-జగన్ మూర్ఖపు నిర్ణయాల వల్లనే డయాఫ్రం వాల్ దెబ్బతింది
-జగన్ అసమర్థత, అహంకారం, దుస్సాహసం వల్ల ప్రాజెక్టు మనుగడే ప్రమాదంలో పడింది
-ఏజెన్సీలను మార్చొద్దని పీపీఏ చేసిన హెచ్చరికలను సైతం పెడచెవిన పెట్టారు
-ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఇచ్చిన నిధులను సైతం దారిమళ్లించారు
-వాస్తవాలు దాచి పెట్టి పోలవరం పూర్తి చేస్తాం అంటూ తప్పుడు ప్రకటనలు చేశారు
-టీడీపీ హయాంలో 72 శాతం పనులు పూర్తైతే…వైసీపీ ప్రభుత్వం చేసింది కేవలం 3.84 శాతం మాత్రమే
-పోలవరం ప్రాజెక్టు ఎత్తు 41.15 మీట్లర్లే అంటూ కొత్త ప్రతిపాదనలు తెచ్చారు
-పోలవరం ప్రాజెక్టు దుస్థితిని చూస్తే బాధ, ఆవేదన కలుగుతోంది
-ప్రజలకు వాస్తవాలు తెలిపేందుకు శ్వేతపత్రం విడుదల
-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు
– పోలవరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వైసీపీ ప్రభుత్వ విధ్వంసాన్ని వివరించిన సీఎం చంద్రబాబు
– సచివాలయంలో మొదటి బ్లాక్ లో మీడియా సమావేశం నిర్వహించి ప్రాజెక్టు దుస్థితిపై శ్వేతపత్రం విడుదల
అమరావతి : పోలవరం విధ్వంసంతో జగన్ రాష్ట్రానికి తీరని ద్రోహం చేశారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. జగన్ మూర్ఖత్వం వల్లే డయాఫ్రం వాల్ దెబ్బతిందని…డయాఫ్రం వాల్ దెబ్బతిన్న విషయం జగన్ కు కూడా రెండేళ్ల తర్వాత తెలిసిందన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్వాకంతో పోలవరం ప్రాజెక్టు భౌగోళిక పరిస్థితులు కూడా పూర్తిగా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టు దుస్థితిపై వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో శ్వేతపత్రం విడుదల చేశారు. దానిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ….‘‘సీఎంగా ప్రమాణస్వీకారం చేశాక పలు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. వైసీపీ 5 ఏళ్ల విధ్వంసంతో రాష్ట్రం ఎలా నష్టపోయిందో కూలంకుశంగా ప్రజల్లో చర్చజరగాలి. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలు గుర్తించారు.
ఫోర్త్ ఎస్టేట్ కూడా గత ప్రభుత్వానికి భయపడింది. కోర్టులను కూడా బ్లాక్ మెయిల్ చేసి జడ్జిలపై వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. రాష్ట్ర పునర్నిర్మాణం జరగడానికి మేమంతా కష్టపడి పని చేస్తాం. ప్రజలు గెలవాలి..రాష్ట్రం నిలవాలి అని ఎన్నికల ముందు ప్రచారం చేశాం. ప్రజలు గెలిచి…చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు. ఇక రాష్ట్రాన్ని నిలబెట్టడంలో అందరూ భాగమైతే దానికి మేము బాధ్యత తీసుకుంటాం. ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో దెబ్బతిన్న వాటిలో 7 ప్రధాన అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టే ముందు మన సమస్యలు కూడా కేంద్రం ముందు ఉంచాలి. అందుకే 25 రోజుల్లోనే 7 అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేసి తర్వాత రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెడతాం. ఇరిగేషన్ సంబంధించి ఒక వెబ్ సైట్ ప్రారంభించి అందులో అన్ని అంశాలను ఉంచుతాం. చెప్పిన తప్పులనే వందసార్లు చెప్పి ప్రజల్ని నమ్మించాలని చూస్తున్నారు…దానికి వాస్తవాలతో చెక్ పెడతాం.
అవాస్తవాలన్నింటికీ ప్రజలే బుద్ధి చెప్పేలా వాస్తవాలు ప్రజల ముందు ఉంచుతాం. రాష్ట్రానికి సాగునీటి ప్రాజెక్టుల అవసరం ఎంతో ఉంది. ఆ ఉద్దేశ్యంతోనే టీడీపీ హయాంలో రూ.67 వేల కోట్లు ఇరిగేషన్ పై ఖర్చు చేశాం. కనీసం గత ప్రభుత్వం వాటి నిర్వహణకు కూడా నిధులు ఇవ్వలేదు.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
పోలవరం విధ్వంసంతో జగన్ రాష్ట్రానికి ద్రోహం చేశాడు
‘‘రాష్ట్రానికి రెండు ప్రధానమైన ప్రాజెక్టుల్లో ఒకటి పోలవరం…రెండు అమరావతి. ఆ రెండూ రాష్ట్రానికి రెండు కళ్లులాంటివి. అవి పూర్తి చేసుకుంటే రాష్ట్రానికి ఉన్న నష్టాన్ని పూడ్చుకోవచ్చు. జగన్ పోలవరానికి ఒక శాపంగా మారారు. జగన్ చేసిన నేరం క్షమించరానిది. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా జగన్ ను అందరూ నిలదీయాలి. రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. దక్షణ భారతదేశంలో అత్యధిక నీళ్లు ఉండే ఏకైక నది గోదావరి. యేటా 3 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి వెళ్తోంది. వీటిని వినియోగించుకుంటే రాష్ట్రంలో కరవు అనేది ఉండదు.
పోలవరంలో ముంపునకు గురయ్యే 7 మండలాలు నాడు తెలంగాణలో ఉన్నాయి…అవి ఏపీలో కలిపితేనే ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పడంతో మొదటి కేబినెట్ సమావేశంలోనే ఏపీలో కలుపుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఉత్తరాంధ్ర, రాయలసీమకు తాగు, సాగు నీరు అందించే బహుళార్ధక సాధక ప్రాజెక్టు. 2014లో విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే 2019 నుండి 2024 మధ్య జరిగిన నష్టమే ఎక్కువ. పోలవరం ద్వారా 7.2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు… 23.50 లక్షల ఎకరాలు స్థిరీకరించవచ్చు.
పరిశ్రమలకు సమృద్ధిగా నీరందించవచ్చు. టీడీపీ హయాంలో ఒకే రోజున 32,315 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తి చేసి గిన్నిస్ రికార్డ్ సృష్టించాం. నేను 31 సార్లు క్షేత్రస్థాయిలో పోలవరంలో పర్యటించాను. ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే వ్యవసాయానికి ఊతం వస్తుందనే శ్రద్ధ పెట్టాను.
ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులన్నీ క్లియర్ చేశాను. పోలవరం ప్రాజెక్టుకు టీడీపీ హయాంలో రూ.11, 762.47 కోట్లు ఖర్చు చేస్తే…వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.4,167 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. జగన్ చేతకానితనం, అహంభావం వల్లే ప్రాజెక్టు దెబ్బతింది. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రోజే ప్రాజెక్టు పనులు నిలిపేశారు. ప్రాజెక్టు పరిస్థితి ఏంటో చూడకుండా పనులు నిలిపేశారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండానే పని చేసే ఏజన్సీలను తొలగించారు.
2019 జూన్ నుండి నవంబర్ వరకు ప్రాజెక్టుకు ఏజన్సీ లేదు. వరదలతో డయాఫ్రం వాల్ దెబ్బతిందని హైదరాబాద్ ఐఐటీ నిపుణులు స్పష్టం చేశారు. డయాఫ్రం వాల్ దెబ్బతిందని రెండేళ్ల తర్వాత కనుక్కున్నారు. టీడీపీ హయాంలో ఉన్న కాంట్రాక్టరు పనితీరు సంతృప్తికరంగానే ఉంది..మార్చాల్సిన పనిలేదని పీపీఏ తమ మినిట్స్ లో పేర్కొంది.
2009లో కాంట్రాక్టరును మార్చడం వల్ల హెడ్ వర్క్స్ పనులు నిలిచిపోయాయి…కాంట్రాక్టర్ ను మార్చితే జాప్యం జరుగుతుందని పీపీఏ హెచ్చరించింది. కొత్తకాంట్రాక్టరను మార్చడం వల్ల పనుల్లో జాప్యం జరుగిందని పీపీఏ తెలిపింది. ఒకే పనిని రెండు ఏజన్సీలు చేస్తే నాణ్యత దెబ్బతింటుదని చెప్పినా వినలేదు.
