– అమరావతిలో పెట్టడం అసమంజసం
– సమన్వయ నియంత్రణ పరిథి కర్నూలులోనే
కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం ఢిల్లీలో జరగడం మంచిదే. ఆ సమావేశం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు మరియు జలవనరుల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిగారు మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం – బనకచెర్ల పథకంపై సమావేశంలో ప్రస్తావన రాలేదని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడుగారు కృష్ణా, గోదావరి నదీ జలాలు, బనకచెర్లపై కమిటీ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ గందరగోళంపై ప్రజలకు స్పష్టత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రిగారిపై ఉన్నది.
కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి జలాశయాల నుండి నీటి వినియోగంపై టెలిమెట్రీ విధానాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న నిర్ణయం మరియు తీవ్ర ఆందోళన కలిగిస్తున శ్రీశైలం జలాశయం ప్లంజ్ పూల్ మరమ్మత్తు పనులను తక్షణం చేపట్టడానికి నిర్ణయం తీసుకోవడం, సముచితమైన నిర్ణయాలు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 మేరకు కృష్ణా నది యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పాల్సి ఉంది. పదకొండేళ్లు గడచినా బోర్డు కార్యాలయం హైదరాబాదులోనే కొనసాగుతున్నది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కె.ఆర్.యం.బి. కార్యాలయానికి కృష్ణా నది పరివాహక ప్రాంతానికి ఏ మాత్రం సంబంధంలేని విశాఖపట్నంకు తరలించమని కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం వ్రాస్తే తీవ్రంగా వ్యతిరేకించాం.
విజయవాడలో అఖిల పక్ష రైతు సంఘాల సమావేశం ఏర్పాటు చేసి కె.ఆర్.యం.బి. కార్యాలయాన్ని కృష్ణా నదిపై ఆధారపడి ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహణ మరియు నియంత్రణ చేయడానికి కర్నూలులో ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి, నాటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.కెఆర్ఎంబి ఆఫీసు 11 సం.లుగా హైదరాబాద్ లో ఉంది. కృష్ణా నదిపై నిర్మించిన జూరాల ఎక్కడుంది? శ్రీశైలం ఎక్కడుంది? తుంగభద్ర డ్యాం ఎక్కడుంది? కృష్ణా జలాలపై ఎక్కువగా ఆధారపడిన ప్రాంతం ఏది? పోలవరం కుడి కాలువ ద్వారా గోదావరి నీళ్ళు వస్తున్న నేపథ్యంలో కృష్ణా డెల్టా కృష్ణా నది మీద పెద్దగా ఆధారపడాల్సిన అవసరం లేదు. సాగర్ కింది భాగంలో నదిలో చేరే నీళ్లు, పులిచింతల నిల్వచేసి, అందజేస్తుంది. పోలవరం ద్వారా గోదావరి నీళ్ళు వస్తాయి.
రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై ఆధారపడిన ప్రాజెక్టులకు శ్రీశైలం జలాశయం గుండె కాయ వంటిది. దానికి సమీపంలో బోర్డు కార్యాలయం ఉంటే
సమన్వయానికి, నియంత్రణకు సౌలభ్యంగా ఉంటుంది. రాష్ట్ర రాజధానికి ఏ మాత్రం సంబంధం లేని బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడం ద్వారా వికేంద్రీకరణ విధానానికి అనుకూలం. రాష్ట్ర ఐక్యతను, సమగ్రాభివృద్ధిని బలంగా ఆకాంక్షించే వాడిగా బోర్డు కార్యాలయాన్ని కర్నూలుకు తరలించమని డిమాండ్ చేస్తున్నా. అన్ని రైతు సంఘాలు దీన్ని సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడే ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించాయి.
కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలుసార్లు విజ్ఞప్తి చేశాం. బోర్డు కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించడం తీవ్ర గర్హనీయం. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోని ఏ ప్రభుత్వం కూడా ప్రజల మన్ననలు పొందలేదు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి.

– టి. లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక