Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డికి సినీరంగంపై ఎందుకంత కక్ష్య?

– భవన నిర్మాణ కార్మికులను బలితీసుకున్నట్టు.. సినీ కార్మికులనూ బలితీసుకుంటారా?
– జగన్ రెడ్డి సినీ పరిశ్రమను వేధిస్తుంటే సినీరంగ పెద్దలు ఎందుకు నోరు మెదపటం లేదు?
– టీడీపీ శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్

తన చేతకాని పాలనతో ఇప్పటికే విద్యారంగం, వ్యవసాయరంగం, పారిశ్రామిక రంగాలను నాశనం చేసిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చివరకు సినిమా రంగాన్ని కూడా వదలకుండా నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారు. సినిమా టికెట్ల దరలు, ధియేటర్లలో తనిఖీల పేరుతో సినీ పరిశ్రమను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కోవిడ్ కారణంగా కొన్ని నెలల పాటు ధియేటర్లు మూతపడటం, నూతన సినిమాల చిత్రీకరణ ఆగిపోవటంతో సినీ కార్మికులపై తీవ్ర ప్రభావం నెలకొంది.

ఇప్పడు మళ్లీ జగన్ రెడ్డి ప్రభుత్వం కక్ష్యపూరితంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. తనిఖీల పేరుతో ధియేటర్లు మూసివేయటంతో ధియేటర్లలో పనిచేస్తున్న గేట్ మెన్ నుంచి ప్రోజెక్టర్ ఆఫరేటర్ వరకు అనేక మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. రాష్ట్రంలో ఉన్న 1100 ధియేటర్ల ద్వారా ప్రత్యక్షంగా 50 వేల మంది కార్మికులకు, పరోక్షంగా మరో 50 వేల మందికి ఉపాధి కలుగుతోంది. లక్షమందికి ఉపాధి కల్పిస్తున్న సినీ పరిశ్రమను జగన్ రెడ్డి తన వ్యక్తిగత స్వార్దం కోసం బలిపెడుతున్నారు. ప్రజలకు వినోదాన్ని అందించే సినీరంగ కార్మికుల బ్రతుకులను విషాదం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇప్పటికే ఉచిత ఇసుక రద్దు చేసి వందలాదిమంది భవన నిర్మాణ కార్మికులను బలితీసుకున్నారు. ఇప్పుడు ధియేటర్లు మూత వేసి వాటిలో పనిచేసే కార్మికులను బలితీసుకుంటారా? మీ ధన దాహానికి ఇంకెంత మంది బలికావాలి? ఇన్నాళ్లు లేని తనిఖీలు ఇప్పుడే గుర్తొచ్చాయా? ప్రజా సమస్యలు గాలికొదిలి తనిఖీల పేరుతో కలెక్టర్లను ధియేటర్ల చుట్టూ తిప్పుతున్నారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమ లేదు కాబట్టి ధియేటర్లు కూడా ఉండకూడదు ‎ అన్నట్టుగా జగన్ రెడ్డి వైఖరి ఉంది.

సినీ రంగాన్ని జగన్ రెడ్డి వేధింపులకు గురి చేస్తుంటే సినీ పెద్దలు ఎందుకు నోరు మెదపటం లేదు? సినిమాల్లో చూపించే మీ హీరోయిజం సినీ పరిశ్రమను వేధింపులకు గురిచేస్తున్న జగన్ సర్కార్ పై ఎందుకు చూపించటం లేదు? విశాఖలో స్టూడియోలకు గత ప్రభుత్వం భూమి కేటాయిస్తే దాన్ని వైసీపీ ప్రభుత్వం ఇవ్వకున్నా మీరు నోరుమెదపలేదు, రాజధాని అమరావతి అంశంలో మౌనంగా ఉన్నారు. పొరుగు రాష్ట్రాల్లో కోవిడ్ టైంలో చిన్న చిత్రాలకు పన్నులు తగ్గించారు, కానీ ఏపీలో మాత్రం పన్నులు పెంచినా మీరు నోరుమెదపలేదు. మీరు రీల్ హీరోలుగానే మిగిలిపోతున్నారు తప్ప రియల్ హీరోలుగా మారరా?

కావేరి నది జలాలు సమస్యపై అక్కడి సినీ పరిశ్రమంతా ఏకతాటిపై వచ్చారు, జల్లికట్టు అంశంపై తమిళ హీరోలంతా స్పందించారు. కానీ మన రాష్ట్రంలోని సమస్యలపై మీరెందుకు స్పందించటం లేదు? మీకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? మీ సినిమాలు ప్రజలు చూడాలి కానీ, వారి కష్టాలు మీకు పట్టవా? ప్రజా సమస్యలపై పొరుగు రాష్ట్రాల హీరోలకు ఉన్న ‎చిత్తశుద్ది మీకు లేదా? జగన్ ని చూసి తెలుగు సినిమా హీరోలు భయపడుతున్నారా?

సినీ పరిశ్రమ సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని వారు సినీ ఇండస్ట్రీని ఏం కాపాడుతారు? మా అసోషియేషన్ ప్రభుత్వంతో ఎందుకు చర్చలు జరపటం లేదు? ఇకనైనా తెలుగు సినీ పరిశ్రమ ఏకతాటిపైకి రావాలి. జగన్ రెడ్డి ఇకనైనా సినీ పరిశ్రమపై కక్షపూరిత ధోరణి వీడి సినీ పరిశ్రమను ప్రోత్సహించాలి.

LEAVE A RESPONSE