Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి, ఛాలెంజ్ చేస్తే అర్థముంటుంది

– బాబూ.. నీకో దండం అని కుప్పం ప్రజలు తుది వీడ్కోలు పలికారు
– ప్రజాస్వామ్యంలో తిరుగులేని విజయం వైయస్ఆర్సీపీ సొంతం
– ప్రతి ఎన్నికల్లోనూ వైయస్ఆర్సీపీ జైత్రయాత్ర కొనసాగుతోంది
– ఒక డివిజనో, వార్డో గెలిచి టీడీపీ పండగ చేసుకోవడం హాస్యాస్పదం
– బాబు చెర నుంచి విముక్తులైనందుకు కుప్పం ప్రజలకు అభినందనలు
– ప్రజలకు మోయలేని భారంగా టీడీపీ తయారైంది.
– జగన్ పరిపాలన మెచ్చి.. ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలు సైతం ఏపీలో కలవాలంటున్నారు
– వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డివారసత్వం.. జగన్‌ మోహన్‌ రెడ్డి మానవత్వం కలగలిపి ప్రజారంజకమైన పరిపాలన
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పాయింట్స్
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే…
టీడీపీని క్లోజ్‌ చేస్తామని అచ్చెన్నాయుడు చెబుతున్నాడు. అసలు ఆ పార్టీ ఉన్నట్లు? ఆ పార్టీని క్లోజ్‌ చేసేందుకు ఇప్పుడో కండీషన్‌…! అసలు టీడీపీని ఎవరు మూసేయమన్నారు. ప్రతిపక్షం ఉండాలి, నిర్మాణాత్మకంగా ఉండి, ప్రశ్నించాలి అనే మేం కూడా చెబుతున్నాం. అధికార, ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం సరిగ్గా నడుస్తుంది. మీరు సక్రమంగా ఉండి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండండి. మీ అయిదేళ్ల పాలనను ఎందుకు ప్రజలు ఛీకొట్టారో, జగన్‌గారి రెండున్నరేళ్ల పాలనకు ప్రజలు ఎందుకు జేజేలు కొడుతున్నారో, ప్రజల అభిమానం ఎందుకు పెరుగుతుందో సమీక్షించుకుని వచ్చే ఎన్నికలకు సిద్ధంకండి.
ఎవరికీ ఏమి పనిలేనట్లు ఎన్నికలు మూడేళ్లు ఉండగానే మొదలుపెట్టేశారు. ప్రజలకు, ఎన్నికల కమిషన్‌కు ఏమీ పనీపాటా లేదా? మీ పార్టీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం అనేది కచ్చితంగా మీ హక్కు. ఎవరెవరు రాజీనామా చేస్తారో చేసేసి… అప్పుడు పిలుపునివ్వండి. అప్పుడు మీ ఛాలెంజ్‌కు అర్థం ఉంటుంది. ఎన్నికలకు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడైనా సిద్ధమే. ప్రతిపక్షంలో ఉ‍న్నప్పుడు కూడా మేము సిద్ధంగానే ఉన్నాం. మేము జనంలో ఉన్నాం కాబట్టి దేనికీ వెనకాడేది లేదు.
పైగా రాజీనామాలు అంటూ తలకాయలేని డిమాండ్‌ను అచ్చెన్నాయుడు చేస్తున్నారు. నిక్షేపంగా, లక్షణంగా వాళ్లకున్న 10- 20 ఎమ్మెల్యే సీట్లకు రాజీనామా చేసి నిలబెట్టవచ్చు అది ఛాలెంజ్‌. మీ ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలకు వెళదాం. గెలుపు ఎవరిదో తేల్చుకుందాం. వైయస్సార్‌ సీపీ ఎప్పుడూ రెడీనే.
జగన్‌ మోహన్‌ రెడ్డి డే వన్‌ నుంచి తనవైపు నుంచి తానేమీ చేయాలో నిర్ణయించుకున్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలు మాదరిగా పొద్దుపోని డిమాండ్లు, సొల్లు కబుర్లు మేము ఎప్పుడూ చెప్పలేదు.
కాలం గడిచే కొద్ది వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సుపరిపాలనను ప్రజలు గమనించేకొద్దీ, ఆ అభిమానం వెల్లువ మరింతగా పెరుగుతుందనటానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ఇవాళ్టి ఫలితాలు కూడా గత రెండున్నరేళ్ళుగా వస్తున్న ఫలితాలకు భిన్నంగా ఏమీలేవు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు, ఫలితాలు మరింత మెరుగ్గా వస్తున్నాయి. అలాంటి ట్రెండ్‌ ఇప్పుడూ కంటిన్యూ అయింది. ఇటీవల జరిగిన బద్వేల్‌ ఉప ఎన్నికలో 90వేలకు పైచిలుకు మెజార్టీతో వైయస్సార్‌ సీపీ అభ్యర్థి గెలుపొందారు.
టీడీపీ రంగంలో లేకపోయినా బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నా అందరూ కలిసి ఏకమైనప్పటికీ ఆ మెజార్టీ వచ్చింది. పట్టణ ప్రాంతాలలో తీసుకుంటే వంద మున్సిపాల్టీలు, కార్పొరేషన్‌ లకు ఎన్నికలు జరిగితే అందులో 97 నికరంగా మేమే గెలిచాం. కోఆప్షన్‌కు ఓటు వేసే అవకాశం ఉంది కాబట్టి కొండపల్లి మున్సిపాలిటీతో కలుపుకుంటే 98వది కూడా మా ఖాతాలోనే పడే అవకాశం ఉంది.
ప్రజాస్వామ్యంలో ఇంతకంటే తిరుగులేని తీర్పు ఉండదనేది ఈ ఫలితాలను బట్టి చూస్తే తెలుస్తుంది. ఈ ఎన్నికల్లో ప్రజలు అందరూ ఎదురు చూసింది కుప్పం మున్సిపల్‌ ఎన్నిక. ఇప్పటికే కుప్పం రూరల్‌ మొత్తంగా వైయస్సార్‌ సీపీ ఖాతాలో పడ్డాక, కొన్ని దశాబ్దాలుగా చంద్రబాబు నాయుడు అడ్డాగా ఉన్న కుప్పంలో తొలిసారి ప్రజాస్వామ్యయుతంగా, పూర్తి పారదర్శకంగా ఎన్నికలు జరిగాయి. వీలైనంతవరకూ దొంగ ఓట్లు తీసివేయడం జరిగింది.
అయితే ఇప్పటికీ కొన్ని దొంగ ఓట్లు ఉన్నాయి. పూర్తిగా ఆ కలుపు మొక్కలను కూడా తీసివేయాలి. వందలో వంద పట్టణ ప్రాంత మండళ్లకు ఎన్నికలు జరిగితే వార్డుల ప్రకారంగా 75 నుంచి 80శాతం ఘన విజయం సాధించడం, పర్సంటేజ్‌ ప్రకారంగా చూస్తే.. ఓట్లకు సంబంధించి కూడా కంటిన్యూస్‌ పాజిటివ్‌ ఓటు వచ్చింది. 2019 ఎన్నికల్లో 50శాతం ఓట్లతో మొదలైన వైయస్ఆర్ కాంగ్రెస్ జైత్రయాత్ర ఆ తర్వాత 60శాతంలో నడుస్తోంది. తాజా లెక్కల ప్రకారం ఇప్పుడు కూడా అదే ట్రెండ్‌ కనిపిస్తోంది.
చంద్రబాబు పాలనతో రాష్ట్ర ప్రజలు ఎంతగా విసిగిపోయారో… అలాగే కుప్పం ప్రజలు కూడా ‘బాబూ.. నీకో దండం’ అని ఈ ఎన్నికల్లో తుది వీడ్కోలు పలికారు. కుప్పం మున్సిపల్‌ ఎన్నిక అంటే మిగిలినవన్నీ మీడియా సహా రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఉత్కంఠగా చూస్తారనుకుంటే ఉత్కంఠ లేని విధంగానే అక్కడ ఎన్నికలు జరిగాయి.
పసుపు కార్యకర్తలను తీసుకువచ్చి ఎన్నిక సమయంలో నానా యాగీ చేశారు. చంద్రబాబు బహిరంగ సభతో మొదలుపెట్టిన దుష్ప్రచారం, ఆ సభలో ఒక అమాయకుడిని చావబాది, అక్కడ నుంచి మొదలుపెట్టిన డ్రామా.. ఎలాగో అలా వైయస్సార్‌ సీపీ వాళ్లు దాడి చేశారనో, దౌర్జన్యం చేస్తున్నారని చూపే ప్రయత్నం చేసినా అది ఫలించలేదు. వైయస్సార్‌ సీపీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మేము జాగ్రత్త పడాల్సి వచ్చింది.
ఆ తర్వాత అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలతో మా ఎంపీని కూడా తిరగనివ్వలేదు. అదే టీడీపీ నాయకులు మాత్రం రోడ్లమీద ఎడాపెడా తిరిగేశారు. పోలీసులు నిష్పక్షపాతంగా, కఠినంగా ఉంటే పక్క మండలాల్లోని టీడీపీ నాయకులకు కుప్పంలో అడుగుపెట్టే అవకాశమే ఉండేది కాదు. కేకలు వేయడం, రచ్చ చేయడం, పోలింగ్ రోజు రోడ్ల మీదకు వచ్చిన సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు, ఓటర్ల క్యూ లైన్ల దగ్గరకు వెళ్లి కనపడినవాళ్లను మీ గుర్తింపు కార్డులు ఏవంటూ హడావుడి చేసినా.. టీడీపీ వ్యూహాలు ఏమీ పారలేదు.
పోలింగ్‌ బూత్‌లలో తమ పార్టీ ఏజెంట్లు లేకుండా చేశారని టీడీపీ ఆరోపణ చేసినా.. టీడీపీ ఏజెంట్‌ లేని బూత్‌ లేదని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేసింది. దొంగ ఓట్లకు సంబంధించి ఒక్కటి కూడా పట్టుబడలేదు. ఇక దొంగ ఓట్లు వేసేవాళ్లను టీడీపీ ఏజెంట్లు బయటకు తీసుకువచ్చి చూపించాలి కదా? ఒక్కరూ లేరు. ఎవరో దారినపోయేవాళ్లను పట్టుకువచ్చి దొంగ ఓటర్లని కొంతమందిని చూపించారు. బస్సుల్లో వెళుతున్న వాళ్లను తీసుకువచ్చి చూపి వాళ్లంతా వైయస్సార్‌ సీపీ వాళ్లన్నారు. వాళ్లకున్న మీడియాలో చెప్పాలనుకున్నవన్నీ చెప్పారు. ఎన్ని దౌర్జన్యాలు జరిగినా మాదే అధికారం అని చంద్రబాబు చెప్పారు. గెలవలేక సాకులు వెతుక్కుంటున్నారని మేము అప్పుడే చెప్పాం. ఈ ఫలితాలపై చంద్రబాబు ఇప్పటివరకూ స్పందించలేదు. ఒకవేళ మాట్లాడినా అదే పాత రికార్డు వేస్తారు.
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వాళ్లకు 13శాతం ఓటింగ్‌ పెరిగిందని, 12 శాతం నుంచి 30శాతం సీట్లు పెరిగాయని చెప్పారు. మరి ఏవిధంగా ఓట్లు, సీట్లు పెరిగాయో ఆయనే చెప్పాలి. ఒక సీటు ఉండి రెండు అయితే 100శాతం, అలాగే వంద ఓట్ల నుంచి 130 ఓట్లు వస్తే అది పెరిగినట్టా… అలా పర్సంటేజ్‌లు వేసుకుని పెరిగాయని వాళ్లు అనుకుంటున్నారేమో.
గుంటూరులో ఒక డివిజన్‌ గెలిచామని జాతీయ స్థాయిలో పండగ చేయాలనుకుంటే వారికి చేతులెత్తి దణ్ణం పెట్టడం తప్ప మరేమీ చేయలేం. ఉష్ణపక్షి ఇసుకలో తలదూర్చుకున్నట్లు ఇంకా టీడీపీ ఎవరిని భ్రమల్లో పెట్టాలనుకుంటుందో అర్థం కావడం లేదు. ప్రజలు వైయస్సార్‌ సీపీ పరిపాలనకు తీర్పు ఇచ్చారంటే.. టీడీపీ వాళ్లను ఏరకంగా చూడాలనేది ప్రజలే నిర్ణయించుకోవాలి.
ఎవరు విజయం సాధించినా తప్పుడు పనులు చేసి సాధించారనుకుంటే, వంద ఫలితాల్లో ఒక ఫలితం వారికి అనుకూలంగా వస్తే… ర్యాంకుల్లో నారాయణ నం.1 అని ప్రచారం చేసుకుంటున్నట్టుగా చేసుకుంటే, వాళ్లపై జాలి చూపాలా, లేక విస్మరించాలా అనేది అర్థం కావడం లేదు.
నిజమైన పాలన అంటే ఎలా ఉండాలి, మహానుభావులు కలలుగన్న స్వరాజ్యం, అందరికీ సమానత్వం, అలాగే ప్రతి పేద కుటుంబం కూడా తన కాళ్ల మీద తాను నిలబడేటట్లు, ఆ ఇంట్లో ఉండే పిల్లలు బంగారు భవిష్యత్‌ దిశగా మంచి పౌరులుగా ఉండేలా వారికి విద్యా,వైద్యం అన్నీఅందచేస్తూ ఒక కుటుంబాన్ని కేంద్ర బిందువుగా తీసుకుని చేసిన సమగ్రమైన అభివృద్ధికి వచ్చిన ఫలితమే ఇది. ఒక వైయస్సార్‌ సీపీ కార్యకర్త జెండా భుజాన వేసుకుని పోతే ప్రతి ఒక్కరూ ఆప్యాయంగా, అభిమానంగా పలకరిస్తున్నారు. ఏ ప్రాంతంలో అయినా అదే దృశ్యాలు కనిపిస్తున్నాయి. వాళ్లలో జగనన్నను చూస్తున్నారు.