కాంట్రాక్టర్ ను మార్చడం, ముందు చూపు లేకపోవడంతో పనులు తీప్ర జాప్యం అవుతాయని కేంద్ర ఇరిగేషన్ సెక్రటరీకి పీపీఏ లేఖ కూడా రాసింది. మేము అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ ఏకపక్ష నిర్ణయాలు తీసుకోలేదు..కానీ జగన్ ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నారు. తనకు అన్నీ తెలుసు అన్నట్లుగా వ్యవహరించారు.’’ అని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ నిర్వాకంతోనే డయాఫ్రం వాల్, కాఫర్ డ్యాం డ్యామేజీ
‘‘పోలవరం ప్రాజెక్టులో జరిగిన తప్పిదాలను ఎత్తిచూపేందుకు నీతి ఆయోగ్ నియమించిన నిపుణుల కమిటీ కూడా ప్రభుత్వ అసమర్థ ప్రణాళికతోనే డయాఫ్రం వాల్ దెబ్బతిందని నివేదిక ఇచ్చింది. డయాఫ్రం వాల్, ఎగువ కాఫర్ డ్యాం, దిగువ కాఫర్ డ్యాంలు దెబ్బతిన్నాయి. 2018లో రూ.436 కోట్లతో డయాఫ్రం వాల్ పూర్తి చేశాం…కానీ గత ప్రభుత్వ నిర్వాకంతో డ్యామేజ్ అయిన పనులకే ఇప్పుడు రూ.447 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే తెలుస్తోంది.
కొత్త డయాఫ్రం వాల్ కట్టాలంటే రూ.990 కోట్లు ఖర్చు అవుతుంది..దానికి కూడా మూడు నాలుగు సీజన్లు పడుతుందని అధికారులు అంటున్నారు. జగన్ మూర్ఖత్వంతో చేసిన పనికి ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. జగన్ విధ్వంసంతో ప్రాజెక్టు భౌగోళిక పరిస్థితులే మారిపోయాయి. ఎగువ కాఫర్ డ్యాం నుండి వచ్చిన వరద ఉధృతికి గ్యాప్ – 1 వద్ద 150 మీటర్ల గట్టు కొట్టుకుపోయింది. జగన్ నిర్లక్ష్యం, విధ్వంసంతో ప్రాజెక్టుకు సహజ సిద్ధంగా లభించేవి కూడా ప్రమాదంగా మారి ప్రాజెక్టు స్థితినే మార్చేశాయి.
గైడ్ బండ్ కుంగిపోయింది. నేరుగా నీళ్లు వస్తే ప్రజర్ తగ్గుతుందని గైడ్ బండ్ ను రూ.80 కోట్లతో నిర్మించాం. డయాఫ్రం వాల్, ఎగువ-దిగువ కాపర్ డ్యాం, గైడ్ బండ్ ఈ మూడు డ్యామేజీలు జగన్ నిర్వాకం వల్లే జరిగినవే…వాటి వల్ల ప్రాజెక్టు పనులు, పవర్ హౌస్ ఆలస్యం అవుతున్నాయి. ’’ అని సీఎం చంద్రబాబు వివరించారు.
ప్రాజెక్టుకు కేంద్రం నిధులు సైతం దారి మళ్లింపు
‘‘టీడీపీ ఐదేళ్లలో 72 శాతం పనులు పూర్తి చేస్తే…వైసీపీ 3.84 శాతం మాత్రమే పూర్తి చేసింది. దానికి తోడు నిధుల కొరత కూడా తీసుకొచ్చారు. టీడీపీ హయాంలో రాష్ట్ర నిధులు ఖర్చు చేసి రీయింబర్స్ చేయించాం…వైసీపీ ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులు కూడా ప్రాజెక్టు కోసం ఖర్చు చేయకుండా రూ.3,385 కోట్లు దారిమళ్లించింది. టీడీపీ హయాంలో వచ్చిన గిన్నిస్ రికార్డుకు కేంద్రం కూడా ప్రశంసలు కురిపిస్తే..వైసీపీ హయాంలో నిపుణులు, పీపీఏ చివాట్లు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారు.
