-ఉన్నది ఉన్నట్టుగానే చెప్పిన పవన్ కళ్యాణ్
-ప్రజల సొమ్ముతో పార్టీ పని చేయించుకోవడానికి ఏర్పాటైన వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ
-అమెరికాలోనూ జ.మో.రె ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం, అసహ్యం
-ఈ దరిద్రం ఎప్పుడు వదులుతుందని ఎదురు చూస్తోన్న ప్రవాసాంధ్రులు
-తెలుగు భాషను పరిరక్షించుకునేందుకు కృషి చేస్తున్న ప్రవాసాంధ్రులు
-పవన్ కళ్యాణ్ దండయాత్రకు, నారా లోకేష్ యువ గళం పాదయాత్రకు వెల్లువెత్తుతున్న ప్రజానీకం
-మేడలు, మిద్దెలు, చెట్లెక్కి కూడా చంద్రబాబుకు జననీరాజనం
-నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థ పై ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడారు. వాలంటీర్ల ముసుగులో మా పార్టీ మహిళా కార్యకర్తలను రోడెక్కించారు. వారి చేత ఆయన దిష్టిబొమ్మలను దహనం చేయించారు. దిష్టిబొమ్మలు దహనం చేయడం నేరం. నేను, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ( జమోరె )తో విభేదించిన తొలినాళ్లలో నా దిష్టిబొమ్మలను కూడా దహనం చేయాలని ఎమ్మెల్యేలను ఆయన ఆదేశించారు. జమోరె ఆదేశాల మేరకు నా దిష్టిబొమ్మలను ఎమ్మెల్యేలు, మా పార్టీ నాయకులు దహనం చేస్తుంటే పోలీసులు భోగి మంటలను వీక్షించినట్లుగా వీక్షించి, తంతు అంతా ముగిశాక అక్కడ నుంచి వారిని సాగనంపారు. ఎమ్మెల్యేలు చేస్తున్న దుర్మార్గాన్ని భరించలేక నా దిష్టిబొమ్మలను దహనం చేసే వారికి, నేనే గడ్డి సరఫరా చేస్తానని పేర్కొన్నాను. పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మలను దహనం చేస్తే వచ్చే నష్టం ఏముంది?, ఆయనకున్న దిష్టి పోతుంది. అదే ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను ఎవరైనా దహనం చేస్తే వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు అన్నారు.
శనివారం నాడు రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… 23 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత ఢిల్లీ నుంచి రచ్చబండ కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడడం ఆనందంగా ఉందన్నారు. వాలంటీర్ల వ్యవస్థ తప్పని నేను ఘోషిస్తూనే ఉన్నాను. ఇది నేరం అయినప్పుడు జగన్ ను క్రిమినల్ అని పవన్ కళ్యాణ్ అన్నారంటే, అనరా? మరి అంటూ ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో పార్టీ పని చేయించుకోవడానికి ఏర్పాటైన గూడాచారి వ్యవస్థనే వాలంటీర్ వ్యవస్థ.
వాలంటీర్ వ్యవస్థను తప్పు పట్టడం లేదు. ఈ వ్యవస్థను అమలు చేస్తున్న వ్యక్తిని దూషిస్తున్నాను. ఆ వ్యక్తి ఎవరో ప్రజలందరికీ తెలుసు. ముఖ్యమంత్రి జమోరె. తన పార్టీ కోసం, తన చేతికి మట్టి అంటకుండా, డబ్బులు ఖర్చు కాకుండా, అధికారికంగా ప్రజల ఇండ్లలోకి వెళ్లడానికి పార్టీ కార్యకర్తలకు వేసిన ముసుగే వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించాలంటే రాజ్యాంగబద్ధంగా అన్ని నియమావళులను అనుసరించాలి. ప్రజలకు సేవ చేయడానికి ముందుకు వచ్చారని పార్టీ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించారు.