జగన్‌మీద ఉన్న అభిమానంతో, ఆయన పరిపాలన మీద ఉన్న నమ్మకంతో ప్రజలు ఈ తీర్పులు ఇస్తున్నారు. అలాగే ప్రజలే ఊపిరిగా, వారికి మంచి చేయడమే లక్ష్యంగా నడిచే పార్టీ మాది. అలాంటివారిని జగన్‌గారు ప్రోత్సహిస్తున్నారు కాబట్టే ప్రజలకు అన్ని ఫలాలు కిందిస్థాయి వరకూ అందుతున్నాయి. ఫలాలు అందుకున్నవాళ్లే స్వయంగా ఫ్యాన్‌ గుర్తుకి కాకుండా మరెవరికి ఓటు వేస్తామని అంటున్నారు కాబట్టే మేము దీమాగా చెప్పగలగుతున్నాం.
ఎలాంటి కష్టం లేకుండా మీ అడ్డా అయిన కుప్పంలో.. మా పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరిగి ఓటు అడిగి, వారితో ఓటు వేయించుకున్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు పులివెందుల్లో చేసిన విన్యాసాలను ఎవరూ మర్చిపోరు. కుప్పం మాత్రమే కాదు.. ఒడిశా సరిహద్దు గ్రామాల ప్రజలు కూడా ఏపీలోనే ఉంటామని అడుగుతున్నారంటే, అందుకు కారణం రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలే. అన్నింటికీ అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా పేదరికంలో ఉన్నవారిని ఏరకంగా బయటకు తీసుకురావాలి, వారిని ఉన్నతవర్గాల వారితో సమానంగా పైకి తీసుకురావాలనే దిశగా, బలంగా అడుగులు పడుతున్నాయి కాబట్టే .. వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి వారసత్వం, జగన్‌ మోహన్‌ రెడ్డి మానవత్వం క్లియర్‌గా కనిపిస్తున్నాయి కాబట్టే ప్రజలు ఆదరిస్తున్నారు. ఇప్పటికైనా టీడీపీ రియలైజ్‌ అయితే మంచిది.
కుప్పం ప్రజలు ఇన్నేళ్లకు బాబు చెర నుంచి విముక్తులు అయినందుకు వారికి అభినందనలు. వారు తీసుకున్న నిర్ణయానికి శుభాకాంక్షలు. చంద్రబాబు కుప్పంలో ఎవరూ ఎదగకుండా ఇనుప తెరలు కట్టి చేసిన ప్రయత్నాలను వైయస్సార్‌ సీపీ ఛేదించి అక్కడకు ఎంటర్‌ అయింది. వైయస్సార్‌ సీపీని ఆదరించినందుకు కృతజ్ఞతలు. నెల్లూరులో 54 వార్డులకు 54 గెలవడం మంచి పరిణామం. ఇది రాష్ట్ర ప్రజల విజయం. జగన్‌గారు ఏదైతే పంథా అనుకున్నారో దాన్నిఆదరించిన ప్రజలకు అభినందనలు. గెలిచిన అభ్యర్థులను అభినందిస్తున్నాం.
విలేకర్ల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ..
గతం కంటే పది ఓట్లు ఎక్కువ వస్తే అదే విజయం కింద టీడీపీ అనుకుంటుంది. గతంలో దుగ్గిరాల ఎంపీపీ ఎన్నికలోనూ జాతీయ స్థాయి ఎన్నికలు అన్నట్లు ఇలాగే జబ్బలు చరుచుకుంది కదా? ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా, పారదర్శకంగా జరిగాయనటానికి దర్శి ఎన్నిక ఒకటి చాలు. అక్కడ టీడీపీకి ఇన్‌ఛార్జ్‌ కూడా లేడు.
వందకు 60 వస్తే బాగా వచ్చినట్లు… అలాంటివి 90శాతం వస్తే అవన్నీ పాజిటివ్‌ ఓట్లు కాక ఏమిటి.? ఫలితాలను మొత్తంగా తీసిపారేస్తూ.. వారికి ఒకటి వచ్చిందని చెప్పుకోవడాన్ని ఏమనుకోవాలి.
టీడీపీకి రాష్ట్రంలో లైఫ్‌ లేదు. రిలవెన్స్‌ లేదు ఇన్‌రిలవెంట్‌గా తయారైంది కాబట్టే జనం రిజెక్ట్‌ చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంలో ప్రజలను అవమానపరిస్తే ఎలా? టీడీపీ మోయలేని బరువు అయింది. అందుకే ప్రజలు టీడీపీని దించేశారు. అది రియలైజ్‌ అయితే బెటర్‌.

LEAVE A RESPONSE