Suryaa.co.in

Andhra Pradesh

అన్నీ స్వామివారే నడిపిస్తున్నాడు

– ఆ స్వామి వారే వారందరికీ మొట్టికాయలు వేస్తాడు
– బాబు నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపింది
– అయినా చంద్రబాబులో కనిపించని కనీస పశ్చాత్తాపం
– నిజానికి సుప్రీంకోర్టు ఎవరిని తప్పు పట్టింది?
– ఎవరు దేవుడి దగ్గర దోషిగా నిలబడాలి?
– ఎవరికి దేవుడంటే భయం, భక్తి ఉంది?
– అసలు పవన్‌కు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా?
– తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశం తర్వాత క్యాంప్‌ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: చంద్రబాబు నిజ స్వరూపాన్ని సుప్రీం కోర్టు ఎత్తి చూపించింది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని, రాజకీయ దుర్భిద్ధితో రెచ్చగొడుతున్నాడనేది సుప్రీంకోర్టు అర్దం చేసుకుంది కాబట్టే గట్టి వ్యాఖ్యలు చేసింది. దేవుణ్ని రాజకీయాల్లోకి లాగొద్దు అంది. పొలిటికల్‌ డ్రామాలు చేయెద్దు అని కూడా వ్యాఖ్యానించింది. చంద్రబాబు స్వయంగా వేసుకున్న ‘సిట్‌’ను కూడా రద్దు చేసింది.

తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను రాజకీయ దుర్భిద్దితో కావాలని అబద్దాలు చెప్పి, జంతువుల కొవ్వు వాడి లడ్డూలు తయారు చేసి భక్తులకు ఇస్తే, వారవి తిన్నట్లు సీఎం చంద్రబాబు అసత్య ప్రచారం చేశారు. అలా ఆయన తిరుమల లడ్డూను, శ్రీవెంకటేశ్వరస్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను అపవిత్రం చేశారు. వీటన్నింటికీ సంబంధించి నేను సాక్ష్యాధారాలతో సహా చూపించాను. దీనిపై కోర్టు కూడా మొట్టికాయ వేసింది.

కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని, నమ్మకాన్ని దెబ్బ తీస్తూ, చంద్రబాబు ఎలా అబద్ధాలు చెప్పాడనేది చూస్తే.. చంద్రబాబు సీఎం అయ్యాక, తను నియమించుకున్న ఐఏఎస్‌ అధికారి, టీటీడీ ఈఓ చంద్రబాబు ప్రకటనలకు విరుద్ధంగా స్వయంగా ప్రకటనలు చేశాడు.

ఈరోజు తెలుగుదేశం పార్టీ వెబ్‌సైట్‌లో చంద్రబాబు పెట్టిన పోస్టింగ్స్‌ చూస్తే.. తప్పు జరిగిందని తెలిసినా ఆయనలో కనీసం పశ్చాత్తాపం కనిపించడం లేదు. దేవుడి పట్ల ఇంత దారుణంగా వ్యవహరించినా కనీస పశ్చాత్తాపం లేదంటూ.. ఆ పోస్టింగ్స్‌లో ఏం రాశాడన్నది చదివి విపించారు.
‘తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్‌ కావడంతో జగన్‌రెడ్డి బావ ధర్మారెడ్డి, బాబాయి సుబ్బారెడ్డి, మామ కరుణాకర్‌రెడ్డి అంటూ అబద్దం మీద అబద్దాలు చెప్పుకుంటూ పోతున్నారు. మనిషి అన్నాక కొద్దిగానైనా దేవుడంటే భక్తి ఉండాలి. కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇంత దారుణంగా వక్రీకరణ చేయడమా?’.. అని ఆక్షేపించారు.

‘జూలై 6, జూలై 12న వచ్చిన నెయ్యి ట్యాంకర్లు.. నాణ్యత పరీక్షించిన తర్వాత వాటిని లోపలికి అనుమతించలేదు. తిరుపతి, తిరుమలలో ఒక గొప్ప రొబొస్ట్‌ వ్యవస్థ ఉంది. 2014–19 మధ్య క్వాలిటీ లేని 14 నెయ్యి ట్యాంకర్లు వెనక్కు పంపగా, మా హయాంలో 2019–24 మధ్య 18 ట్యాంకర్లు వెనక్కు పంపడం జరిగింది’.

