Suryaa.co.in

Andhra Pradesh

క్లిష్ట పరిస్థితుల్లో ఎఫ్.సి.ఐ బియ్యం తీసుకోకపోవడం ఇబ్బందికరం

-ఘర్షణ వైఖరితో పెడుతున్న ఇబ్బందుల వల్ల మిల్లర్లతో పాటు రైతులకు ఇబ్బందులు
-కేంద్ర ప్రభుత్వ ఎజెన్సీ పంపిణీ చేసిన ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ నాణ్యత బాగాలేవనడం సరికాదు
-భారీగా నిల్వలు పేరుకుపోతున్న నేపథ్యంలో ఎఫ్.సి.ఐ స్టోరేజీ పెంచాలి
-ఎప్.సి.ఐ స్టోరేజీ కల్పిస్తే సకాలంలో బియ్యం అందించడానికి సిద్దం
-కోటి మెట్రిక్ టన్నులకు పైగా ఉన్న ధాన్యం నిల్వల్లో కొంత వేలం ద్వారా అమ్మండి
-ప్రస్తుతం మిల్లులు నిండిపోయిన నేపథ్యంలో వచ్చే వానాకాలం సేకరణపై ఆందోళన
-యాసంగి నూక శాతం, వానాకాలం తడిసిన ధాన్యంతో మిల్లింగ్ కు తీవ్ర ఇబ్బందులు
-ఎఫ్.సి.ఐ వైఖరితో మిల్లింగ్ చేయలేమంటున్న మిల్లర్లు
-మిల్లింగ్ ఇండస్ట్రీ సమస్యలపై ఎప్.సి.ఐతో చర్చిస్తాం
-రైతుల పంట సేకరణ కేంద్ర ప్రభుత్వ బాధ్యత, తప్పుకోవద్దు
-ఎప్.సి.ఐ స్టోరేజీ, ర్యాక్ మూమెంట్ పెంచాలి
-మిల్లింగ్ ఇండస్ట్రీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం
– మంత్రి గంగుల కమలాకర్

రైస్ మిల్లర్లు పంపించిన బియ్యాన్ని నిరాకరిస్తూ ఎఫ్.సి.ఐ ఘర్షణాత్మక వైఖరి అవలంబిస్తుందని, సరైన స్టోరేజీ కల్పించకుండా, కేంద్ర ప్రభుత్వ ఎజెన్సీ నాఫెడ్ పంపించిన పోర్టిఫైడ్ రైస్ కెర్నల్ నాణ్యత సరిగా లేవంటూ ఎప్.సి.ఐ బియ్యాన్ని తీసుకోవడానికి నిరాకరించడంతో రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీ తీవ్ర ఇబ్బందులను ఎదర్కొంటోందని, ఈ పరిస్థితులు ఇలాగే కొనసాగితే సీఎంఆర్ నుండి పూర్తిగా తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందంటూ ఆవేదన వెలిబుచ్చారు మిల్లర్లు, తాజా పరిణామాలపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, సివిల్ సప్లైస్ కమిషనర్ అనిల్ కుమార్లను నేడు సచివాలయంలో కలిసి తమ సమస్యలను విన్నవించారు.

ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో ఎఫ్.సి.ఐ గోదాములు నిండిపోయాయని, పక్కనే ఉన్న జగ్గయ్య పేట తదితర ప్రాంతాల్లో స్టోరేజీ అందుబాటులో ఉన్నా ఎఫ్.సి.ఐ తీసుకోకపోవడం వల్ల బియ్యాన్ని సకాలంలో సీఎంఆర్ చేయలేకపోతున్నామన్నారు.

ఇంచుమించు రాష్ట్ర వ్యాప్తంగా ఎప్.సి.ఐ గోదాముల్లో ఖాలీలు లేక బియ్యాన్ని అందించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ పరిస్థితులకు తోడు ఎప్.సి.ఐ సప్లై చేసిన ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ తో కలిసిన ఎప్.ఆర్.కే రైస్ క్వాలిటీ సరిగా లేదంటూ దాదాపు 294 మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టడంతో సమస్య తీవ్రమౌతుందన్నారు.

ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా గత వానాకాలం, యాసంగి సీజన్లకు సంబందించిన కోటీ మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు రైస్ మిల్లుల వద్ద పేరుకుపోయాయని, మొత్తంగా కోటీ పదమూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లింగ్ చేయాల్సి ఉండగా, అందులో గత వానాకాలంలో తడిసిన ధాన్యంతో పాటు ప్రస్థుతం కురుస్తున్న వర్షాలతో ధాన్యం తీవ్రంగా పాడవుతుందని అప్పుడు సీఎంఆర్ విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ప్రభుత్వానికి విన్నవించుకున్నారు.

యాసంగి ధాన్యం విరిగిపోయి నూక శాతం పెరగడం, వానాకాలం దాన్యం తడిసిపోయిన నేపథ్యంలో వానాకాలంలోనూ 15 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ కు ఆదేశాలివ్వాలన్నారు. వీటికి తోడు ఎప్.సి.ఐ స్టోరేజీ, కొర్రీలు తదితర ఇబ్బందులతో పాటు, మరో మూడు నెలల్లో వానాకాలం సేకరణ సైతం చేయాల్సి ఉందన్నారు.

ఈ క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో తమ దగ్గర ఉన్న ప్రభుత్వ ధాన్యాన్ని వెనక్కితీసుకోవాలని, లేని పక్షంలో డిఫాల్ట్ పెట్టమనే హామీనిస్తే ప్రభుత్వ ధాన్యానికి కస్టోడియన్గా మాత్రమే ఉంటామని, అవసరమైతే బహిరంగవేలం ద్వారా దాన్యాన్ని విక్రయించాలని ప్రభుత్వాన్ని మిల్లర్లు కోరారు.

ఈ అంశాలను సావదానంగా విన్న పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. మిల్లర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్దిగా కృషిచేస్తుందన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎట్టిపరిస్థితుల్లోనూ రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విదంగా మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేపట్టారన్నారు.

రాజ్యాంగం ప్రకారం దేశంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేయాల్సిన బాధ్యతనుండి కేంద్రం తప్పుకోవద్దని సూచించారు. తక్షణమే ఎప్.సి.ఐ స్టోరేజీని కల్పిస్తే నెలకు పదిలక్షల మెట్రిక్ టన్నులను అందించేందుకు సిద్దంగా ఉన్నామని తెలియజేసారు. అప్పటికప్పుడు ఎప్.సి.ఐ ఉన్నతాధికారులతో మిల్లింగ్ సమస్యలపై చర్చించిన మంత్రి వీలైనంత త్వరగా స్టోరేజీని పెంచి ఎప్.సి.ఐ బియ్యం తీసుకోవాలని సూచించారు.

ఎట్టిపరిస్థితుల్లోనూ ఏ సీజన్ పంటను ఆసీజన్లోనే మిల్లింగ్ చేసేవిదంగా చర్యలు తీసుకోవాలని, మిల్లర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎప్.సి.ఐ ద్వారా కేంద్రం ద్రుష్టికి తీసుకెల్లాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. వేలం ప్రక్రియకు కేంద్రం అనుతించాల్సి ఉన్న నేపథ్యంలో మిల్లింగ్ ఇండస్ట్రీకి సంబందించిన సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని హామీనిచ్చారు.
ఈ కార్యక్రమంలో అధికారులతో పాటు మిల్లర్ల సంఘం అధ్యక్షులు గంపా నాగేందర్, జనరల్ సెక్రటరీలు వి.మోహన్ రెడ్డి, ఏ.సుధాకర్ రావ్, ట్రెజరర్ చంద్రపాల్ 33జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, మిల్లర్లు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE