( మార్తి సుబ్రహ్మణ్యం)
అది నదీ తీరాన్ని ఆనుకుని ఉన్న ఒక చిన్న రాజ్యం. రాజు గారికి ఒక ఆలోచన వచ్చింది. వచ్చిందే తడవుగా వృద్ధులందరినీ రాజ్యం అవతలకు తరలించారు. సైనికులు ప్రతి ఇల్లు జల్లెడ పట్టి వృద్ధులను తరలించారు. కానీ తన తండ్రిపై ప్రేమ ఉన్న ఒక యువకుడు, తన తండ్రిని అటకపై దాచిపెట్టాడు. ఈ లోగా పక్క దేశపు రాజు తన లక్షమంది సైన్యంతో ఏ క్షణమైనా వచ్చి తన రాజ్యంపై దాడి చేస్తారన్న సమాచారంతో యువరాజును ఆందోళనకు గురిచేస్తుంది. ఎందుకంటే తన దగ్గర ఉన్న సైన్యం 20 వేలు మాత్రమే.
ఈ విషయాన్ని అటకపై తండ్రిని దాచిన యువకుడు తన తండ్రికి చెబుతాడు. దానికి ఆ వృద్ధుడు.. ఏ క్షణమైనా మన రాజ్యం నదిలో మునిగిపోతుందని ప్రచారం చేయించమని సలహా ఇస్తాడు. ఆ యువకుడు అదే విషయాన్ని యువరాజుకు చెబుతాడు. ఇదేదో బాగుందనుకున్న యువరాజు మళ్లీ అనుమానంతో, ఈ ఆలోచన నీకేవచ్చిందా? ఎవరైనా చెప్పారా? అని ప్రశ్నిస్తాడు.
దానితో భయపడిన సదరు యువకుడు..యువరాజా, నన్ను క్షమించండి. ఇది అటకపై దాచిన నా తండ్రి ఆలోచన అని వణుకుతూ చెప్పాడు. ఆ ప్రకారంగా ఆ యువరాజు తన రాజ్యాన్ని నది ఎప్పుడైనా ముంచవచ్చన్న ప్రచారం చేయించారు. ఆ ప్రచారానికి భయపడిన పక్క దేశపు రాజు ఆ రాజ్యాన్ని ఆక్రమించాలన్న ఆలోచన విరమించుకున్నాడు. దానితో కళ్లుతెరచుకున్న యువరాజు.. తాను చేసిన తప్పేమిటో తెలుసుకుని, రాజ్యం అవతలకు తరిమేసిన వృద్ధులను మళ్లీ రాజ్యంలోకి తీసుకువచ్చి వారిలో కొందరిని సలహాదారులుగా నియమించుకున్నారు. ఇది చిన్నప్పుడు ‘చందమామ’ కథల పుస్తకంలో లో అందరూ చదవిన కథ.
* * *
పార్టీ ఆవిర్భావం నుంచి గత పదేళ్లు మినహా మిగిలిన ప్రతిసారీ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తున్న తెలుగుదేశం పార్టీ.. గత ఏడాదిన్నర నుంచీ చేస్తున్న ‘జూనియర్ల ప్రయోగం’ పెద్దగా ఫలించినట్లు లేదు. తాజాగా ప్రఖ్యాత జర్నలిస్టు ఆర్నబ్ గోస్వామి డిబేట్లో, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దీపక్‌రెడ్డి నోరుజారి ప్రదర్శించిన అత్యుత్సాహం.. టీడీపీలో సీనియర్లకు సమయం వచ్చింది.. సీనియర్లు రంగంలోకి దిగాల్సిన-దించాల్సిన సంకేతాలు-హెచ్చరికలను జమిలిగా పంపింది. అంత దారుణ వైఫల్యమైన డిబేట్ అది.
నిజానికి దాన్ని దీపక్‌రెడ్డి సమర్ధవంతంగా-నేర్పు-లౌక్యంగా తిప్పికొట్టే అవకాశం ఉంది. అర్నబ్ గోస్వామి అడిగింది ఏమిటి? ఇండిగో విమానాలు ఆగిపోయి, ప్రయాణీకులు అవస్ధలు పడుతుంటే విమానయానశాఖ మంత్రి ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు అని!
దానికి దీపక్‌రెడ్డి నోరు జారి.. మంత్రి లోకేష్ దానిపై వార్‌రూం ఏర్పాటుచేసి, పరిస్థితిని చక్కదిద్దేపని చేస్తున్నారని అత్యుత్సాహం ప్రదర్శించారు. అక్కడ ఉన్నది మన తెలుగు చానెళ్లలో ఉండే చాక్పీసు ముద్దలూ, పౌడరు డబ్బాలు, బూతేశ్వర్రావులు కాదు. ఆయన ఆవులించకముందే పేగులు లెక్కబెట్టే అఘటనాఘట సమర్ధుడైన అర్నబ్ గోస్వామి! అది అల్లాటప్పా చానెల్ కానే కాదు. రిపబ్లిక్ టీవీ!!
మరి అలాంటి నేషనల్ చానెల్లో డిబేట్‌కు వెళ్లాలంటే ఎంత కసరత్తు చేయాలి? ఆల్రెడీ సబ్జెక్టు ముందే చెబుతారు కాబట్టి, దానికి సంబంధించిన అంశంపై, పార్టీ ఆఫీసు నుంచి మెటీరియల్ సేకరిస్తారు. మళ్లీ దానిపై ఒకరిద్దరు సీనియర్ జర్నలిస్టుల అభిప్రాయం తీసుకుని, అదనపు సమాచారం సేకరిస్తారు. అప్పుడు డిబేట్‌కు వెళుతుంటారు. ఇది టీడీపీలో చాలా దశాబ్దాలుగా జరుగుతున్నదే.
కానీ ఇప్పుడు కొత్త తరం రావడంతో ఆ సంప్రదాయాలు అటకెక్కాయి. ఎవరికి వారు సొంత తెలివి ప్రదర్శించి.. భావి నేత లోకేష్‌ను మెప్పించే అత్యుత్సాహంతో, ఇలా తాము అడ్డంగా ఇరుక్కుని, లోకేష్ పరువు తీస్తున్నారు. నిజానికి దీపక్‌రెడ్డి అత్యుత్సాహం లోకేష్ ప్రతిష్ఠను దెబ్బతీసింది. వైసీపీకి ఆయుధాన్ని ఇచ్చింది. మనం చే యలేని పనిని దీపక్‌రెడ్డి చేశారు. ‘‘దీపక్‌రెడ్డి పగోడు అనకున్నాం కానీ మనోడే’’నంటూ వైసీపీ సోషల్‌మీడియా వ్యంగ్యాస్త్రాలు సంధించిన పరిస్థితి.
అసలు ఈ డిబేట్లో అర్నబ్ అడిగిన ప్రశ్నకు.. ‘‘ఇండిగో వ్యవహారంతో విమానయాన శాఖకు సంబంధం లేదు. ఆ అంశాన్ని డిజిసీఏ మానటరింగ్ చేస్తుంది. ప్రధాని కూడా సమీక్షిస్తున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి డీజిసీఏతో చర్చిస్తున్నారు. ప్రయాణీకులకు ఇబ్బంది లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయమని ఆదేశించారు’’ అని కదా చెప్పాలి? పోనీ.. ‘‘నాకు ఆ సబ్జెక్టుపై అవగాహన లేదు కాబట్టి నేను డిబేటుకు రాను’’ అని కదా చెప్పాలి? గతంలో అలాగే జరిగింది కదా? కీలక అంశాలపై టీవీ చానెళ్ల నుంచి ఆహ్వానం వచ్చినప్పుడు, దానిపై నేను మాట్లాడను అని చెప్పి తప్పుకున్న నేతలు బోలెడు మంది.
