Suryaa.co.in

Andhra Pradesh Political News

పోలవరాన్ని పాడుపెడుతున్నపాపం జగన్ దే!

స్వాతంత్ర్యం వచ్చిన ఎన్నో ఏళ్ల తరువాత కూడా కాగితాలకే,మాటలకే పరిమితం అయిన పోలవరం 2014 తరువాత నే నిజరూపదాల్చి ప్రజల కళ్ళముందు ఆవిష్కృతం అయింది. నవ్యాంధ్రకి జీవనాడి పోలవరాన్ని ఎట్టి పరిస్తితుల్లోను ఒక నిర్దిష్ట సమయానికి పూర్తి చేయాలనే పవిత్ర సంకల్పంతో ఎన్నోసవాళ్లను ఎదుర్కొంటూ ప్రాజెక్టు పనులు శరవేగంగా కొనసాగించింది గత తెలుగుదేశం ప్రభుత్వం.

2015 జనవరి వరకు తట్ట మట్టి తీయని చోట, బొచ్చెడు కాంక్రీట్ వేయని చోట 2019 మార్చినాటికి ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తి చేసింది గత ప్రభుత్వం. ప్రాజెక్టులో మూడోవంతుకు పైగా 72 శాతం పూర్తి అయి రేడియల్ గేట్లు బిగింపుకు చేరుకున్నది ప్రాజెక్టు. దేశం లో కేంద్రం ప్రకటించిన 16 జాతీయ ప్రాజెక్టులలో శరవేగంగా నిర్మాణం జరిగి 72 శాతం పనులు పూర్తి అయిన ప్రాజెక్టులలో పోలవరం ఒక్కటే.

రైతుల బంగారు భవితకు బాటలు వేసే ఈ బహుళార్ధక సాధక ప్రాజెక్టును ఎంత తక్కువ సమయంలో పూర్తి చెయ్యగలిగితే రాష్ట్రానికి అంత మేలు జరుగుతుందని భావించి ప్రాజెక్టు పనులు ఎప్పటి కప్పుడు సమీక్షిస్తూ 71 సార్లు వర్చువల్ సమీక్షలు ,26 సార్లు ఫీల్డ్ విజిట్స్ చేసి ఎక్కడ ఎటువంటి ఆటంకాలు లేకుండా పోలవరం సాకారం దిశగా పనులు పరుగులు పెట్టించారు చంద్రబాబు .

పోలవరం ఆవిష్కారం దిశగా ఉరకలు వేసింది.కానీ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోయి అధికారం అసమర్ధులు,అయోగ్యులకు దక్కడంతో పోలవరం మళ్ళీ బలి పీటమేక్కింది.13 జిల్లాల రైతాంగానికి వరప్రదాయిని అయిన బహుళార్ధక సాధక పోలవరం ప్రాజెక్టును ఒక బ్యారేజిగా, ఎత్తిపోతల పథకంగా మార్చబోతున్నది జగన్ రెడ్డి ప్రభుత్వం.పోలవరం ప్రాజెక్టు ప్రయోజనాలు అపారం.అత్యంత ప్రాధాన్యత కలిగిన పోలవరం ప్రాజెక్టు ఎత్తును 150 అడుగుల నుండి 135 అడుగులకు అంటే 45.72 మీటర్ల నుండి 41.15 మీటర్లకు తగ్గించడం ద్వారా అపార ప్రయోజనాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయి.

ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ఆశలను ఆవిరి చేసింది .ఈ చర్య ద్వారా అయిదు కోట్ల ప్రజలకు ద్రోహం చేస్తున్నారు.ఈ మోసపూరిత చర్యలను ప్రజలు అర్ధం చేసుకొని ప్రతిఘటించాల్సిన అవసరం వున్నది.

పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల జీవనాడి. ప్రత్యక్షంగా, పరోక్షంగా రాష్ట్రంలోని 26 జిల్లాలకు ఉపయోగపడే ప్రాజెక్టు.7 లక్షల 20 వేల ఎకరాలకు సాగునీరు, 40 లక్షల మందికి పైగా తాగునీరు, విశాఖ పట్నానికి చెందిన వివిధ పరిశ్రమలకు నీరు అందించడం జరుగుతుంది.

