Suryaa.co.in

Telangana

జాతీయ విపత్తు గా ప్రకటించాలి

– వర్షాల వల్ల రాష్ట్రంలో 5438 కోట్ల నష్టం
– పంట దెబ్బతిన్న ప్రతి ఎకరానికి 10 వేలు పరిహారం
– ప్రతి ఇంటికి తక్షణ సాయంగా రూ.పదివేలు
– పర్యటించాలని ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేశా
– తెలంగాణలో ప్రతిపక్ష నేత మౌన ముద్ర
– జాతీయ విపత్తు గా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎందుకు అడగడం లేదు?
– ఖమ్మం సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి

ఖమ్మం: భారీ వర్షాల వల్ల జనజీవితం అతలాకుతలం అయింది.ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. భారీ వర్షాల వల్ల 16 మంది ప్రాణాలు కోల్పోయారు. క్షేత్రస్థాయి నష్టాలను పరిశీలించేందుకు వచ్చాను. ప్రభుత్వం అండగా ఉంటుందనే విశ్వాసం కల్పిస్తున్నాం.

వరదల కారణంగా అంటురోగాలు వచ్చే ప్రమాదం ఉంది. వైద్య ఆరోగ్య శాఖాధికారులు చర్యలు తీసుకోవాలి. తక్షణం స్పందించడం ద్వారా నష్టాన్ని తగ్గించాం. భేషజాలకు పోకుండా కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి సాయం కోరాం. తక్షణమే జాతీయ విపత్తు గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. నాలుగు నుంచి ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వర్షాల వల్ల రాష్ట్రంలో 5438 కోట్ల నష్టం జరిగింది.

తెలంగాణ లో పర్యటించాలని ప్రధానమంత్రి మోదీకి విజ్ఞప్తి చేశాను. ఇది కష్ట సమయం. పక్క రాష్ట్రంలో ప్రతిపక్ష నేత ప్రజల దగ్గర కు వెళ్తున్నారు. తెలంగాణలో ప్రతిపక్ష నేత మౌన ముద్ర దాల్చారు. కేటీఆర్ అమెరికా లో ఎంజాయ్ చేస్తూ మంత్రులు పనిచేయడం లేదని విమర్శలు చేస్తున్నారు. జాతీయ విపత్తు గా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎందుకు అడగడం లేదు?

రాజకీయ ప్రయోజనాల కోసం మేము పనిచేయం.వర్షాల కారణంగా జనం సర్వం కోల్పోయారు. ప్రజలకు చిల్లిగవ్వ కూడా కల్వకుంట్ల కుటుంబం ఇవ్వదు. కల్వకుంట్ల కుటుంబం దోచుకున్న రూ. లక్షల కోట్ల సొమ్ములో

రూ. వెయ్యి కోట్లో.. రూ. రెండు వేల కోట్లో బాధితులకు సహాయంగా ఇవ్వవచ్చు కదా? చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల రూపాయల పరిహారం చెల్లిస్తాం.

పంట దెబ్బతిన్న ప్రతి ఎకరానికి 10 వేలు పరిహారం ఇస్తాం. వర్షాల కారణంగా నష్టపోయిన ప్రతి ఇంటికి తక్షణ సాయంగా రూ.పదివేలు ఇస్తున్నాం. తక్షణ అవసరాల కోసం జిల్లాకలెక్టర్ ఖాతాలో ఐదు కోట్లు వేశాం. వరదలపై గత ప్రభుత్వం ఒక పాలసీ ని కూడా రూపొందించలేదు.

రాష్ట్రంలోని యంత్రాంగాన్ని పూర్తిగా అప్రమత్తం చేశాం. ఇళ్లు కూలిపోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. రాబోయే ఐదారు రోజులు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపైన చర్యలు తీసుకోవాలి. వరద సహాయక చర్యల్లో పోలీసులు పాల్గొనాలి.

ప్రజల ను ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత. కొన్ని పార్టీలకు చెందిన మీడియా పోకడలు మారకపోతే ప్రజలే చూస్తారు. వ్యాపార సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు బాధితులను ఆదుకోవాలి. ఖమ్మం జిల్లా మంత్రులతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బాగా పనిచేస్తున్నారు.

LEAVE A RESPONSE