దానికి భిన్నంగా.. ‘లోకేష్ వార్‌రూమ్ ఏర్పాటుచేసి, పరిస్థితిని సమీక్షిస్తున్నార’ని చెప్పిన దీపక్‌రెడ్డిపై, చిచ్చరపిడుగు అర్నబ్.. ‘‘ఈ వ్యవహారంలో లోకేష్‌కు సంబంధం ఏమిటి? ఆయన ఒక రాష్ట్ర మంత్రి కదా? సివిల్ ఏవియేషన్ మినిష్టర్ కాదు కదా? ఆయనెలా మానటరింగ్ చేయగలరు? ఒక స్టేట్ మినిష్టర్ నేషనల్ ఇష్యూని ఎలా మానటరింగ్ చేస్తార’’ంటూ కురిపించిన ప్రశ్నల వర్షంలో, దీపక్‌రెడ్డి సహజంగానే తడబడాల్సి వచ్చింది.
ఏ పార్టీకయినా యువరక్తం, నవనవోన్మేషమైన ఆలోచనలు కావలసిందే. పాత నీరు స్థానంలో కొత్త నీరు రావలసిందే. అయితే వారిని అన్ని చోట్లా ప్రయోగిస్తే ఫలితాలు ఇంతకు భిన్నంగా ఎందుకుంటాయి? దానికి సుదీర్ఘ అనుభవం- వయసు అవసరం. మొన్న దీపక్‌రెడ్డి స్ధానంలో ఏ సీనియర్ నాయకుడో ఉంటే, ఆవిధంగా నోరు జారేవారు కాదు. నేర్పుగా వ్యవహరించేవారు.
అసలు జాతీయ మీడియాకు మీడియా ప్రతినిధులను పంపించేముందు.. అందులో సున్నితమూ-కీలకమైన సమస్యపై చర్చ ఉన్నప్పుడు, అనుభవం-వయసు ఉన్న నాయకుడిని పంపించాల్సి ఉంది. అది ఇప్పుడు కనిపించడం లేదన్నది తమ్ముళ్ల ఉవాచ. అసలు దీపక్‌రెడ్డికి జాతీయ అంశాలపై ఉన్న అనుభవం ఏమిటి? కేవలం ఇంగ్లీషు వస్తే సరిపోతుందా? దానిపై విషయ పరిజ్ఞానం అవసరం లేదా? అన్నది తమ్ముళ్ల ప్రశ్న.
ఏదేమైనా ఒకరకంగా ఇది తమ మంచికే జరిగిందన్నది తమ్ముళ్ల భావన. ఈ వైఫల్యాన్ని గుణపాఠంగా తీసుకుని.. జాతీయ రాజకీయాల్లో సీనియర్ల పాత్రను, మళ్లీ పునరుద్ధరించాల్సిన అవసరాన్ని ఈ ఘటన హెచ్చరించింది. ఇప్పుడు జాతీయ మీడియా ప్రతినిధులుగా ఉన్న వారి అనుభవం-వయసు-గతానుభవం ఎంతన్న దానిపైనా చర్చకు తెరలేచింది.
పాత తరంలో సీనియర్ నేత ఎర్రన్నాయుడుకు అంత ధారాళంగా ఇంగ్లీషు-హిందీ రాకపోయినా.. కొన్ని దశాబ్దాల పాటు, జాతీయ మీడియాను సమర్ధవంతంగా ఎదుర్కొనేవారు. అలాగే యనమల రామకృష్ణుడు, కేసీఆర్, దేవేందర్‌గౌడ్, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సోమిరెడ్డి, ఉమ్మారెడ్డి, సి.రామచంద్రయ్య, కడియం, పుష్పరాజ్, దాడి వీరభద్రరావు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, కంభంపాటి రామ్మోహన్రావు, కనకమేడల రవీందర్ తదితర నేతలు మీడియాను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. వారితో సమన్వయం నెరిపారు.
