Suryaa.co.in

Andhra Pradesh

అధికారంలో ఆధిపత్యం,విపక్షంలో నీతులు చెప్పడం చంద్రబాబు గారికే సాధ్యం!

( వేణుంబాక విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యుడు)

‘రాజకీయాల్లో స్పర్థలు ఉంటాయిగాని వ్యక్తిగత వైషమ్యాలు ఉండవు,’ అని తెలుగుదేశం అధినేత ఎన్‌. చంద్రబాబు నాయుడు గారు గురువారం అమరావతిలో రాజ్‌ భవన్‌ ముందు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై ఆధిపత్యం ప్రదర్శించడం, సత్తా ఉందనే నిరంతర స్పృహతో రెచ్చిపోవడం తెలుగు ప్రజానీకానికి అనుభవమే. ఏమిటి? అని ప్రశ్నించిన వారిని వేధించడం, తనదైన శైలిలో గుణపాఠం చెప్పడం మాజీ హైటెక్‌ సీఎం గారికి అలవాటైన విద్య.

1982 మార్చిలో తన మామ గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు దానిలో చేరలేదు. కాని, 1983 జనవరిలో టీడీపీ స్థాపకుడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ ఈ అల్లుడు గారు తెర వెనుక ఉండి చేసిన పెత్తనం, రాజకీయాలు ఆయన తరం రాజకీయ నాయకులకు తెలియనివి కావు. 1995 సెప్టెంబర్‌ ఒకటిన ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణం చేసినప్పటి నుంచి 2004 మే నెలలో పదవి నుంచి దిగిపోయే వరకూ చంద్రబాబు ప్రతిపక్షాలతో ఎలా వ్యవహరించిందీ రహస్యమేమీ కాదు.

ప్రజాసమస్యలతో ఆందోళనకు దిగిన విపక్షాలను ఆయన సీఎం హోదాలో అణచివేసే ప్రయత్నం చేశారు. నిరసన ప్రదర్శనలకు వీలైనంత వరకూ అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. ఇంతటి గొప్ప రాజకీయ నేపథ్యం పెట్టుకున్న టీడీపీ నేత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ఇంటి దగ్గర ప్రజాస్వామ్య సూత్రాలు వల్లించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

పార్టీల మధ్య పోటీయేగాని శత్రుత్వం ఉండరాదన్న స్పృహ ఎప్పుడు కలిగింది?
ఏపీలో పాలకపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన ప్రతిపక్షంపై శత్రుభావంతో ఉందని నిరాధార ఆరోపణలు చేశారు చంద్రబాబు. ఈ సందర్భంగా ఆయన పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పాలక, విపక్షాలు పరస్పరం ఎలా వ్యవహరించాలో నీతులు చెప్పడమే ప్రజలకు కొత్తగా కనిపించింది. తాను మొదటిసారి ఉమ్మడి ఏపీలో దాదాపు 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రజాస్వామ్యం విలువ ఆయనకు అర్ధం కాలేదు. 2004–09 మధ్య పదేళ్లు ప్రతిపక్ష నేతగా ఆయన హాయిగా కాలం గడిపారు.

చివరిసారి సీఎంగా పనిచేసిన ఐదేళ్లూ అమరావతిలో తన ‘విశ్వరూపం’ ప్రదర్శించడానికి ఆయన ప్రయత్నించారు. అప్పటి ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ శాసససభ్యుల్లో 23 మందిని తన పార్టీలో అప్రజాస్వామికంగా చేర్చుకోవడమే కాదు, వారిలో కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. ప్రజాస్వామ్యంలో రాజకీయపక్షాల మధ్య స్పర్థ మాత్రమేగాని వ్యక్తిగత వైషమ్యాలు ఉండరాదనే విషయం 2014–19 మధ్య ఆయనకు గుర్తుకు రాలేదు. ఇప్పటికైనా ఆయనకు ఇలాంటి ప్రజాతంత్ర విలువలు గుర్తుకు రావడం హర్షణీయం. ఇవే విలువలు పాటించాలని తన కుమారుడికి, పార్టీ నేతలకు కూడా చంద్రబాబు గారు బోధిస్తే చాలా మంచిది.

LEAVE A RESPONSE