– దేహం ముక్కలైనా దేశాన్ని ముక్కలు కానివ్వం ఇదే మా నినాదం
– ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్
విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా జరిగింది. పూజా కార్యక్రమం అనంతరం జాతీయ పతాకాన్ని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లక్షలాది మంది త్యాగ ఫలంతో మనకు స్వాతంత్య్రం వచ్చింది. బలి దానం చేసిన వారందరనీ స్మరించుకోవాలి. కొంతమందికి మాత్రమే పేరు వచ్చినా కోట్లాది మంది పోరాటం గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. పింగళి వెంకయ్య వంటి వారు జాతీయ జెండా రూపకల్పన కు ఎంతో కృషి చేశారు. మన దేశం కోసం పోరాటం చేసిన వారి ఇళ్లకు వెళ్లి వారిని గౌరవించే కార్యక్రమానికి నరేంద్ర మోడీ శ్రీకారం చుట్టారు. స్విట్జర్లాండ్ లో ఉన్న శ్యాంజీ కృష్ణవర్మ చితా భస్మాన్ని మన దేశానికి తెచ్చి సబర్మతి నదిలో నరేంద్ర మోడీ కలిపారు. అలాంటి మహనీయుల కోరికలను తీర్చేలా మోడీ అడుగులు వేశారు. అనేక రకాల సవాళ్లను ఎదుర్కొంటూ దేశానికి ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు ను మోడీ తెచ్చారని మాధవ్ తెలిపారు.
మత ప్రాతిపదికన దేశం విడిపోవడం బాధాకరం. మతం ఆధారంగా దేశ విభజన జరగడం సరికాదనేది బీజేపీ విధానం.. ఎమర్జెన్సీ రోజుల్లో బీజేపీ అనుబంధ సంస్థలు ఎన్నో పోరాటాలు చేశారు. మరో స్వాతంత్య్ర పోరాటం చేసి మన రాజ్యాంగాన్ని కాపాడుకున్నాం. స్వతంత్ర భారతావనిలో కూడా జాతీయ వాద సంస్థలు పోరాటాలు చేశాయి.
సేవ్ కాశ్మీర్, సేవ్ అస్సాం, సేవ్ తిన్ బిగా ఉద్యమాలు చేసింది బీజేపీ మాత్రమేనని మాధవ్ తెలిపారు.
2014 నుంచి అధికారంలో ఉన్న మనం వల్లభాయ్ పటేల్ సేవలను గుర్తు చేస్తూ భారీ విగ్రహం ఏర్పాటు చేశాం.
హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఒక్కరిలో జాతీయ భావాన్ని పెంపొందించాం. ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాద దాడులకు తగిన బుద్ధి చెప్పాం. ఆ ఆపరేషన్ తరువాత నాలుగో అతిపెద్ద శక్తి గా మన దేశం అవతరించింది. ఆర్థికాభివృద్ధిలో కూడా ప్రపంచంలో మూడో స్థానానికి చేరుతున్నాం. దేశం కోసం అందరూ పునరంకితం కావాలి.
కులాలు, మతాలు, దేవుళ్ల పేరుతో కొట్లాడుకోవడం సరి కాదు. అందరూ కలిసి ఐక్యంగా దేశం, రాష్ట్ర అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలి.
కార్యక్రమానికి బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం అధ్యక్షత వహించగా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉప్పలపాటి శ్రీనివాసరాజు, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు షేక్ బాజి, రాష్ట్ర యువమోర్చా అధ్యక్షులు మిట్టా వంశీకృష్ణ, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, సీనియర్ నాయకులు మువ్వల సుబ్బయ్య, కిలారు దిలీప్, పైలా సోమినాయుడు, వై.రామచంద్రా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.