ప్రధానంగా అప్పట్లో జాతీయ-అంతర్జాతీయ అంశాలపై రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సి.రామచంద్రయ్య, ఉమ్మారెడ్డి వంటి ప్రముఖులు తీవ్రమైన కసరత్తు చేసి, ఆ వివరాలను చంద్రబాబుకు సమర్పించేవారు. వీరికి ఇప్పటి అధికార భాషా సంఘం చైర్మన్ పూల విక్రమ్ ఇన్పుట్స్- టాకింగ్ పాయింట్స్ అందించేవారు. అసెంబ్లీ సమావేశాల్లో రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సబ్జెక్టుకు సంబంధించిన ఇన్పుట్స్ సేకరించి పార్టీ సభ్యులకు అందించేవారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సైతం బడ్జెట్ పుస్తకాలు, పథకాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు చెందిన సమాచారం సేకరించి, దానిపై పార్టీ అధినేత చంద్రబాబుకు నివేదికలు సమర్పించేవారు. ఆయన రోజుల తరబడి ఆ పుస్తకాలతో కుస్తీలు పడేవారు. వీరందరినీ నాటి పార్టీ కార్యాలయ కార్యదర్శి టిడి జనార్దన్ సమన్వయం చేసేవారు.
నాడు కాంగ్రెస్ సర్కారుపై ఎదురుదాడి ఎవరితో చేయించాలన్న అంశంపై.. పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో, టిడి జనార్దన్ ప్రతిరోజు ఉదయం టెలికాన్ఫరెన్సులో చర్చించి నిర్ణయించేవారు. దానిని ఎలా అమలుచేయాలో జిల్లా పార్టీ అధ్యక్షులకు కెలికాన్ఫరెన్సులో సూచించేవారు. అప్పట్లో టీడీఎల్పీ ఆఫీసు ఇన్చార్జిగా ఉన్న అమర్నాధ్ కూడా సమర్ధవంతంగా సమన్వయం చేసేవారు. అమర్నాధ్ వెళ్లిన తర్వాత, ఆ బాధ్యతను ఏపీలో కోనేరు సురేష్ నిర్వహిస్తున్నారు.
అయితే విచిత్రంగా ఇన్ని దశాబ్దాల చరిత్ర గల టీడీపీలో.. ఇప్పటివరకూ ఏ ఒక్క మీడియా ఇన్చార్జి కూడా, తమ పాత్రను సమర్ధవంతంగా పోషించిన దాఖలాలు లేవు. వారంతా మీడియాకు సమాచారం ఇవ్వడం, ప్రెస్ కాన్ఫరెన్సుల్లో చంద్రబాబు వెనక నిలబడటం, ప్రెస్‌కాన్ఫరెన్సు తర్వాత మీడియా ప్రతినిధులను భోజనాలకు తీసుకువెళ్లడం, అధికార లీకులకు పరిమితమవుతూ వస్తున్నారే తప్ప, మిగిలిన పార్టీల మీడియా ఇన్చార్జిల మాదిరిగా ఫలానా అంశంపై మీడియాతో రాయించిన సందర్భాలు లేవు. ఆ స్ధాయి-ఆలోచన ఉన్న వ్యక్తి మీడియా కమిటీ కి ఇప్పటికీ దొరక్కపోవడమే ఆశ్చర్యం.
అసలు అలాంటి సత్తా ఉన్న వారిని మీడియా కన్వీనర్లుగా ఎంపిక చేసుకోవడంలో, పార్టీ విఫలమయిందన్నది సీనియర్ల అభిప్రాయం. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీకి సంబంధించినంత వరకూ.. టీడీఎల్సీ ఆఫీసు ఇన్చార్జి కోనేరు సురేష్, కాంగ్రెస్-టీఆర్ఎస్-ప్రజారాజ్యంపై మీడియాతో వ్యతిరేక కథనాలను ఇన్పుట్స్ ఇచ్చి మరీ రాయించేవారు. ఇవన్నీ ఇప్పటి తరానికి, ఇప్పటి జర్నలిస్టులకు తెలియని అంశాలు.
చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్ర సీఎం-పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో కూడా.. 60 శాతం మంది సీనియర్లును, 40 శాతం మందిని జూనియర్లను ప్రోత్సహించారు. అంటే తుమ్మల, కోడెల, సోమిరెడ్డి, కేసీఆర్, బొజ్జల, గాలి, కెఇ, వేణుగోపాలచారి, కడియం, యనమల, ఎర్రన్నాయుడు, దాడి, దేవేందర్‌గౌడ్ వంటి సీనియర్లు ఉన్నప్పుడు కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర, కేశవ్, తలసాని, దేవినేని ఉమ, రేవంత్, అమర్నాధ్రెడ్డి వంటి యువకులను ప్రోత్సహించేవారు.