ప్రజలకు సేవ చేసే వారికి, ప్రభుత్వం నుంచి మాత్రం డబ్బు ఇస్తాడాట?!. అయినా, వాలంటీర్లకు ప్రజల ఇండ్లకు వెళ్లేందుకు అధికారాన్ని ఎలా కట్టబెడతావు??., ఇటీవల ఒక అమ్మాయిని, వాలంటీర్ లేపుకుపోయినట్లు వార్తలు వచ్చాయి. ఎవరూ లేని టైంలో ఇళ్లల్లోకి వెళ్లి, కొంతమంది వాలంటీర్లు ఈ తరహా పనులను చేస్తున్నారు. ప్రజల ఇండ్లలోకి వెళ్లే అధికారాన్ని వాలంటీర్లకు ప్రభుత్వం ఎందుకు కట్టబెట్టిందని రఘు రామకృష్ణంరాజు నిలదీశారు.
70 ఏళ్ల వృద్ధురాలు అయినా పదవీ విరమణ చేసిన ఒక ప్రభుత్వ ఉద్యోగిని తనకు ఏ ప్రభుత్వ పథకాలు అందడం లేదని చెప్పినప్పటికీ, ఆమె ఫోటోను వాలంటీర్ బలవంతంగా తీసుకున్నట్లు ఆ పెద్దావిడ నాకు చెప్పింది. ఫోటో ఎందుకని ప్రశ్నిస్తే వాలంటీర్ సరైన సమాధానం చెప్పలేదని ఆమె తెలియజేసింది.
అయితే, రామ్ ఇన్ఫో తో పాటు మరో రెండు కంపెనీలు కసిరెడ్డి రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యునికాన్ కంపెనీతో కలిసి ప్రజల ఇష్టా ఇష్టాలకు సంబంధించిన డేటాను సేకరిస్తున్నారట. ఎవరు, ఏ సామాజిక మాధ్యమాలను ఇష్టపడతారని, అలాగే ఏ రాజకీయ నాయకున్ని అభిమానిస్తారనే విషయాన్ని తెలుసుకొని, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ను అభిమానించే వారి ఓట్లను ఓటరు జాబితా నుంచి తొలగించే ప్రయత్నాన్ని చేస్తున్నారు. అయినా 5000 రూపాయల కోసం వాలంటీర్లుగా పనిచేస్తున్న యువత భవిష్యత్తును ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. వాలంటీర్లు చేసే ఒకే ఒక మంచి పని ఏమిటంటే… ఒకటవ తేదీన వృద్ధులకు పెన్షన్లు అందజేయడం. అది కూడా నేరుగా వృద్ధుల బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తే సరిపోతుంది. కానీ, ప్రభుత్వమే నగదును బ్యాంకుల నుండి విత్ డ్రా చేసుకొని తమ వద్ద పెట్టుకొని, వాలంటీర్ల ద్వారా అందజేస్తోంది. ఐదు ఆరు రోజుల ముందు పెన్షన్లను అందజేస్తే అందులో మూడు నుంచి నాలుగు వందల రూపాయలు వాలంటీర్లు కోత పెడుతున్నారని తెలుస్తోంది.
ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే కన్నాలు వేసినప్పుడు, 5000 రూపాయల కోసం పనిచేసే వాలంటీర్లు కన్నాలు వేయరా?. వాలంటీర్ వ్యవస్థకు ఎన్నో ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ ఉండనే ఉంది. వృద్ధులకు నేరుగా పింఛన్లను అందజేయాలని భావిస్తే, ప్రజల నుండి ఎన్నికైన వార్డు సభ్యులు ఉండనే ఉన్నారు. ఒక వాలంటీర్ 50 ఇండ్లను పర్యవేక్షించినప్పుడు, అదే వార్డు నుండి ఎన్నికైన సభ్యుడు పర్యవేక్షించలేరా?. ఇంతోటి వాలంటీర్ వ్యవస్థకు ఏటా 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం, దానికోసం అవార్డుల వేడుకలు నిర్వహించి, సొంత పేపర్లో ప్రభుత్వ ఖర్చుతో అడ్వర్టైజ్మెంట్ వేయించుకోవడం మినహా ఉన్న ఉపయోగం ఏమిటి?
ప్రతిపక్ష పార్టీలకు చెందిన సానుభూతిపరుల ఓట్లను వాలంటీర్ల ప్రమేయంతో తొలగించడం పై ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది. ఒడిశాలో కూడా ఇదే తరహా నియామకాలపై అభ్యంతరం వ్యక్తం కాగా, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నిలుపుదల చేశారు. కానీ మనకు తోలు మందం… మన ముఖ్యమంత్రి చేయరు. యువతకు ఉపాధి అవకాశాలను పెంపొందించడానికి, సాంకేతిక శిక్షణను ఇవ్వండి. పెద్ద ఎత్తున పరిశ్రమలను రాష్ట్రానికి ఆహ్వానించండి. 5000 రూపాయలకు పని చేస్తున్న వాలంటీర్లకు 20 నుంచి 25 వేల రూపాయల జీతం ఇవ్వాలని ఆలోచించాలి.
నాలుగు లక్షల మంది వాలంటీర్ల భవిష్యత్తును నిర్వీర్యం చేయవద్దు. వారి భవిష్యత్తును సర్వనాశనం చేసిన వ్యక్తి జమోరె. గతంలో నేను మాట్లాడిన… ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మాట్లాడడం ద్వారా, ఈ అంశాలన్నీ వెలుగులోకి వచ్చాయి. వాలంటీర్లగా పనిచేస్తున్న వారికి ప్రత్యామ్నాయ ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన ద్వారా 20 నుంచి 25 వేల రూపాయల జీతాలు వచ్చేలా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పడనుంది. ఎవరు చెప్పినా ఐదు వేల రూపాయల కోసం గూడచారి పనులు చేయవద్దు. చక్కటి భవిష్యత్తు ఉండేలా చూసుకునే ప్రభుత్వం ఏర్పడనుందని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ పై 32 అవినీతి కేసులు లేవు
పవన్ కళ్యాణ్ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఉన్నట్లుగా 32 అవినీతి కేసులు లేవు. ఎవరు మాట్లాడినా అదే నాలుగు పెళ్లిళ్ల ప్రస్తావన. పవన్ కళ్యాణ్ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకుని, మళ్లీ పెళ్లి చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ లాగా నాకు నాలుగు పెళ్లిళ్లు కాలేదని ముఖ్యమంత్రి తరచూ ప్రస్తావిస్తున్నారు.
దానికి పెళ్లిల్లే కావాలా?, ఎవరికి తెలియనివి మీ వేషాలు. భార్యకు భరణంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన కోటి రూపాయల చెక్ గురించి కూడా మాట్లాడుతారా?, మీరు ఇలాగే చెత్తంతా మాట్లాడితే… పవన్ కళ్యాణ్ మీ చరిత్ర అంతా తవ్వితీస్తారు. టిడిఆర్ బాండ్స్ పేరిట జరిగిన 603 కోట్ల రూపాయల కుంభకోణాన్ని అనా పైసలతో సహా పవన్ కళ్యాణ్ బయటపెట్టారు. పవన్ కళ్యాణ్ ఏదీ కూడా రీసెర్చ్ చేయకుండా మాట్లాడరు. శివ శివానీ స్కూల్లో పరీక్షా పేపర్ల దొంగతనం చేసిన నువ్వా నాతో మాట్లాడేదని జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించేసరికి, సైలెంట్ అయిపోయారు.
పవన్ దండయాత్రతో, జగన్మోహన్ రెడ్డిది దండగ యాత్ర గా మారింది. జగనన్న విద్యా దీవెన పేరిట విడుదల చేసే నిధులను నాలుగు సార్లు బటన్లను నొక్కుతారు. కానీ విద్యార్థుల అకౌంట్లోకి డబ్బులు చేరవు. సొంత పేపర్లలో మాత్రం ప్రభుత్వ ఖర్చులతో అడ్వర్టైజ్మెంట్లను వేయించుకుంటారు. జగన్మోహన్ రెడ్డి సభలకు ప్రభుత్వ ఖర్చుతో డ్వాక్రా మహిళలను తరలిస్తారు. చెట్లను నరికి వేస్తారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర 15 నుంచి 20 రోజులపాటు ఉభయగోదావరి జిల్లాలో ఉర్రూతలూగించింది.
పవన్ కళ్యాణ్ సభలు ముగిసిన ఐదారు గంటల తర్వాత కూడా నేను దోహా విమానాశ్రయంలో ఆన్లైన్లో చూడగా, లైవ్ ను 6900 మంది వీక్షించడం కనిపించింది. దీన్నిబట్టి, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై ఉన్న ప్రజాగ్రహాన్ని తెలియజేస్తుంది. తద్దినానికి… అట్లతద్దికి తేడా తెలియని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటూ, పిండి వంటలకు పిండాకూడుకు కూడా తేడా తెలియదని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేసిన తీరు బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు అంటూ గతంలో సంబోధించిన, ఇప్పుడు జగ్గు భాయ్ అన్న, రేపు జగ్గు అంటూ ఏక వచనంతో మాట్లాడుతానని, ఎల్లుండి ఏమని సంబోధిస్తానో తెలియదన్న ఆయన , నీ పరిధిలో నువ్వు ఉండమని హెచ్చరించినట్లుగా ఉన్నది. పరిధి దాటి పెయిడ్ బ్యాచ్ తో నోటికొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని తెగేసి చెప్పినట్లుగా అనిపించింది.
గతంలో పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలను సహించారు. ఆయన గురించి అసహ్యంగా మాట్లాడినా, పెద్దగా ప్రతిస్పందించలేదు. దీనితో కొంతమందితో జమోరె నోటికొచ్చినట్లు మాట్లాడించారు. ఇప్పుడు చాచి గూబ పగలగొట్టినట్లుగా పవన్ కళ్యాణ్ సమాధానం చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగా తద్దినానికి, అట్లతద్దికి జగన్మోహన్ రెడ్డికి తేడా తెలుసా?, కేవలం తనకు చానల్ లేదు… పేపర్ లేదని అబద్ధాలు చెప్పడం మినహా అంటూ రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు .
హవ్వ… రాష్ట్రంలో అనాధల సంఖ్య 2.69 లక్షలా?!
కేంద్ర ప్రభుత్వం అనాథ పిల్లలను ఆదుకునేందుకు వాత్సల్యం పేరిట ఒక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం నిధులను, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రతి నెల 4వేల రూపాయలు ఖర్చు చేసి, అనాధ పిల్లల విద్యాబుద్ధులను నేర్పిస్తారు. ఈ పథకం అమలు కోసం రాష్ట్రంలోని అనాధ పిల్లల సంఖ్యను నివేదించాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనితో ఇదేదో స్కీం బాగుందని, రాత్రికి రాత్రే 9000 గా ఉన్న అనాధ పిల్లల సంఖ్యను 2.69 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు పెంచేశారు.
2021-22 లో రాష్ట్రంలో 9,000 మంది అనాధ పిల్లలు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 2.69 లక్షలకు ఎలా చేరింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను బొక్కేద్దామని ఆ సంఖ్యను పెంచారా?. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే 40% నిధులతో జగనన్న వాత్సల్యం పేరిట మరో సంక్షేమ పథకానికి తెరలేపి, సొంత పత్రికలో ప్రభుత్వ ఖర్చుతో అడ్వర్టైజ్మెంట్ వేయించుకుందామని అనుకున్నారా??, 9,000 మంది పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను ఖర్చు చేసి, మిగిలిన సొమ్ము అంతా తినేద్దామని భావించారా?
అన్నది అర్థం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నివేదించిన గణాంకాలను సరి చూసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తిప్పి పంపింది. దేశంలోనే ఇంతమంది అనాధలు లేరని, ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే ఇంతమంది ఎలా ఉన్నారని ప్రశ్నించింది. తామిచ్చిన పబ్లిసిటీ వల్ల, అనాధ పిల్లలుగా ఎక్కువమంది ఎన్ రోల్మెంట్ చేసుకున్నారని ప్రభుత్వం చెప్పి తప్పించుకునే ప్రయత్నాన్ని చేసిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.