45.72 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపడితే…వైసీపీ ప్రభుత్వం 41.15 మీటర్లకు కుదించింది. రూ.55,548 కోట్లకు కేంద్రంతో ఆమోదం తెలిపేలా మేము కృషి చేస్తే…గత ప్రభుత్వం అసలు నిధులు కూడా అడగలేదు. నిర్వాసితులకు జగన్ ఎన్నో హామీలు ఇచ్చి మోసం చేశాడు. పరిహారం ఎకరాకు రూ.19 లక్షలు ఇస్తానన్నారు. పరిహారం అందిన వారికి కూడా రూ.5 లక్షలు అదనంగా ఇస్తానన్నారు.
పరిహారం ఇవ్వకపోవడమే కాకుండా నిర్వాసితుల జాబితాలు మార్చి పరిహారం కాజేశారు. సకల వసతులతో కాలనీలు నిర్మిస్తానని చెప్పి ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. అధికారం, ఓట్ల కోసం ఎన్ని అబద్ధాలు చెప్పాలో అన్నీ చెప్పాడు. పునరావాసానికి రూ.4,114 కోట్లు టీడీపీ ప్రభుత్వం ఖర్చు చేసి మోడల్ కాలనీలు నిర్మిస్తే…వైసీపీ ప్రభుత్వం రూ.1687 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
ప్రాజెక్టు పూర్తిపై పూటకో మాట
‘‘పోలవరం ప్రాజెక్టు పూర్తిపై పూటకో మాట మాట్లాడారు. మొదటి సారి 2021 ఏప్రిల్ నాటికి, రెండో సారి 2021 డిసెంబర్ నాటికి, మూడో సారి 2022 ఏప్రిల్ నాటికి, నాలుగో సారి 2021 డిశంబర్ నాటికి..ఇక ఐదో సారి ఎప్పటికి పూర్తి అవుతుందో చెప్పలేం అని చేతులెత్తేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ఇప్పుడు కేంద్రం అంతర్జాతీయ నిపుణులను ఆహ్వానించి ప్రాజెక్టు దుస్థితిపై అధ్యయనం చేయాల్సి వస్తోంది.
హైడల్ ప్రాజెక్టు 2020 నాటికి పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ పూర్తికానందున ప్రభుత్వానికి రూ.3 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. జగన్ నిర్లక్ష్యంతో డ్యామేజ్, రిపేరు పనులకు రూ.4,900 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటికే ప్రాజెక్టుపై 38 శాతం మేర ఖర్చులు పెరిగాయి.
టీడీపీ హయాంలో పోలవరం పనుల్లో అవినీతి జరగలేదని కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పార్లమెంట్ లోనే సమాధానం ఇచ్చింది. మా ప్రభుత్వంలో అవినీతి జరిగిందని నిరూపించడానికి అనేక ప్రయత్నాలు చేశారు. పిచ్చి కుక్క ముద్ర వేసి కుక్కను చంపినట్లు…మంచి ప్రాజెక్టుపై అవినీతి నెపం వేసి విధ్వంసం చేశారు.’’ అని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
జగన్ దుస్సాహసమే ప్రాజెక్టు నాశనానికి కారణం
‘‘ఐదేళ్లు మేం పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ప్రజలకు వాస్తవాలన్నీ తెలియకుండా దాచి పెట్టారు. కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్, గైడ్ బండ్ తో పాటు అన్ని చోట్లా సమస్యలు సృష్టించారు. ప్రజలంతా అర్థం చేసుకోవాలి…ప్రాజెక్టు సర్వనాశనానికి జగన్ దుస్సాహసమే కారణం. అర్హత లేని వాళ్లకు అధికారం ఇస్తే ఇలానే జరుగుతుంది. కొందరు ఆంబోతుల మాదిరిగా వచ్చి మమ్మల్ని తిట్టొచ్చు…విమర్శలు చేయొచ్చు.