నెయ్యి, ఇతర సరుకుల సేకరణకు టీటీడీలో పక్కా వ్యవస్థ ఉంది. అన్నీ ఈ–టెండర్ల ద్వారా బిడ్లు నిర్వహిస్తారు. ఎల్‌–1కు 65 శాతం, ఆ తర్వాత బిడ్లో ఉన్న వారికి అదే ధరకు 35 శాతం ఇస్తారు. తిరుమలకు టెండర్‌ ప్రకారం సరఫరా చేసే నెయ్యి ట్యాంకర్లు.. తమతో ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపు పొందిన ల్యాబ్‌ నుంచి క్వాలిటీ సర్టిఫికెట్‌ తీసుకురావాలి. ఆ సర్టిఫికెట్‌తో వచ్చినా, తిరుపతిలో ప్రతి ట్యాంకర్‌ శాంపిల్‌ మూడు సార్లు టెస్ట్‌ చేస్తారు. అలా జూలై 6, 12 తేదీల్లో వచ్చిన ట్యాంకర్లు తిరుపతిలో చేసిన నాణ్యత పరీక్షలో ఫెయిల్‌ అయితే, వాటిని వెనక్కు పంపారు. అవే శాంపిల్స్‌ను ఎన్డీడీబీకి పంపిస్తే, జూలై 23న రిపోర్ట్‌ వచ్చింది. దాంతో ఆ ట్యాంకర్లు వెనక్కు పంపడంతో పాటు, ఆ కంపెనీ వారికి నోటీసులు కూడా ఇచ్చారు’..

జూలై 23న ఎన్డీడీబీ రిపోర్ట్‌ వస్తే, రెండు నెలల తర్వాత అన్ని తెలిసినా, సెప్టెంబరు 18న ఆ విషయం ప్రస్తావిస్తూ.. దేవుడి ప్రతిష్టను దెబ్బ తీస్తూ.. శ్రీవారి లడ్డూ తయారు చేసే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెప్పారు. ఆ వెంటనే రెండు రోజులకు, అంటే సెప్టెంబరు 20న మాట్లాడిన టీటీడీ ఈఓ.. ఈ విషయం మీద చంద్రబాబు మాటలను కరెక్ట్‌ చేస్తూ.. నాణ్యత లేని నెయ్యి వాడలేదని స్పష్టం చేశారు.

అయినా కూడా మళ్లీ సెప్టెంబరు 22న మాట్లాడిన చంద్రబాబు, ఏ మాత్రం భయం, భక్తి లేకుండా తనకు రాజకీయ ఉద్దేశాలే ముఖ్యమని, స్వామివారు అన్నా, తిరుపతి అన్నా భయం, భక్తి లేదని నిరూపిస్తూ.. తాను అంతకు ముందు చెప్పిన పచ్చి అబద్ధాలను మరోసారి వల్లె వేశారు. తిరుమలకు వచ్చిన 4 ట్యాంకర్ల నెయ్యి వాడినట్లు చెప్పారు.

చంద్రబాబు తాను స్వయంగా ఏర్పాటు చేసుకున్న సిట్‌ ను రద్దు చేస్తూ.. సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షణలో ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు రాష్ట్ర అధికారులు అసిస్ట్‌ చేస్తారని చెబుతూ వీరికి తోడు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒకరు నియమితులవుతారని.. వీరందరూ లడ్డూకి సంబంధించిన విషయంపై నివేదిక ఇస్తారని ఆదేశించింది.

నిజానికి సుప్రీంకోర్టు ఎవరినీ తప్పు పట్టింది?. ఎవరు దేవుడి దగ్గర దోషిగా నిలబడాలి?. ఎవరికి దేవుడంటే భయం, భక్తి ఉంది?. మన ఖర్మ ఏమిటంటే.. చంద్రబాబు వంటి అన్యాయమైన నాయకుడు మనకున్నాడు. ఈయనకు దేవుడంటే భయం, భక్తీ రెండు లేవు. దేవుడిని సైతం రాజకీయాల్లో వాడుకునే అన్యాయమైన బుద్ధి చంద్రబాబు లాంటి నాయకుల్లో ఉంది.

ఇవన్నీ వెలుగులోకి వచ్చాయంటే దేవుడి దయతోనే. అన్నీ ఆ వెంకటేశ్వరస్వామినే నడిపిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వరస్వామితో ఆడుకుంటున్నారు. ఇటువంటి అన్యాయాలు చేస్తున్న వ్యక్తులకు ఆయనే మొట్టికాయలు వేస్తాడు.

పవన్‌కు సనాతన ధర్మం అంటే ఏమిటో తెలుసా? సాక్షాత్తూ నువ్వు ఆ కూటమిలో ఉన్నావు. నీ కళ్ల ఎదుటే చంద్రబాబు ఆ తప్పు చేశాడు. అది నీతో సహా, ఆరేళ్ల పిల్లాడికి కూడా కనిపిస్తోంది. శ్రీ వెంకటేశ్వరస్వామి ప్రాశస్త్యం, లడ్డూ విశిష్టతను తగ్గిస్తూ, కొన్ని కోట్ల మంది విశ్వాసాలకు విఘాతం కలిగిస్తూ.. చంద్రబాబు మాట్లాడితే.. అన్నీ తెలిసి నువ్వూ అదే మాట మాట్లాడావు. అలాంటి నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు. దేవుడి విషయంలో తప్పు జరుగుతున్నా, ఎత్తి చూపకపోవడం ఎంత వరకు సబబు? అలాంటి నీవు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నావు. అదేనా నీ సనాతన ధర్మం వైఖరి?.

LEAVE A RESPONSE