కర్నూలు జిల్లా ఆదోనిలో “జగనన్న విద్యా కానుక” పేరిట ఒక పెద్ద ఉత్సవంలా కార్యక్రమం నిర్వహించడం ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయటమేనని టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో బుధవారం ఆయన మాట్లాడుతూ… పిల్లలకు బట్టలు, బూట్లు, బ్యాగులు, పుస్తకాలు ఇవ్వడం గతంలో టీడీపీ ప్రభుత్వం కూడా చేసింది. భవిష్యత్తులో ల్యాప్ టాప్ లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ల్యాప్ ట్యాపులు కాదు ట్యాబులు ఇస్తామనడం అన్యాయం. క్వాలిటీ ఎడ్యుకేషన్ సిస్టం రాష్ట్రంలో గతంలో మూడవ ర్యాంకులో ఉంటే దాన్ని నేడు 19వ ర్యాంకుకు దిగజార్చారు. జగనన్న విద్యా కానుక కార్యక్రమం జగన్ మాత్రమే స్వయాన ప్రవేశ పెట్టినట్లు గొప్పలు చెప్పుకుంటున్నాడు. గతంలో ఎప్పుడు జరగనట్టు ఆర్భాటాలు చేస్తున్నాడు. జగన్ రెడ్డి ఎన్ని చెప్పుకున్నా అన్నీ వృధాయే. అమ్మఒడి, విద్యాకానుక, విద్యా దీవెన లాంటి పథకాలు ఎన్ని ఇచ్చావు అన్నది కాదు.. విద్యార్థుల్లో క్వాలిటి ఎడ్యుకేషన్ ఎందుకు దిగజారిపోయిందో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. 10వ తరగతి ఫలితాలు ఎన్నడూ లేని విధంగా 67 శాతానికి దిగజార్చారు. విద్యా కానుకకు కొత్తగా నిధులు ఇస్తున్నదేమీ లేదు.
గత ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు నాయుడు బూట్లు, పుస్తకాలు, బ్యాగులు, ఆడపిల్లలకు సైకిళ్లు ఇచ్చారు. ఇవాళ కొత్తగా ఇస్తున్నట్టు కోట్లు ఖర్చు పెట్టి పేపర్ లలో పబ్లిసిటీ చేసుకుంటున్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం నాణ్యతలేని వస్తువులను పంపిణీ చేసి విద్యార్థులను, సమాజాన్ని మోసం చేస్తోంది. ఏ రాష్ట్రంలో లేనివిధంగా నిబంధనలకు విరుద్ధంగా రేషనలైజేషన్ ను రాష్ట్రంలో అమలు చేస్తున్నారు. విద్యార్థులు.. మాతృభాష వదిలేసి ఇంగ్లీషు మాత్రమే చదవమనడం అన్యాయం. గత టీడీపీ ప్రభుత్వం విద్యార్థులకు సంవత్సరానికి 26వేల కోట్లు ఖర్చుపెట్టింది. ఐదు సంవత్సరాలలో లక్షా 31వేలు ఖర్చుపెడితే జగన్ రెడ్డి ప్రభుత్వం 53 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. 53వేల కోట్లలో 12 వేల కోట్లు నాడు నేడు పథకం కింద పాఠశాలలకు వైసీపీ రంగులు వేయడానికి ఖర్చు చేశారు. నాడు నేడుకి ఖర్చు పెట్టింది తీసేస్తే మీరు ఖర్చు పెట్టింది చంద్రబాబు నాయుడుతో పోలిస్తే చాలా తక్కువ. జగన్ రెడ్డి దాదాపు 11 అంశాలలోని స్కాలర్ షిప్ లు, విదేశీ విద్య, ఎన్టీఆర్ విద్యున్నతి, నిరుద్యోగ భృతి, ఎయిడెడ్ విద్యా వ్యవస్థ, పేద విద్యార్థులు బాగా చదువుకోడానికి ప్రైవేటు స్కూళ్లయిన బెస్ట్ ఎవయిల్ బులిటి స్కూళ్లని రద్దు చేశారు. ఫీజు రియింబర్స్ మెంటు ఎటు పోతుందో తెలియని పరిస్థితి.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 8,9 తరగతుల ఆడపిల్లలకి దాదాపు 3 లక్షల సైకిళ్ళు అందజేశాము. మీకు పంచడం చేతకాక వందల కోట్ల బడ్జెట్, సైకిళ్లు తుప్పు పట్టి పోయేలా చేశారు. వీటిని రద్దు చేసి అమ్మఒడి అని ప్రవేశ పెట్టారు. అమ్మఒడికి ఎన్నో నిబంధనలు పెట్టారు. మొదటి సంవత్సరం రూ.15000లు, రెండవ సంవత్సరం రూ.14000లు ఇచ్చి మరుగుదొడ్లు మెయింటెనన్స్ కు రూ.1000లు తీసేశారు, మూడవ సంవత్సరం ఇంకేదో చెప్తూ మరో రూ.1000లు అదనంగా కోత విధించారు. ప్రైవేటు స్కూల్ మెయింటెనన్స్ ప్రభుత్వం