కాఫర్ డ్యాంకు, డయాఫ్రం వాల్ కు తేడా తెలియకుండా… ప్రాజెక్టు వద్దకెళ్లి కాఫర్ డ్యాం ఎక్కడుందో వెతుక్కునే వ్యక్తులు విమర్శలు చేస్తున్నారు. కాఫర్ డ్యాం కూడా పర్మినెంట్ కాదు…నీటి డైవర్షన్ కోసమే కాఫర్ డ్యాం నిర్మాణం మూడునాలుగేళ్ల పాటు ఉంటుంది. మొదటి శ్వేతపత్రం రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరంపైనే విడుదల చేశాం. ఇది పూర్తైతే పక్క రాష్ట్రాలకు కూడా నీరు ఇవ్వొచ్చు. తెలంగాణకు కూడా సాగర్ కాల్వ ద్వారా నీరందించవచ్చు.రాయ
లసీమ బాగుండాలంటే నల్లమల అడవి గుండా టన్నెల్ ద్వారా బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీరందించవచ్చు. కానీ ఇప్పుడు ప్రాజెక్టు పరిస్థితి చూస్తే బాధ, ఆవేదన కలుగుతోంది. కాఫర్ డ్యాం ద్వారా నీరు లీక్ అవుతోంది… దాన్ని పరిష్కరించకుండా పనులు ముందుకు సాగవు. ఇక్కడి ఇంజనీర్లు రిస్క్ తీసుకోవాలన్నా భయపడే పరిస్థితికి వచ్చారు. ప్రాజెక్టులో పైకి తెలిసిన డ్యామేజీ కంటే… తెలియని డ్యామేజీ చాలా ఉంది.
2021లోనే ప్రాజెక్టు దెబ్బతిన్నప్పటికీ 2022లో పూర్తి చేస్తాం, 2023 నాటికి పూర్తి చేస్తాం అని చెప్పారు. డయాఫ్రం వాల్ కు కనీసం రెండు సీజన్ల సమయం పడుతుందని అధికారులు చెప్పినదాన్ని బట్టి తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి రావడానికి ప్రధాన దోషైన జగన్ ను ప్రజలు ఇంటికి పంపారు. 45.72 మీటర్ల ఎత్తుతోనే నిర్మాణం జరుగుతుంది. ఎర్త్ కమ్ రాక్ ఫిల్ కూడా అదే ఎత్తులో ఉంటుంది.
ఓట్ల కోసం నిర్వాసితులను కూడా మోసం చేశారు
‘‘నిర్వాసితుల సమస్యలను చూస్తే బాధేస్తోంది. వర్షాల సమయంలో నీళ్లలో ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి నుండి వెళ్లిపోతే పరిహారం రాదేమోనని భయపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టును తలచుకుంటేనే బాధేస్తోంది. అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా…మనమంతా కలిసి పని చేసి సంక్షోభం నుండి ప్రజల్ని, రాష్ట్రాన్ని బయటకు తీసుకురావాలి. పోలవరం ప్రాజెక్టు పట్ల గత ప్రభుత్వం చేసిన దుర్మార్గంతో ఒడిశా, చత్తీస్ గడ్ కూడా కేసులు వేసింది.
ప్రాజెక్టును ఆషామాషీగా తీసుకోకూడదు…తేడాలు జరిగితే ప్రమాదం ఏర్పడుతుంది..కానీ గత ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరించింది. గతంలో కేంద్రం అనుమతితో ట్రాన్స్ ట్రాయ్ తో చేసుకున్న ధరల ఒప్పందం ప్రకారమే నవయుగకు పనులు అప్పగించాం…కానీ వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పిలిచింది. నేను రివర్స్ టెండరింగ్ నిర్ణయం తీసుకున్నాను…అమలు చేయండి అని మాట్లాడారు. నేను కట్టానన్న అక్కసుతోనే పట్టిసీమను పక్కనబెట్టారు.
ప్రజా చైతన్యమే అన్నింటికీ పరిష్కారం అవుతుంది. ప్రజల్లో చైతన్యం లేకపోతే ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని పాలకులు తప్పులు ఎక్కువ చేస్తారు. రాజకీయాల్లో ఉండటానికి అర్హత లేని వ్యక్తి జగన్. జగన్ లాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదనే ప్రజలు కూటమికి ఘనవిజయాన్ని ఇచ్చారు.
పరదాలు కట్టుకునే ముఖ్యమంత్రికి 936 మంది భద్రతా సిబ్బంది అవసరమా.? నేను బయటకు వెళ్లినా అలవాటులో పోలీసు అధికారులు పరదాలు కడుతున్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా ట్రాఫిక్ కూడా ఎక్కువ సేపు ఆపొద్దని అధికారులను ఆదేశించాను.’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.