అప్పట్లో జూనియర్లను, ప్రాధాన్యం ఉన్న కీలక అంశాలపై ఇప్పటిలా మీడియాతో మాట్లాడించేవారు కాదు. వారికి పార్టీ ఆఫీసులోని లైబ్రరీకి వెళ్లి విషయజ్ఞానం పెంచుకునేందుకు అవకాశం కల్పించేవారు. చివరకు ఇప్పటి సీఎం రేవంత్‌రెడ్డికి సైతం, తొలిరోజుల్లో అంత ప్రాధాన్యం ఉండేది కాదు. ఆ రోజుల్లో ఆయన కూడా ఎక్కువ సేవు లైబ్రరీలోనే గడిపేవారు. ఆయన విషయ పరిజ్ఞానం, వాదనాపటిమ చూసిన తర్వాత మాత్రమే రేవంత్‌ను సభలో వైఎస్‌పై ప్రయోగించారు. అది హిట్టయింది. ఆ మేరకు రేవంత్ కూడా ఆ మేరకు తన సమర్ధత నిరూపించుకున్నారు.
94లో సబ్ జూనియర్‌గా ఉన్న తలసాని శ్రీనివాసయాదవ్ కూడా క్రమంగా అనుభవం పెంచుకుని పైకి ఎదిగిన నేతల్లో ఒకరు. ఒక్క తలసాని మాత్రమే కాదు. పయ్యావుల కేశవ్, నరేంద్ర, దేవినేని ఉమ వంటి యువ నేతలు కూడా నేర్చుకుని.. తమకు ఇచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకున్న నేతలే. ఆరకంగా తలసాని, రేవంత్ వంటి యువ ఫైర్బ్రాండ్లను తయారుచేసింది టీడీపీ నాయకత్వమే.
ఇప్పుడు లోకేష్ టీములో సభ్యులుగా ఉన్న బీద రవిచంద్రయాదవ్, మంతెన సత్యనారాయణ రాజుతోపాటు, టీటీడీ మెంబరు నర్శిరెడ్డి వంటి యువ నేతలు అప్పుడు సబ్ జూనియర్ నాయకులుగా ఉండేవారు. ఆ తర్వాత కాలంలో వర్ల రామయ్య, పట్టాభి, విజయకుమార్, ఆనం వెంకటరమణారెడ్డి, అనూరాధ వంటి నేతలు అధికార ప్రతినిధులుగా సక్సెస్ అయ్యారు.
సీనియర్లు సైతం ఒక కీలక అంశం మాట్లాడే ముందు.. లైబ్రరీలో గంటలపాటు కూర్చుని, బడ్జెట్ పుస్తకాలతో కుస్తీలు పట్టిన రోజులు నాకు బాగా గుర్తు. టిఫిన్, భోజనాలు కూడా లైబ్రరీకే తెప్పించుకునే వారంటే.. ఒక అంశంపై అవగాహన కోసం, వారు ఎంత సరత్తు చేసేవారో అర్ధమవుతుంది. ఉమ్మారెడ్డి, దాడి వీరభద్రరావు, రావుల చంద్రశేఖర్రెడ్డికయితే పుస్తకాల పురుగులనే పేరుండేది.
కానీ ఇపుడు తరం మారిన తర్వాత.. ఆలోచనలు-ఎంపికలూ మారుతున్నాయి. విషయజ్ఞానం కంటే విధేయతకే ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితి. ‘ఇంగ్లీషు వచ్చినంత మాత్రాన మీకు సబ్జెక్టు వచ్చినట్లు కాదు. అలాంటి ఆలోచన మీరు వదులుకోండి. అదొక కమ్యూనికేషన్ మాత్రమే. అంతమాత్రాన ఇంగ్లీషు మాట్లాడేవాళ్లని తెలివైనవాళ్లుగా, రానివారిని తెలివిలేని వారిగా భావించవద్ద’ని అమెరికన్ రచయిత డెన్జిల్ వాషింగ్టన్ చెబుతారు. ఆర్నబ్ గోస్వామి డిబేట్ వ్యవహారం చూస్తే అదే అర్ధమవుతుంది.
