– కస్తూరిబాయి కి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలి
– ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు
అమరావతి: పరిపాలనా కారణాలు పేరుతో సమాచార పౌర సంబంధాల శాఖలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న దళిత అధికారిణి తేళ్ల కస్తూరి భాయిని 10 నెలలుగా విధులకు దూరంగా ఉంచటం భావ్యం కాదని ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి సురేష్ బాబు పేర్కొన్నారు. అమరావతిలో సురేష్ బాబు మాట్లాడుతూ ఐ అండ్ పీఆర్ శాఖలో జేడీగా పనిచేస్తున్న తేళ్ల కస్తూరిబాయ్ పై ఎలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు లేనప్పటికీ పరిపాలన కారణాలు పేరుతో పది నెలలకు పైగా ప్రభుత్వం విధులకు దూరంగా ఉంచటం పట్ల సురేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదే శాఖలో ఇతర సామాజిక వర్గాలకు చెందిన అధికారులను ఇదే కారణంతో విధుల నుండి పక్కకు పెట్టి అందరికీ తిరిగి పోస్టింగులు ఇచ్చారని, ఇటీవల జేడీ స్థాయి అధికారి కృష్ణారెడ్డి కి కూడా తిరిగి పోస్టింగ్ ఇచ్చారని సురేష్ బాబు గుర్తు చేశారు. కస్తూరిబాయి 23 ఏళ్ళకు పైగా తన సర్వీసులో ఎలాంటి ఆరోపణలు లేకుండా నిబద్ధత, నిజాయితీతో విధులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎలాంటి ఆరోపణలు, ఫిర్యాదులు లేకుండా దళిత అధికారులను సాధారణ పరిపాలన శాఖకు రిపోర్ట్ చేయించి, పది నెలల గడుస్తున్నా పోస్టింగ్ ఇవ్వకుండా, జీతం చెల్లించక పోవడం వల్ల ఆమెతోపాటు ఆమె కుటుంబం తీవ్ర మనోవేదన, ఇబ్బందులకు గురవుతున్నారని సురేష్ బాబు వివరించారు.
ప్రభుత్వ శాఖల్లో దళిత అధికారులు, ఉద్యోగుల పట్ల ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. కస్తూరిబాయ్ దళిత అధికారిణి కావడం వల్లే ప్రభుత్వంలో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందనే అనుమానం కలుగుతోందన్నారు. కస్తూరిబాయ్ అంశాన్ని సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తోపాటు, ముఖ్యమంత్రి కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ హిమాన్షు శుక్లా దృష్టికి అసోసియేషన్ పక్షాన తీసుకువెళ్ళామని సురేష్ బాబు తెలిపారు.
ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే కస్తూరిబాయి తిరిగి పోస్టింగ్ ఇచ్చి పెండింగ్ లో ఉన్న ఆమె జీతాల బకాయిలను చెల్లించాలని సురేష్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. అవసరం అయితే ఈ అంశాన్ని ముఖ్యమంత్రి, ఎస్సీ కమిషన్ చైర్మన్ కె.జవహర్ దృష్టి తీసుకెళతామని సురేష్ బాబు అన్నారు.