-ఇంటింటికీ వెళ్లి టీఆర్ఎస్ మోసాలను ఎండగట్టండి
-దళితులకు కేసీఆర్ చేసిన అన్యాయాలను వివరించండి
-ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో బండి సంజయ్ వ్యాఖ్యలు
టీఆర్ఎస్ ను గద్దె దించేది… బీజేపీని అధికారంలోకి తెచ్చే ఎన్నికగా మునుగోడు ఉప ఎన్నిక మారబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఎస్సీ మోర్చా కార్యకర్తలంతా మునుగోడుకు తరలివెళ్లి ఇంటింటికీ తిరిగి కేసీఆర్ ప్రభుత్వ మోసాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. బండి సంజయ్ తోపాటు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి, ఎస్సీ మోర్చా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మునుస్వామి, రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాషా, పాదయాత్ర సహ ప్రముఖ్ కుమ్మరి శంకర్ తదితరులు హాజరైన ఈ సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు….
• తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా బీజేపీ అధికారంలోకి వస్తుందనే చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకునేందుకు ప్రతి ఒక్కరం కష్టపడాలి. ముఖ్యంగా ఎస్సీ మోర్చా పాత్ర కీలకం. దేశంలో దళితుల అభ్యున్నతికి పాటుపడే ఏకైక పార్టీ బీజేపీ. 12 మంది ఎస్సీలను కేంద్ర మంత్రులుగా చేసిన ఘనత బీజేపీదే. ఎస్సీ వ్యక్తిని రాష్ట్రపతిగా నియమించిన ఘనత బీజేపీదే.
• ఎస్సీల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మోదీదే. పంచ తీర్ధ పేరుతో బాబాసాహెబ్ అంబేద్కర్ స్పూర్తి కేంద్రాలను ఏర్పాటు చేసిన ఘనత మోదీదే. ఈ విషయాన్ని గడపగడపకూ తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎస్సీ మోర్చా కార్యకర్తలదే.అదే సమయంలో రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో దళితులకు జరుగుతున్న అన్యాయలను, అంబేద్కర్ రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్న తీరును ప్రజల వద్దకు వెళ్లి ఎండగట్టాలి.
• అదే సమయంలో టీఆర్ఎస్ ను గద్దె దించేది… బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చే ఎన్నికగా మునుగోడు ఉప ఎన్నిక మారబోతోంది. ఎస్సీ మోర్చా కార్యకర్తలంతా మునుగోడుకు తరలివెళ్లండి. ఒక్కో కార్యకర్త సగటున వంద ఇండ్లకు పోయి ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలి.
• కేసీఆర్ దళితులకు చేసినన్ని మోసాలు ఇంకెవరికీ చేయలేదు. దళిత సీఎం మొదలు దళితులకు మూడెకరాలు, దళిత బంధు హామీలన్నీ అటకెక్కించారు. ఏకంగా అంబేద్కర్ రాజ్యాంగానికే తూట్లు పొడుస్తూ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేయాలని కుట్ర చేస్తున్నడు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇవన్నీ వివరించాలి.
• దళితులను కేసీఆర్ దారుణంగా మోసం చేసినా ప్రశ్నించలేని దుస్థితిలో నేడు ఎస్సీ సమాజం ఉండటం శ్రేయస్కరం కాదు. ఇప్పుడు ప్రశ్నించకుండా మౌనం వహిస్తే తీవ్రంగా నష్టపోతాం. ఇదే విషయాన్ని దళితులందరికీ వివరించండి.
• సెప్టెంబర్ 17న తెలంగాన విమోచన దినోత్సవాలను అధికారికంగా జరపాలని బీజేపీ చేసిన పోరాటాలను వివరించండి. కేంద్రం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్ లో విమోచన దినోత్సవాలను నిర్వహిస్తున్న అంశాన్ని ప్రచారం చేయండి. బీజేపీ పోరాటాలకు దిగొచ్చి తెలంగాణ యోధుల త్యాగాలకు వక్రభాష్యం చెప్పేలా కేసీఆర్ ఫ్రభుత్వం తెలంగాణ జాతీయ సమైక్యతా దినం పేరుతో చేస్తున్న కార్యక్రమాల వెనుక ఉన్న మోసాలను, దారుస్సలాం నుండి వచ్చే నిర్ణయాలకు తలొగ్గిట కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరున తెలంగాణ సమాజానికి అర్ధమయ్యేలా వివరించండి.
• అంతకుముందు వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ బండి సంజయ్ పాదయాత్ర తెలంగాణలోని ప్రతి బీజేపీ కార్యకర్తకు స్పూర్తిదాయకమని అన్నారు. బండి సంజయ్ స్పూర్తితో మునుగోడు ఉప ఎన్నికల్లో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. మునుగోడు ఉప ఎన్నిక ప్రీ ఫైనల్ ఎన్నికలుగా అభివర్ణించారు. కొప్పు భాషా మాట్లాడుతూ తెలంగాణలో ఈరోజు బీజేపీ అధికారంలోకి వస్తుందనే వాతావరణం ఏర్పడిందంటే బండి సంజయ్ చేస్తున్న క్రుషి అని పేర్కొన్నారు. బండి సంజయ్ స్పూర్తితో ప్రతి ఒక్కరం కష్టపడి పనిచేసి ఎస్సీ మోర్చాను బలోపేతం చేస్తామని తెలిపారు.