ఇప్పటి తరం నేతల్లో చాలామందికి ఇంగ్లీషు పరిజ్ఞానం ఉన్నప్పటికీ.. విషయం తెలుసుకునే ప్రయత్నం గానీ, చదివే ఓపిక గానీ, కనీసం వినే సహనం కూడా కనిపించడం లేదు. వీరంతా కేవలం సోషల్‌మీడియానే నమ్ముతున్నారు. దానిపైనే ఆధారపడుతున్నారే తప్ప, క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదన్నది ఒక విమర్శ.
వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్‌లో చురుకుగా ఉన్నంతమాత్రాన లీడర్లుగా ఎదుగుతామనుకోవడం అపోహ. అది ఆ రోజు వరకూ సంతృప్తి కలిగిస్తుంది. ఒక్కోసారి ఈ ఓవరాక్షన్ బూమెరాంగయి, పార్టీ నాయకత్వం నిర్దాక్షిణ్యంగా దూరం పెట్టేందుకూ కారణమవుతుంది. నిజానికి తమ మధ్యన ఉండే వారినే జనం గుర్తిస్తారు. సోషల్‌మీడియాను కేవలం, తమ తప్పులు సరిదిద్దుకునే వేదికగానే వాడుకోవాలే తప్ప.. అదే గెలిపిస్తుందనుకోవడం, దాని ద్వారానే అడ్డదారిలో మెట్లు ఎక్కవచ్చన్నది భ్రమ అన్నది చరిత్ర చెబుతున్న సత్యం.
నిజానికి కూటమి అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలో.. యువకులకు పార్టీ ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, తమ సమర్ధత నిరూపించుకోవడంలో విఫలమయ్యారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో లేకపోలేదు. కొత్త తరానికి అవకాశం ఇద్దామన్న లక్ష్యంతో చాలామందికి ఎమ్మెల్యే, ఎంపి, కార్పొరేషన్ చైర్మన్, పార్టీ జోనల్ కో ఆర్డినేటర్ల పదవులిచ్చారు.
కానీ వీరిలో 99 శాతం మంది ఇప్పటికీ తమ సమర్థత నిరూపించుకోలేకపోతున్నారన్న వ్యాఖ్యలు, పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పైగా కొత్త ఎమ్మెల్యేలలో 90 శాతం మంది సంపాదనకు ఎగబడి, పార్టీని భ్రష్టుపట్టిస్తున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇక చాలామంది యువ కార్పొరేషన్ చైర్మన్లు అధికారులపై పట్టు సాధించలేకపోతున్నారు.
ఇక గతంలో అధికారులుగా ఉండి రిటైరయి, ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లు అయిన వారి వల్ల.. పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదని, వారంతా ఇప్పటికీ అధికారులుగానే తప్ప.. పార్టీ నాయకులుగా వ్యవహరించడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు లేకపోలేదు. ‘‘ వాళ్లకు మేం ఎమ్మెల్యేలమయి పార్టీ అధికారంలోకి వస్తేనే చైర్మన్లు అయ్యామన్న స్పృహ లేదు. వాళ్లు గతంలో ఏఐఎస్, ఐపిఎస్ కావచ్చు. కానీ ఇప్పుడు వాళ్లు కూడా మా మాదిరిగానే పార్టీ నాయకులే. కానీ ఆ విషయం వారికి తెలియడం లేదు. పార్టీ నాయకులు పనిమీద వెళితే రూల్సు మాట్లాడతారు. మరి వారి వల్ల పార్టీకి ఏం ఉపయోగం? వీళ్లెవరూ పార్టీ జెండా మోసిన వాళ్లు కాదు.
