– మెగా కిసాన్ మేళా ప్రారంభంలో అచ్చెన్నాయుడు, జీవీ, కన్నా విమర్శ
– మెగా కిసాన్ మేళాలను ప్రారంభించిన అచ్చెన్నాయుడు, జీవీ
వినుకొండ: రైతుల సాగు మెళకువలు తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన మెగా కిసాన్ మేళా వేదికగా వైసీపీ విమర్శలనూ గట్టిగా తిప్పికొట్టారు కూటమి ప్రభుత్వం ప్రముఖులు. ప్రజలు 151 నుంచి 11 స్థానాలకు పడేసినా గుణపాఠం నేర్చుకోకుండా అంతులేని అబద్ధాలు, అసత్య ప్రచారాలకు జగన్, వైసీపీ కేరాఫ్‌గా మారారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు, చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, జూలకంటి బ్రహ్మారెడ్డి మండిపడ్డారు.
ఫేక్ వీడి యోలు, తప్పుడు సమాచారంతో రాజధాని అమరావతిపై ఇకనైనా విషం చిమ్మడం మానక పోతే రాష్ట్ర ద్రోహులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. వినుకొండ మార్కెట్ యార్డులో మంగళవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో మెగా కిసాన్ మేళా జరిగింది. చీఫ్ విప్, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు ఈ మేళాను ప్రారంభించా రు. ఈ సందర్భంగా నూతన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డ్రోన్లు, డ్రిప్ ఇరిగేషన్, ట్రాక్టర్లు, స్ప్రేయర్లు, పశుసంవర్ధక, పట్టుపరిశ్రమ, ఉద్యానశాఖ, మత్స్యశాఖ, బ్యాంకింగ్ సేవలు తదితర రంగాలకు చెందిన 150 స్టాళ్లు ఏర్పాటు చేశారు.
శాస్త్రవేత్తలు రైతులకు పంటల రక్షణ, అధిక దిగుబడి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉద్యాన పంటల పెంపకం, డెయిరీ, ఫౌల్ట్రీ, చేపలు, గొర్రెల పెంపకం వంటి అనుబంధ రంగాల్లో లాభాలు సాధించే మార్గాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ 43 ఏళ్ల చరిత్రలో అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఎల్లప్పుడూ ప్రజల కోసం పని చేసిందన్నారు.
కానీ, 2019లో ఒక దుర్మార్గుడు తప్పుడు హామీలిచ్చి సీఎం అయ్యాక తెదేపా నాయకులు, కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని జగన్ నాటి అరాచక పాలనపై చురకలు వేశారు. గతేడాది ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్, ప్రధాని మోదీ పిలుపు మేరకు కూటమి గెలిచి 164 సీట్లు సాధించిందన్న ఆయన ఈ విజయం కార్యకర్తల త్యాగ ఫలితమని కొనియాడారు. ప్రధాని మోదీ నేతృత్వం లోని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి ఊహించలేనంత సాయం అందిస్తోందన్న అచ్చెన్న అబద్ధాల మీద పుట్టిన పార్టీ, అబద్ధాల నాయకుడు జగన్ ఇప్పుడు కూడా అదే దుష్ప్రచారాలు కొనసాగిస్తు ఉండడం విచారకరమన్నారు.
ఇకనైనా బుద్ధి మార్చుకోకపోతే త్వరలో ప్రజలే సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. చీఫ్‌విప్ జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ రాష్ట్ర రైతులు ఆర్థిక ప్రగతిలో నెంబర్‌వన్‌గా ముందుకు వెళ్లాలన్నదే సీఎం చంద్రబాబు ఆశయమన్నారు. అందుకే ఉద్యాన పంటలకు పెద్దఎత్తున రాయితీలు ఇస్తున్నామ ని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుకు ఎకరానికి రూ.57 వేల రాయితీ, పండ్ల తోటలకు ఎకరానికి లక్ష వరకు రాయితీ ఇస్తూ రైతుల ఆదాయాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వైసీపీ పెట్టిన బకాయిలను చెల్లించడంతో పాటు ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే చెల్లింపులు చేస్తున్నారన్నారు.
ఇందుకు పూర్తి విరుద్ధంగా అయిదేళ్లు పాలించి ఇప్పుడు మొసలి కన్నీళ్లు కార్చుతున్న జగన్‌రెడ్డి నిజానికి రైతు ద్రోహి, శత్రువని మండిపడ్డారు. వైసీపీ ఐదేళ్ల రాక్షస పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని, జగన్ పాలనలో రైతుల ఆత్మహత్యల్లో రాష్ట్రం రెండోస్థానంలో నిలిచిందన్నారు. రైతులకు కనీసం పంటల బీమా చెల్లించలేని అసమర్థుడు జగన్ అని మండిపడ్డారు. అయినా ఇప్పటికీ దుర్మార్గపు విమర్శలు, దుష్ప్రచారాలు చేస్తున్నారని, సాక్షి పత్రిక, ఛానెల్‌తో పాటు జగన్‌కి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే పరిపాటిగా మారిందన్నారు. నాడు పులిచింతల గేట్లకు గ్రీజు పెట్టడం చేతగాని దద్దమ్మలు, గుండ్లకమ్మ గేట్లకు మరమ్మతులు చేయించడం చేతగాని అసమర్థులు ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ వద్ద ఒక్కగేటు మొరాయిస్తే బ్యారేజీ కొట్టుకు పోతుందని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మునిగి పోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న ప్రజల మధ్య జగన వైసీపీ కుంపటి పెట్టాలని చూస్తున్నారని, రేపో మాపో ఆయన జైలుకు పోతే వీళ్లందరూ రోడ్లెక్కి పెట్రోల్ పోయించుకున్నట్లు నటించాలని, వారే అగ్గిపుల్ల గీస్తారని హెచ్చరించారు. వైసీపీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నామని, పెట్రోల్ మీరు పోసుకుంటే అగ్గిపుల్ల జగన్‌రెడ్డి గీయిస్తాడని, మీ కుటుంబాల కోసం అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.
కలెక్టర్ పి.అరుణ్‌బాబు మాట్లాడుతూ మెగా కిసాన్ మేళాలో రైతులఆదాయం పెంపు, ఏ పంటలు సాగుచేస్తే మేలు, ఎలాంటి ఎరువులు, పురుగుమందులు, ఎంత మోతాదులో వాడాలనే దానిపై అవగాహన కల్పించేదానికి వ్యవసాయ, ఉద్యానశాఖలు సంయుక్తంగా ఈ స్టాళ్లను ఏర్పాటు చేశారన్నారు. ఈ డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నియోజకవర్గ పరిశీలకులు మానుకొండ శివప్రసాద్, వ్యవసాయ శాఖ అధికారులు, కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
ట్రాక్టర్ల ప్రదర్శన
మెగా కిసాన్ మేళా సందర్భంగా నియోజకవర్గంలోని రైతులు, కార్యకర్తలు, కూటమి నాయకులు కలిసి 350 ట్రాక్టర్లతో నిర్వహించిన భారీ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మంత్రి అచ్చెన్నాయుడు స్వయంగా ట్రాక్టర్ నడపగా, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, కన్నా లక్ష్మీనారాయణ పక్కన కూర్చుని రైతులతో కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు