్రి వెల్లడించారు.
ఇందులో భాగంగా రైతు సమస్యలపై అలుపెరగని పోరాటం చేసిన శ్రీనివాస రెడ్డికి చంద్రబాబు ప్రభుత్వం గురుతర బాధ్యతలు అప్పగించిందంటూ ఆయన మంత్రి సవిత శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ నాయకులు వర్ల రామయ్య, పీతల సుజాత తదితరులు పాల్గొన్నారు.