* అభివృద్ధిని అడ్డుకుంటే సహించేది లేదు
* జగన్ కు మంత్రి సవిత హెచ్చరిక
* పీపీపీ మోడల్ లో వైద్య కళాశాలల నిర్మాణానికి కేంద్రం మద్దతు
* ప్రధాని నరేంద్రమోడిని, కేంద్రమంత్రి అమిత్ షాను అరెస్టు చేస్తామని ప్రకటించగలవా?
* జగన్ బెదిరింపులకు ఎవరూ భయపడరు
* ఆ ఇళ్లనీ బాత్ రుమ్ లకు ఎక్కువ బెడ్ రూమ్ లకు తక్కువ
* వైసీపీ హయాంలో జగనన్న ఇళ్లపై మంత్రి సెటైర్లు
* 2029 నాటికి పేదల సొంతింటి కల నిజం చేస్తాం
* గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు కేటాయింపు : మంత్రి సవిత
పెనుకొండ/శ్రీసత్యసాయి : పీపీపీ మోడల్ లో మెడికల్ కళశాలల నిర్మాణానికి ముందుకొచ్చే కాంట్రాక్టర్లను జైలుకు పంపిస్తామని వైసీపీ బెదిరింపులకు పాల్పడుతోందని, అదే బెస్ట్ మోడల్ అని సమర్థించిన ప్రధాన మంత్రి నరేంద్రమోడిని, కేంద్రమంత్రి అమిత్ షాను కూడా అరెస్ట్ చేస్తాం అని ప్రకటించగలరా.. ? అని జగన్ కి రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత సవాల్ విసిరారు.
అకృత్యాలు, దౌర్జన్యాలు, బెదరింపులతో రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడానికి చూస్తే సహించేది లేదని జగన్ ను, వైసీపీ నేతలను మంత్రి హెచ్చరించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గంలోని పెనుకొండ, రొద్దం, సోమందేపల్లి మండలాలకు చెందిన 607 మంది లబ్ధిదారులకు ఇంటి నివేశ స్థల ధ్రువీకరణ పత్రాలను మంత్రి సవిత శుక్రవారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. కూడు, గూడు, గుడ్డ నినాదంతో అన్న ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేశారన్నారు. ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబునాయుడు 2029 నాటికి రాష్ట్రంలో పేదలందరికీ సొంతింటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో పాలన సాగిస్తున్నారన్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నామన్నారు.
సూపర్ సిక్స్ పథకాలు విజయవంతంగా అమలు చేశామన్నారు. అమరాతి రాజధాని, పోలవరం ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. గ్రామాల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్లు, కాలువలు నిర్మిస్తున్నామన్నారు.
ప్రధాని మోడిని అరెస్ట్ చేస్తామనగలవా?
సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి జగన ఓర్వలేకపోతున్నాడని మంత్రి సవిత విమర్శించారు. ప్రజలు సైతం చంద్రబాబు పాలనకు జై కొడుతుండడంతో, జగన్, వైసీపీ నాయకులు రప్పా…రప్పా… అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. మెడికల్ కాలేజీలను పీపీపీ మోడల్ లో నిర్మించి, పేదలకు వైద్య విద్య, ఉచిత కార్పొరేట్ వైద్యం త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సీఎం చంద్రబాబు ఆశిస్తుంటే జగన్ అడ్డుకుంటున్నారన్నారు.
పీపీపీ మోడల్ లో వైద్య కళాశాలలు నిర్మించే కాంట్రాక్టర్లను జైలు పంపిస్తామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. వైద్య కళాశాలలను పీపీపీ మోడల్ లో నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం మద్దతిచ్చిందని, ఇప్పుడు ప్రధాని నరేంద్రమోడిని, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను అరెస్టు చేస్తామని ప్రకటించగలవా..? అని మంత్రి సవిత సవాల్ విసిరారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధికి అడ్డుకుంటే సహించేది లేదని జగన్ ను హెచ్చరించారు. వైసీపీ నాయకులు, జగన్ బెదిరింపులకు రాష్ట్రంలో భయపడే వారెవరూ లేరని మంత్రి సవిత స్పష్టం చేశారు.
ఆ ఇళ్లు బాత్ రూమ్ లకు ఎక్కువ బెడ్ రూమ్ లకు తక్కువ
2014-19 మధ్య కాలంలో రాష్ట్రంలో పేదల సొంతింటి నిర్మాణానికి అప్పటి టీడీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసిందని మంత్రి సవిత గుర్తు చేశారు. తరవాత వచ్చిన పేదల సొంతింటి కలను నిర్వీర్యం చేశారన్నారు. సెంటు స్థలంలో బాత్ రూమ్ కు ఎక్కువ బెడ్ రూమ్ కు తక్కువ ఇళ్లను నిర్మించారన్నారు. ఆ అయిదేళ్లలో ఇళ్ల నిర్మాణాలను బిల్లులు కూడా చెల్లించలేదన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం జగన్ అర్థాంతరంగా నిలిపేసిన ఇళ్లను నిధులిచ్చి, గృహ ప్రవేశాలు చేయించామన్నారు. జగనన్న ఇళ్ల పేరుతో భారీ దోపిడికి పాల్పడ్డారని మంత్రి సవిత విమర్శించారు.
అర్హులందరికీ సొంతిళ్లు
అంతకుముందు పెనుకొండ తహసీల్దార్ కార్యాలయంలో పెనుకొండ, రొద్దం, సోమందేపల్లి మండలాలకు చెందిన 607 మంది లబ్ధిదారులకు పోజిషన్ సర్టిఫికెట్లు మంత్రి సవిత పంపిణీ
చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అర్హులైన పేదలందరి సొంతింటి కల నెరవేర్చుతామన్నారు. పట్టణాల్లో రెండు సెంట్లు, గ్రామాల్లో మూడు సెంట్లు పేదల ఇంటి కోసం కేటాయిస్తామన్నారు. అనంతరం లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకట రమణ, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, ఆర్డీవో ఆనందరావు, మూడు మండలాల తహసీల్దార్లు, ఇతర అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.