అమెరికాలోని మిలియనీర్లలో కూడా కనిపిస్తోన్న ఆగ్రహం… అసహ్యం
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పై రాష్ట్ర ప్రజలలో కనిపిస్తున్న ఆగ్రహం, అసహ్యమే అమెరికాలో నివసిస్తున్న ప్రవాసాంద్రులలో కూడా కనిపిస్తోంది. మూడు వారాల పాటు తన అమెరికా పర్యటనలో భాగంగా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున అక్కడ స్థిరపడిన తెలుగువారు హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను, అఘాయిత్యాలను పరిశీలిస్తున్న వారు ఎంతో బాధ్యతతో ఉన్నారు. అంతే కోపంతో బాధపడుతున్నారని స్పష్టంగా అర్థం అయ్యింది.
ఈ దరిద్రం ఎప్పుడు వదిలి పోతుందని ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు వారితో నిర్వహించే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి 30 నుంచి 40 మంది రావొచ్చు అనుకుంటే, 300 మందికి తగ్గకుండా హాజరయ్యారు. 14 నుంచి 15 సమావేశాలను నిర్వహిస్తే ఒక్కొక్కసారి 500 మంది కూడా ఈ సమావేశాలలో పాల్గొన్నారు. పురుషులతోపాటు మహిళలు కూడా వీక్ డేస్ లో జరిగిన సమావేశాలకు పెద్ద ఎత్తున హాజరు కావడం ఆశ్చర్యాన్ని కలగజేసింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్, జగ్గు భాయ్ అని సంబోధిస్తుంటే… పూర్తి పేరుతో పిలవాలని ఆయన కోరుకుంటున్నారు.
అందుకే మనం ఆయన్ని జమోరె అని సంబోధిద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జమోరె అంటే ఎంత కోపం అసహ్యం కలుగుతుందో … అమెరికాలో స్థిరపడిన సంపన్నులైన తెలుగువారిలోనూ అదే ఆగ్రహం, అసహ్యం కనిపిస్తోంది. అమెరికాలోని తెలుగువారి అంత కోపంగా ఉంటే, ఆంధ్ర ప్రదేశ్ లో నివసించే వారు ఇంకా ఎంత కోపంగా ఉంటారో ఊహించుకోవచ్చు. అమెరికాలో తెలుగు భాష పరిరక్షణ కోసం అక్కడ స్థిరపడిన వారు కృషి చేస్తున్నారు. మనబడి, పాఠశాల పేరిట తెలుగు భాషను నేర్పించేందుకు చర్యలు తీసుకుంటూ, పరీక్షలను నిర్వహించి సర్టిఫికెట్లను అందజేస్తున్నారు.
రాష్ట్రంలో మాత్రం శ కు ష తేడా తెలియని వ్యక్తుల పరిపాలనలో తెలుగు భాష తన వైభవాన్ని కోల్పోయే ప్రమాదంలో పడింది. అమెరికాలో స్థిరపడిన తెలుగువారు మాత్రం భాషా సంరక్షణ కోసం కృషి చేయడమే కాకుండా, కూచిపూడి భరతనాట్యం వంటి కళలను కూడా కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎన్నోసార్లు అమెరికాకు వెళ్లాను. కానీ ఈసారి అమెరికా పర్యటన జీవితంలో గుర్తుండిపోతుంది.
ముఖ్యమంత్రి జమోరె నన్ను నియోజకవర్గంలో అడుగుపెట్టకుండా, ప్రధాని పర్యటనలో పాల్గొనకుండా ఎందుకు కట్టడి చేశారో ఇప్పుడు అర్థం అయ్యింది. అమెరికా పర్యటనలోనే ఇంతటి ప్రజాదరణ నాకు ఉంటే, నియోజకవర్గంలో ఎంతటి ప్రజాదరణ ఉంటుందో ఇంటలిజెన్స్ నివేదికల ద్వారా తెలుసుకున్న జెమోరె , నియోజకవర్గంలో నన్ను అడుగుపెట్టనివ్వడం లేదని స్పష్టమయిందని రఘురామకృష్ణం రాజు తెలిపారు.