960 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి కానున్నది. గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చెయ్యడం ద్వారా యావత్‌ రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుంది. కృష్ణా, గోదావరి జిల్లాల్లోని సాగును క్రమబద్ధీకరించడం, నిత్యం కరువు కాటకాలకు గురయ్యే వెనకబడిన రాయలసీమ, ప్రకాశం జిల్లాలకు చెందిన ప్రాజెక్టులకు నికర జలాలు అందించటానికి ఆధారమౌతుంది.ఇన్ని ప్రయోజనాలు చేకూర్చే ఇంతటి ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు బ్యారేజిగా మార్చబోతున్నాయి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు.

2014లో రాష్ట్ర విభజన చట్టం ప్రకారం పార్లమెంటు సాక్షిగా ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి కేంద్రం 90%, రాష్ట్రం 10% ఖర్చు భరించాలని నిర్ణయించడం జరిగింది. తర్వాత పోలవరం ప్రాజెక్టుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఉండటానికి మాజీ సీయం చంద్రబాబు కేంద్రం పై వత్తిడి తెచ్చి తెలంగాణాకు చెందిన 7మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేయించడం జరిగింది.

ఈ 7 ముంపు మండలాల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉన్నది. ఈ మండలాల్లో 2 లక్షల ఎకరాలకు పైగా పంట భూములు నీట మునుగు తున్నాయి. 2 లక్షలకు పైగా కుటుంబాలవారిని వేరేచోటకు తరలించాల్సిన అవసరం వుంది. 2010-11 సంవత్సరాల వ్యయ అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు వ్యయం 16 వేల కోట్లుగా అంచనా వేశారు 2013-14 నాటికి 33 వేల కోట్లకు పెరగగా ఇప్పుడది 56 వేల కోట్లకు చేరింది.
దీనిని కేంద్రానికి చెందిన డి.పి.ఆర్‌. ఆమోదించడం జరిగింది. రాష్ట్రప్రభుత్వం 5,600 కోట్లు ఖర్చు పెట్టినందువల్ల ఇకనుండి అయ్యే మొత్తం ఖర్చును నూటికి నూరుశాతం కేంద్రమే భరిస్తుందని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రకటించింది.ఇప్పుడు నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక కొర్రీలు మీద ,కొర్రీలు వేస్తున్నది. విద్యుత్‌ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చును భరించలేమంటున్నారు.

నిర్వాసితుల ఖర్చు మినహాయిస్తున్నారు. ప్రాజెక్టు వ్యయం 56 వేల కోట్ల నుండి 30 వేల కోట్లకు కుదించడం జరిగింది. ఇప్పుడు ఏకంగా ఎత్తును 45.72 మీటర్ల నుండి 41.15మీటర్లకు తగ్గిం స్తాం అంటున్నారు. దానివల్ల ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 190 టియంసిల నుండి 80 టియంసిలకు పరిమితం చేసి 41.15 మీటర్ల లోపు మునిగే ప్రాంతాలలో వున్న నిర్వాసితులకు మాత్రమే చెల్లిస్తామంటున్నారు.ఈ విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలుగా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రజల ఆశలను అడియాసలు చేస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టు వ్యయాన్ని భారీగా పెంచేసింది జగన్‌ ప్రభుత్వం. 2019లో 1,771.44 కోట్లతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును రెండేళ్ల వరకు పూర్తి చేయకపోవడంతో. వరదలకు కట్టడాలకు భారీ నష్టం వాటిల్లడంతో అదనపు పనులతో కలిపి రూ.7,192.02 కోట్లకు చేరింది. ఇప్పుడు డయాఫ్రం వాల్‌ మరమ్మతుకు రూ.1,516 కోట్లు ఇసుకతో పూడ్చడానికి రూ.400 కోట్ల ఖర్చుతో మొత్తం అంచనా వ్యయం ఏకంగా రూ.9,108 కోట్లకు చేరింది.