చేయకపోయినా ప్రైవేటు స్కూలు విద్యార్థులకు ఇస్తున్న అమ్మఒడిలో ఎందుకు కోత విధించారు. టీడీపీ సంత్సరానికి 26వేల కోట్లు ఖర్చుపెడితే మీరు కేవలం 21వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. విద్యా ప్రమాణాలు దిగజారిపోయి పబ్లిసీటీలు ఎక్కువ అయ్యాయి. ఏ తరగతిని చూసినా ఫలితాలు గతంలో కంటే అధ్వాన్నంగా ఉన్నాయి. పదవ తరగతి ఫలితాలే నిదర్శనం. పేపరులు బాగానే దిద్దాం అందుకే ఫలితాలు తక్కువగా వచ్చాయని కప్పిపుచ్చుకుంటున్నారు. అమ్మఒడి సంక్షేమ ఖర్చుని పూడ్చటానికే ఫలితాల శాతాన్ని తగ్గించే సప్లిమెంటరీ ఫీజులు వసూలు చేసుకోడానికి చేశారని తెలుస్తోంది. గతంలో ఇంటర్ మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం పెడితే అది తీసేశారు. కేవలం నవరత్నాలు అమ్మఒడి అని ఒక్కటి పెట్టి రూ.15000 ఇస్తాం అని కేవలం రూ.13000 ఇచ్చారు. లబ్ధిదారుల సంఖ్యను కూడ తగ్గించేశారు. గతంలో అమ్మఒడి పొందిన వారిలో 2 లక్షల మంది లబ్ధిదారుల జాబితాలో నుంచి తప్పించారు. కొత్తగా ఎంత మంది విద్యార్థులు స్కూళ్లలో చేరారు. ఎంత మందికి అమ్మఒడి ఇచ్చారు అని చూస్తే కనీసం 50శాతం కూడ ఇచ్చిన పరిస్థితులు లేవు.
ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు ఖాళీ లేవు అని బోర్డు పెట్టాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. చాలా జిల్లాల్లో హెడ్ క్వార్టర్స్ లో, జిల్లా స్కూళ్లలో అడ్మిషన్ లు ఖాళీ లేని పరిస్థితి. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలోనూ జరిగింది. అప్పటి ఇప్పటి ప్రభుత్వానికి ఉన్న తేడా నువ్వు కోట్లు ఖర్చు పెట్టి పత్రికా ప్రకటనలు ఇస్తున్నారు టీడీపీ ఇవ్వలేదు. పాత మందుకు కొత్త సీసా అనే విధంగా పాత ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పధకాలకు పేర్లు మార్చి ఇవాళ మీరు ఇస్తున్న పథాకాల వల్ల విద్యా వ్యవస్థ బాగుపడదు…. విద్యార్థులను మోసం చేస్తున్నారు, రేషన్ లైజేషన్ పేరుతో స్కూళ్లను మూసివేస్తున్నారు. డిఎస్సీలు లేవు. మొట్ట మొదటి సారి స్కూళ్లు తెరవమని తల్లితండ్రులు రోడ్డు ఎక్కిన ఘనత జగన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుంది. ఇదే విద్యా వ్యవస్థ కొనసాగితే ఆంధ్రప్రదేశ్ లో ఇండస్ట్రీ లు ఎలా వెళ్లిపోయాయో , పెద్ద పెద్ద ఇన్ స్టిట్యూట్ లు కూడ ఇక్కడ ఉండలేమని చెప్పిన పరిస్థితి దాదాపు విద్యా వ్యవస్థకు కూడ వచ్చిందని చాలా మంది విద్యారంగ నిపుణులు చెప్తున్నారు. మీరు చేస్తున్న ఆర్భాటాలు విద్యా వ్యవస్థకు ఉపయోగపడదు. మీరు విద్యా వ్యవస్థను బాగుచేయదలచుకుంటే ఈ రాష్ట్రంలో విద్యా వేత్తలు, విద్యా రంగంలో అనుభవఘ్నలు చాలా మంది ఉన్నారు. వాళ్ళని పిలిచి మాట్లాడి వారి సలహాలను తీసుకోవాలి.
విద్యా శాఖ మంత్రి మాట్లేడేది ఆరోజు నుంచి ఈరోజుకి బోధపడటం లేదు. విద్యపట్ల అవగాహన లేని వారి చేతిలో విద్యా రంగాన్ని పెట్టడం దుర్మార్గం. ప్రజలు ఆందొళన చెంది రోడ్డు మీదకు వచ్చారంటే ప్రమాణాలు ఏ విధంగా దిగజారిపోయాయో అర్థమవుతోంది. తమ స్వార్థం కోసం విద్యా వ్యవస్థను బలి చేయడం మంచిది కాదు. విద్యా వ్యవస్థను కుంటు పరిస్తే టీడీపీ, ప్రజల తరపున వీధి పోరాటాలు చేస్తాం. జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను అడ్డుకుంటామని ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు తెలిపారు.