– రాష్ట్ర సదస్సులో వక్తలు
– మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు నేతృత్వంలో భూ నిర్వాసితుల పోరాట కమిటీ ఏర్పాటు
విజయవాడ: ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఈనెల మూడోతేదీ స్థానిక కేఎల్ రావు భవన్ లో జరిగిన రాష్ట్ర సదస్సులో తీసుకున్న తీర్మానాలను ఈనెల నాలుగోతేదీ మాజీ మంత్రివ వడ్డే శోభనాద్రీశ్వరరావు మీడియాకు విడుదల చేశారు. రాష్ట్రంలో భూ నిర్వాసితులకు అండగా న్యాయ సలహాలు అందించడానికి, న్యాయపోరాటం చేయడానికి సుంకర రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ప్రముఖ న్యాయవాదులతో న్యాయ సలహా కమిటీని ఏర్పాటు చేశారు.
భూ నిర్వాసితుల సంరక్షణ పోరాట కమిటీ వడ్డే శోభనాద్రీశ్వరరావు నేతృత్వంలో రైతు సంఘాల రాష్ట్ర నాయకులు యం.వి. కృష్ణయ్య, పి.జమలయ్య, పౌర సంస్థల నేతలు వి.లక్ష్మణరెడ్డి, సింహాద్రి ఝాన్సీ, చిట్టిపాటి వెంకటేశ్వర్లు, డి. హరినాథ్, డాక్టర్ కొల్లా రాజమోహన్, ఎమ్మెల్సీ రఘురాజు, కొరివి వినయ్ కుమార్, వి.వెంకటేశ్వర్లు, కె.ఎం.ఎ.సుభాష్, మిరియం శ్రీనివాసులు, మరీదు ప్రసాద్ బాబు, రమణ రెడ్డి, డాక్టర్ వసుంధర, మజ్జి చిన్న, కూనం రాము తదితరులతో ఏర్పడింది.
పంటలు పండే భూములు సేకరించవద్దని నిరుపయోగ ఉన్న భూములను మాత్రమే సేకరించాలని ఇప్పటికే సేకరించిన భూముల్లో గత ఐదేళ్లలో కంపెనీలను ఏర్పాటు చేయని పక్షంలో ఆ భూములను తిరిగి రైతులకు వాపస్ ఇవ్వాలని, అమరావతి రాజధాని లో సేకరించిన భూములను అభివృద్ధి పరచకుండా నిరుపయోగంగా ఉన్న నేపథ్యంలో మరల 40 వేల ఎకరాల భూ సమీకరణ చేయాలనుకోవడం సరైన విధానం కాదని తీర్మానించింది. విజయనగరం జిల్లా, శృంగవరపు కోట, గన్నవరం ఎయిర్ పోర్ట్, కరేడు, రావూరు, చేవూరు తదితర ప్రాంతాలల్లో భూములను కోల్పోతున్న బాధితులకు అండగా నిలవాలని రాజకీయ పోరాటాన్ని చేయాలని నిర్ణయించింది.
శ్రీకాకుళంలో విద్యుత్ ప్లాంట్ లకు, విజయనగరంలో కాకరాల పల్లి అణు విద్యుత్ ప్లాంట్ లకు వేలాది ఎకరాల భూములు కట్ట పెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి సొంత నిధులు, గనుల ఏర్పాటు చేయాలని ప్రైవేటీకరణ భావనకు స్వస్థి పలకాలని తీర్మానించింది. ఒకవైపు విశాఖ స్టీల్ ను నిరుత్సాహ పరుస్తూ, మరొకవైపు మిట్టల్ కంపెనీకి 20 వేల ఎకరాలు కట్టబెట్టడాన్ని నిరాకరించింది. కరేడు గ్రామంలో మూడు పంటలు పండే 8,500 ఎకరాల భూములను ఇండోసోల్ సోలార్ ఎనర్జీ కంపెనీకి కట్టబెట్టాలనే నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.