రివర్స్‌ టెండర్స్ తో డబ్బులు మిగిల్చామని గప్పాలు కొట్టి చెప్పుకొన్న మొత్తం రూ.233 కోట్లు మాత్రమే. కానీ రూ.1,771.44 కోట్ల పనుల వ్యయం మాత్రం ఏకంగా 9,108 కోట్లకు పెరిగింది ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏం సమాదానం చెబుతుంది ? వ్యయాన్ని పెంచుకొంటూ పోతున్నారు. కానీ ప్రాజెక్టులో నీటి నిల్వ సామర్థ్యాన్నిమాత్రం అంతకంటే భారీగా తగ్గించి 41.15 మీటర్ల ఎత్తుకే ప్రాజెక్టును పరిమితం చేస్తున్నారు.

దీనికి తొలిదశ,మలి దశ అని పేర్లు పెట్టి ప్రజలను మభ్యపెడుతున్నారు. 194.60 టీఎంసీల పూర్తి సామర్థ్యంతో 45.72 మీటర్ల ఎత్తున ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పడంలేదు. కేంద్రం కూడా 45.72 మీటర్ల కాంటూరు ప్రస్తావన లేకుండా, కేవలం 41.15 మీటర్ల కాంటూరులో పనులు, భూసేకరణ, సహాయ పునరావాసానికి రూ.12,911.13 కోట్ల ఖర్చవుతుందంటూ.ఆ మొత్తానికే కేంద్ర కేబినెట్‌ ఆమోదం పొందేందుకే కేంద్ర జలశక్తి శాఖ మొగ్గు చూపడం ద్దురదృష్ట కరం.

45.72 మీటర్ల ఎత్తున 194.60 టీంఎంసీల పూర్తి సామర్థ్యంలో ప్రాజెక్టు నిర్మించేందుకు అంచనాలను ఆమోదించుకునేందుకు జగన్‌ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పై వత్తిడి చెయ్యలేక పోవడం అంటే పోలవరం ప్రాజెక్టు అపారప్రయోజనాలను బలి పెట్టడమే .తొలి దశ అంటూ రూ.12,911.13 కోట్ల తో ఒక బ్యారేజి నిర్మించి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసామని ప్రారంభోత్సవం చేసేసి 2024 ఎన్నికల్లో ప్రచారం చేసుకోని రాజకీయ లబ్ది పొందాలన్న దురాలోచన చేస్తున్నది జగన్ ప్రభుత్వం.

కేంద్ర ప్రభుత్వం పోలవరానికి అయ్యే మొత్తం ఖర్చు రూ 55 వేల కోట్లు ఇవ్వమని,2013- 14 అంచనాలకే కట్టుబడి వుంటామని,పోలవరానికి రూ 20,398 కోట్లకు మించి ఇవ్వలేమని కేంద్రం తేల్చి చెప్పిన నేపధ్యంలో ప్రాజెక్టు ఎత్తు తగ్గించే పాపానికి ఒడి గట్టారు జగన్ రెడ్డి. 31 మంది ఎంపీలు వుండి కేంద్రం పై వత్తిడి తెచ్చి నిధులు సాధించలేక సీబీఐ కేసుల కోసం కేంద్రానికి సాగిల పడి ప్రాజెక్టు ఎత్తు 41.15 మీటర్లకు ఎత్తు తగ్గించేందుకు సిద్దపడటం సిగ్గు చేటు.

నిర్వాసితులకు సహాయ,పునరావాస వ్యయాన్ని తగ్గించేందుకు వీలుగా ప్రాజెక్టు ఎత్తునే తగ్గించి రాష్ట్రప్రయోజనాలు పణంగా పెడుతున్నారు.13 జిల్లాలను స్వర్గతుల్యం చేసే,ప్రతి గ్రామాన్ని పచ్చగా మార్చే,ప్రతి పౌరుడికి ఆర్ధిక భద్రత కల్పించే పోలవరాన్నిపాడు బెడుతున్నది జగన్ ప్రభుత్వం .చేతకాని తనంతో అయిదు కోట్ల ప్రజలకు ద్రోహం చేస్తున్నజగన్ ప్రభుత్వం మోసపూరిత చర్యలను ప్రజలు అర్ధం చేసుకొని ప్రతిఘటించాల్సిన అత్యవసరం ఏర్పడింది.

– నీరుకొండ ప్రసాద్

9849625610

LEAVE A RESPONSE