Suryaa.co.in

Telangana

స్పీకర్ గడ్డం ప్రసాద్ సభాపతిగా మీకు కనిపించడం లేదా?

– జగదీష్ రెడ్డిని ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేయాలి
– జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉన్నాయి
– అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చ క్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పై శాసనసభ్యులు జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై చర్చ క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైద‌రాబాద్‌: స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డిని ఈ సెషన్ మొత్తానికి సస్పెండ్ చేయాలి. సభ్యుడి వ్యవహార శైలిపై ఎథిక్స్ కమిటీకి పంపండి. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోండి. జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉన్నాయి. ప్రజాస్వామ్యం, సభ సాంప్రదాయాల పైన మాకు గౌరవం ఉంది.

స్పీకర్ గడ్డం ప్రసాద్ సభాపతిగా మీకు కనిపించడం లేదా?
శాసన సభాపతి గడ్డం ప్రసాద్ పై ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు ఈ సెషన్ మొత్తం పూర్తిగా సస్పెండ్ చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు కోరారు. ఈ సభ్యుడి వ్యవహార శైలిపై ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేసి వారి నిర్ణయం మేరకు తదుపరి చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. శాసనసభలో స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చులకనగా మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా ఉందని వ్యాఖ్యానించారు.

“మా అందరి తరపున మీరు పెద్ద మనిషిగా మాత్రమే కూర్చున్నారే తప్ప ఈ సభ నీ సొంతం కూడా కాదు” అని గౌరవ స్పీకర్ ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి చులకనగా మాట్లాడటం బట్టీ చూస్తే వారు మిమ్మల్ని సభాపతిగా చూడటం లేదన్నారు. మీ స్థానంలో ఎవరు కూర్చున్నా సభాపతినే. గడ్డం ప్రసాద్ ను సభాపతిగా చూడకుండా ఇంకో రకంగా చూడటం బాధాకరమన్నారు. శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా బిఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించి కెసిఆర్ ఇదే ఉద్భోధ చేశారా అని ప్రశ్నించారు. మీ సంస్కారం చూస్తుంటే బాధగా ఉంది. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసినట్టుగా చేసిన వ్యాఖ్యలను సభలో సభ్యులందరూ ముక్త కంఠంతో ఖండిస్తున్నామని చెప్పారు.

అసెంబ్లీ ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిదని, అలాంటి అసెంబ్లీలో సభను నియంత్రిస్తూ, ఆర్డర్లో పెడుతూ, సజావుగా నడిపించడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి భారత రాజ్యాంగం స్పీకర్ కు విశేష అధికారాలు ఇచ్చిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభ స్పీకర్ గురించి ఒక సభ్యుడు శాసనసభ వెలుపల అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయమై ఆనాడు ఎథిక్స్ కమిటీకి పంపించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

2014 బిఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ప్రతిపక్ష సభ్యులుగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ ల సభ్యత్వాన్ని రద్దు చేసిందన్నారు. సభ సాంప్రదాయాలు కాపాడటానికి కఠిన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. మూడ్ ఆఫ్ ది హౌస్ ప్రకారం ప్రకారం శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కొంత మంది సభ్యులు కోరినట్లు చెప్పారు. కానీ మాకు ప్రజాస్వామ్యం, సభ సాంప్రదాయాల పైన గౌరవం ఉంది కాబట్టి ఈ సెషన్ మొత్తం పూర్తిగా సస్పెండ్ చేయాలని, అదే విధంగా సభ్యుడి వ్యవహార శైలిపై ఎథిక్స్ కమిటీకి పంపి, విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

సభలో స్పీకర్, ముఖ్యమంత్రి, మంత్రులు మాట్లాడుతున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు రన్నింగ్ కామెంట్రీ చేయడం, హేళనగా మాట్లాడడం సభకు శోభను తీసుకురాదన్న విషయాన్ని గ్రహించాలన్నారు. సభ సాంప్రదాయాలను కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. సభాపతిని గౌరవించాల్సిన అవసరం ప్రతి సభ్యుడుపై ఉందని నొక్కి చెప్పారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదా తీర్మానంపై చాలా ఉన్నతంగా, గొప్పగా ధన్యవాదాలు చెప్పాల్సిన ప్రతిపక్ష సభ్యులు అవహేళనగా మాట్లాడటం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేసే విధంగా ఉందని అన్నారు.

LEAVE A RESPONSE