– ఏపీసీసీ చీప్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శ
విజయవాడ: విద్యుత్ సర్దుబాటు పేరుతో ప్రజల మీద కూటమి ప్రభుత్వం విధిస్తున్నది సర్దుపోటు. పెంచేది లేదంటూనే జనాలకు బాబు పెడుతున్నవి షాకుల మీద షాకులని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆమె మంగళవారం విలేఖర్లతో మాట్లాడారు. అవి ట్రూ అప్ ఛార్జీలు కాదు..సామాన్యుడిని నడ్డి విరిచే ఛార్జీలు. రాష్ట్ర ప్రజానీకాన్ని పీల్చి పిప్పి చేసే ఛార్జీలు అని దుయ్యబట్టారు. ఆమె ఇంకా ఏమన్నారంటే…
జనం నెత్తిన మీరు పెడుతున్నది గుదిబండ. ఇప్పటికే రూ.17 వేల కోట్ల భారాన్ని మోపారు.
ఇది చాలదన్నట్లు మరో రూ.12 వేల కోట్ల మేర అధిక భారాన్ని మోపాలని చూడటం దుర్మార్గం. ట్రూ అప్ చార్జీల వసూళ్లపై విద్యుత్ నియంత్రణ మండలి ప్రజా అభిప్రాయం సేకరిస్తుంటే.. కూటమి ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుచేటు. కరెంటు ఛార్జీల వీర బాదుడులో జగన్ కి చంద్రబాబు వారసుడు. కూటమిని గెలిపిస్తే ఒక్క రూపాయి పెంపు ఉండదన్నారు.
అవసరమైతే ఛార్జీల్లో 30 శాతం తగ్గిస్తామని గొప్పలు చెప్పారు. తీరా పవర్ దక్కాక 14 నెలల్లోనే రూ.30 వేల కోట్ల సర్దుబాటు భారాన్ని జనం నెత్తిన పెడుతున్నారు. హామీలను మరిచి ఓటేసిన పాపానికి పేదోడి ఇళ్లను గుళ్ళ చేస్తున్నారు. ట్రూ అప్ తప్పు మీది కాదు సరే.. అలాగని గత YCP తప్పిదాలను ప్రజల నెత్తిన రుద్దుతారా? వైసీపీ పెట్టిన భారాన్ని జనాల దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తారా? గత పాలకుల తప్పులను సరిదిద్దడం అంటే జనాలను బాదడమా? ఏనాడో వాడిన కరెంటుకు ఇప్పుడు అదనపు ఛార్జీలు వేయడం ఏంటి? ట్రూ అప్ పేరుతో ఎన్నాళ్లు ఈ దోపిడి?
విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజలకు చంద్రబాబు చేసింది నమ్మక ద్రోహం. కూటమి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రూ.12 వేల కోట్ల సర్దుబాటు భారాన్ని ప్రజలపై పడకుండా చూడండి. ఆ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. వెంటనే చంద్రబాబు ఏపీఈఆర్సీకి లేఖ రాయాలి. గతంలో విధించిన రూ.17 వేల కోట్ల భారాన్ని సైతం వెనక్కి తీసుకోవాలి. గత ప్రభుత్వం తప్పు చేసినా.. ప్రజా కోర్టులో పడే శిక్ష మీకే అన్న సంగతి చంద్రబాబు గుర్తు పెట్టుకోవాలి.