జైళ్లకు వెళ్లి, కేసులు పెట్టించుకున్న వాళ్లు కూడా కాదు. ఇస్త్రీ చొక్కా నలగకుండా ఏసీ గదుల్లో కూర్చుని, పార్టీ ఆఫీసులలో డ్రాఫ్టింగ్ చేసిన వాళ్లు. మరి వాళ్లకు పార్టీలో పనిచేసే వారి విలువ ఏం తెలుస్తుంది? ఇకపై రిటైరయిన అధికారులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇవ్వకపోవడం మంచిద’’ని విజయవాడకు చెందిన ఓ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
ప్రధానంగా జగన్ అండ్ టీమ్ గత ఏడాదిన్నర నుంచీ ప్రభుత్వం-పార్టీపై చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టడంలో, యువ నేతలు, యువ ప్రజాప్రతినిధులు ఘోర వైఫల్యం చెందారన్న అసంతృప్తి పార్టీ వర్గాల్లో లేకపోలేదు. ముఖ్యంగా కొత్త మంత్రుల్లో మెజారిటీ శాతం విఫలమవుతున్నారు.
కొత్తగా మంత్రులయిన వారిలో అనగాని సత్యప్రసాద్, సవిత, రామానాయుడు.. బీజేపీ మంత్రి సత్యకుమార్‌యాదవ్ మినహా మిగిలిన కొత్త మంత్రులెవరూ గళమెత్తడం లేదు. అందుకు వారి అనుభవ రాహిత్యమే కారణం. సుదీర్ఘ అనుభవం ఉన్న కేశవ్ లాంటి సీనియర్లు సైతం, తొలిసారి మంత్రి అయినా తన సమర్ధత నిరూపించుకోవడంలో విఫలమయ్యారన్న వ్యాఖ్యలు లేకపోలేదు. కొందరు కొత్త మంత్రులకు తమ సమర్ధత నిరూపించుకోవాలన్న పట్టుదల కంటే.. పదవిలో ఉన్నంతకాలం నాలుగురాళ్లు వెనకేసుకుందామన్న తపనే కనిపిస్తోందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
ఇప్పుడు టీడీపీలో సీనియర్లు ఎవరికి వారు స్పందించి ప్రెస్మీట్లు పెడతున్నారే తప్ప, గతంలో మాదిరిగా పార్టీ కార్యాలయం నుంచి అసైన్మెంట్లు ఇస్తున్నట్లు లేదు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు, సోమిరెడ్డి, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, పరిటాల సునీత, ధూళిపాళ్ల నరేంద్ర, యరపతినేని, కన్నా, జీవీ ఆంజనేయులు, కోట్ల సుజాత, బీద రవిచంద్ర.. ఎంపీల్లో నంద్యాల ఎంపి బైరెడ్డి శబరి ఒక్కరే జగన్‌పై ఎవరికి వారు సొంతగా ఎదురుదాడి చేస్తున్నారు. గత ఎన్నికల్లో కొత్తవారికి ఎంపీలుగా అనేకమందికి అవకాశం ఇచ్చినా వారిలో ఒక్కరూ జగన్‌పై ఎదురుదాడి చేస్తున్నది లేదంటున్నారు.
నిర్మొహమాటంగా ఒక్కముక్కలో చెప్పాలంటే, ఇప్పుడు టీడీపీలో సీనియర్లకు పెద్దగా ప్రాధాన్యం లేదు. అన్ని వ్యవహారాల్లో కొత్తవారు, విధేయులతో నడిపిద్దామన్న వైఖరి కనిపిస్తోందన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. దానితో సీనియర్లు తమ ఉనికి చాటుకోవలసిన వైచిత్రి. పోనీ పార్టీ నాయకత్వం ప్రోత్సహిస్తున్న ఆ యువనాయకులేమైనా చురుకుగా ఉండి, జగన్ పార్టీపై ఎదురుదాడి చేస్తున్నారా అంటే అదీ లేదు. అదీ ఇప్పటి పరిస్థితి.
