హైదరాబాద్: ‘‘రాష్ట్ర ప్రభుత్వం మంచి పనులు చేసినా కొందరు చిల్లరగా మాట్లాడుతున్నారు. మీ జేబులో నుంచి ఇస్తున్నారా?’’ అని కొందరు ప్రశ్నిస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. పదేళ్లలో ఎంతో చేశామని కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటుందన్నారు. తెరాస వచ్చాక అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.
సంక్షేమంతో పాటు మూలధన పెట్టుబడులూ పెంచుతున్నామని పేర్కొన్నారు. అన్ని మతాలను గౌరవించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ అభిమతమని.. అందుకే ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎంతో చేశామని చెప్పుకొనే గత ప్రభుత్వాలు బోనాల పండుగను ఎనాడైనా పట్టించుకున్నాయా? అని ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వం బోనాల పండగకు రూ.15 కోట్లు మంజూరు చేసిందని పేర్కొన్నారు. యాదాద్రి ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.
‘‘మీకు వ్యవసాయం రాదు.. తెలివిలేదన్న ఏపీ నుంచి మనం విడిపోయాం. ఏపీ తలసరి ఆదాయం రూ.1.70 లక్షలు ఉంటే.. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.37 లక్షలుగా ఉంది. కేంద్రం తలసరి ఆదాయంతో పోల్చితే తెలంగాణది రెట్టింపు. కేంద్రం దగ్గరే లేదు.. ఇక తెలంగాణకు ఏం ఇస్తుంది? రాష్ట్రం హక్కు ప్రకారం కేంద్రం నుంచి రావాల్సింది వస్తుంది. తెలంగాణనే కేంద్రానికి ఇస్తుంది.. కేంద్రం తెలంగాణకు ఇచ్చేది లేదు. దేశ ఖజానాకు నిధులు సమకూర్చేది కేవలం నాలుగైదు రాష్ట్రాలే. వాటిలో తెలంగాణ ఒకటి. కేంద్రం అసలు ఇస్తే కదా.. నిధులు మళ్లించడం జరిగేది. భాజపా నేతలు కేంద్రం నిధులిస్తుందన్న వాదన మానేయడం మంచిది’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
త్వరలో.. సొంతభూమిలో ఇల్లు కట్టుకునే పథకం
‘‘సొంతభూమిలో ఇల్లు కట్టుకునే పథకం త్వరలో ప్రారంభిస్తాం.నియోజకవర్గానికి 1000 లేదా 1500 మందికి అవకాశం ఇస్తాం. త్వరలోనే ఈ పథకం విధివిధానాలు ఖరారు చేస్తాం. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించాకే నిధుల వినియోగం పెరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్లు ఉద్యోగులు కాకపోయినా వారు ఉద్యోగులం అనుకుంటున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను మళ్లీ తీసుకునే అవకాశం పరిశీలిస్తాం’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
కాంగ్రెస్‌కు మేనేజ్‌మెంట్ స్కిల్స్ లేవు..
కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్నే పాలించింది. కాంగ్రెస్ ఏమీ చేయలేదని మేం అనట్లేదు. మంచిగా చేయలేదని అంటున్నాం. కాంగ్రెస్ కరెంట్, నీళ్లు ఇవ్వలేదు.. మేం ఇస్తున్నాం. గతంలో కరెంట్ ఇవ్వలేకపోతే అసెంబ్లీలోనే ఉరేసుకుంటానని రోశయ్య అన్నారు. ఆయన తన సూట్‌కేసులో ఉరితాడు కూడా అసెంబ్లీకి తీసుకొచ్చారు. మేమందరం రోశయ్యను.. మీరు పెద్దమనిషి అంటూ వారించాం. ప్రపంచ మేధావి కూడా కరెంట్ ఇస్తానని ఇవ్వలేకపోయారు. కాంగ్రెస్‌కు మేనేజ్‌మెంట్ స్కిల్స్ లేవు. తెరాసకు ఉన్నాయి’’ అని సీఎం అన్నారు.