అసలు సీనియర్ల ప్రాధాన్యం తగ్గించి, వారి స్థానంలో కొత్తవారిని తయారుచేయాలన్న ప్రయోగం, దేశంలోని ఏ పార్టీలోనూ సక్సెస్ అయిన దాఖలాలు లేవు. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ ప్రయోగం బెడిసికొట్టింది. కేటీఆర్ టీమ్ ఘోరంగా విఫలమయింది. కొత్త తరం నేతల్లో చాలామందికి వ్యాపార ధోరణి, కాంట్రాక్టులు, అధినేతలకు భజన చేయడం తప్ప.. పార్టీ పదికాలాలు ఉంటేనే తాము ఉంటామన్న మనస్తత్వం కనిపించలేదు. కొత్త తరానికి పాత వారి సేవలు, అనుభవం తెలియదు. వారికి తెలిసిందల్లా అధినేతలను ఎలా మెప్పించడం అన్నదే!
నిజానికి ఈ ‘యువ ప్రయోగం’ యుపిఏ-1లోనే జరిగింది. అప్పుడే సీనియర్లను పక్కనబెట్టి, యువకులకు అవకాశం కల్పించే ప్రయోగం బెడిసికొట్టింది. రాహుల్ ఎంపిక చేసిన యువ బృందంలో, ముప్పావు శాతం తర్వాత బీజేపీలోకి జంపయ్యారు. యువకులతో పెట్టిన అసోం గణపరిషత్ తొలిరోజుల్లో అద్భుతం సృష్టించినా, తర్వాత అది పూర్తిగా కనుమరుగయింది. సో.. సీనియర్లు పార్టీకి భారం.. కొత్త రక్తంతో పార్టీని నడిపించాలన్న ప్రయోగం ఎక్కడా సక్కెస్ కాలేదన్నమాట. రాజకీయ పార్టీకి అనుభవం ప్రాణవాయువు లాంటిది. ఈ నిజాన్ని గమనించ కపోతే నష్టపోయేది పార్టీలే! ఏదేమైనా.. దీపక్‌రెడ్డి వ్యవహారం టీడీపీలో సీనియర్ల అవసరాన్ని స్పష్టం చేసింది!
* * *
ఇదొక్కటే కాదు. మీకు గుర్తుందా? కొద్దినెలల క్రితం జగన్ గుంటూరు జిల్లా పర్యటనలో, ఆయన కారు కింద పడి ఒక వృద్ధుడు మృతి చెందిన విషాదం తెలిసిందే. ఆ సమయంలో ఆయన కుటుంబ సభ్యులు కూడా జగన్‌ను తిట్టిపోసినట్లు వార్తలొచ్చాయి. టీడీపీ నేతలయితే అధికారంలో ఉండి కూడా, విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అదో విచిత్రం! ఆ ఘటన జరిగిన కొద్దిరోజుల తర్వాత.. అంతా విస్తుపోయేలా, సదరు మృతి చెందిన కుటుంబసభ్యులు జగన్ నివాసానికి చేరి, ఆయనతో ఫొటో తీసుకున్నారు.
సూటిగా చెప్పాలంటే ఇది టీడీపీ వ్యూహ వైఫల్యం. గతంలో ఇలాంటి ఘటన జరిగితే.. పార్టీ సీనియర్లు రంగంలోకి దిగి, మృతుని కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత వారికి ఎంతో కొంత ఆర్ధికసాయం చేసి, కుటుంబసభ్యులను చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లేవారు. అంటే పార్టీ సమన్వయం, వ్యూహాలు, దూరదృష్టి ఆ స్ధాయిలో ఉండేవన్నమాట.
ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండి కూడా.. జగన్ బాధిత కుటుంబాన్ని తమ వైపు తీసుకువెళ్లలేకపోయారంటే, పార్టీకి సీనియర్ల కొరత-వ్యూహలేమి- జూనియర్ల వైఫల్యం ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. సీనియర్ల భాగస్వామ్యం లేకపోతే, ప్రత్యర్ధులు ఎలా బలపడతారన్నది ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. అదొక్కటే కాదు.. జగన్ దగ్గర ఎలాంటి టీము ఉంది? టీడీపీలో అలాంటి టీములు ఎందుకు లేవన్నది ప్రశ్న. మీకు అర్ధమవుతోందా?