Suryaa.co.in

Andhra Pradesh

జగన్ దావోస్ పర్యటన పెట్టుబడులు, పరిశ్రమల కోసమా… ఫ్యామిలీ కోసమా?

– పులినిచూసినక్క వాతపెట్టుకున్నట్టు, 14.40కోట్ల ప్రజలసొమ్ము దుర్వినియోగం చేసిమరీ దావోస్ వెళ్లిన జగన్, చంద్రబాబుహయాంలో చేసుకున్న ఒప్పందాలనే తిరిగి చేసుకున్నాడు.
• ముఖ్యమంత్రి దావోస్ పర్యటనతో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పరిశ్రమలు, ఏపీ పారిశ్రామిక ప్రగతిపై ప్రభుత్వం వాస్తవాలతో తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలి.
• ప్రత్యేకహోదా, ఉద్యోగాలు, ఉపాధి అని యువతను నమ్మించిన జగన్, అధికారంలోకి వచ్చాక తన అసమర్థతతో 300మంది నిరుద్యోగుల ఉసురుపోసుకున్నాడు.
– మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

ఏరాష్ట్ర అభివృద్ధికైనా పరిశ్రమలు, పెట్టుబడులే కీలకమని, యువతకు ఉపాధి, ఉద్యోగాలు లభిస్తేనే రాష్ట్రంత్వరితగతిన వృద్ధిలోకి వస్తుందని, కానీ చేతగాని, అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీకి ఒక్కరూపాయిపెట్టుబడివచ్చిందిలేదని, ఆయన దావోస్ పర్యటనతో రాష్ట్రానికి ఏంఒరిగిందో సమాధానంచెప్పాలని, టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పల్లెరఘునాథరెడ్డి డిమాండ్ చేశారు.మంగళవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లా డారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే …

“ఏ రాష్ట్ర అభివృద్ధికైనా పరిశ్రమలురావడం, పెట్టుబడులు పెట్టడమే అత్యంత కీలకం. అలాంటిది గతప్రభుత్వంలో జరిగిన ఒప్పందాల తాలూకా రూ.లక్షా85వేలకోట్ల పెట్టుబడులు రాష్ట్రం నుంచి వెళ్లిపోయినా జగన్ రెడ్డి బెల్లంకొట్టిన రాయిలా ఏమీపట్టనట్టే ఉన్నాడు. మూడేళ్లపాటు రాష్ట్రపారిశ్రామిక రంగాన్ని తన విధ్వంసపు ఆలోచనలతో దెబ్బతీసిన ముఖ్యమంత్రి, ఇప్పుడు పులినిచూసినక్క వాతపెట్టుకున్నట్టు చంద్రబాబులాగా ఏదో చేయాలన్న అత్యుత్సాహంతో దావోస్ వెళ్లాడు. అక్కడికి వెళ్లడానికి ప్రత్యేకవిమానంలో బయలుదేరి, చేరాల్సినచోటికి కాకుండా మరోచోటికి, అక్కడినుంచి నింపాదిగా దావోస్ కు వెళ్లాడు.

ఇంతాచేసి అక్కడకు వెళ్లిన ముఖ్యమంత్రి సాధించింది ఏమిటయ్యా అంటే… తాను ముఖ్యమంత్రికాగానే చంద్రబాబుహయాంలో జరిగిన ఒప్పందాలు అన్నీ అక్రమమని రద్దుచేశాడో, తిరిగి వాటిపైనే సంతకాలు పెట్టడం. కర్నూలులో 4,766ఎకరాల్లో సోలార్ ప్రాజెక్ట్ ఏర్పాటుచేసేలా, 5,230 మెగావాట్ల విద్యుత్ఉత్పత్తి చేసేలా, చంద్రబాబుహాయాంలోనే గ్రీన్ కో ఎనర్జీ సంస్థతో ఒప్పందం జరిగింది. ఒకేచోట సౌర, పవన, జలవిద్యుత్ ఉత్పత్తి జరిగేలా జనవరి 9-2019న ఒప్పందంచేసుకున్నారు. దానికి అవసరమైన భూమినికూడా టీడీపీప్రభుత్వం కేటాయించింది.

గ్రీన్ కో ప్రాజెక్ట్ లో అక్రమాలుజరిగాయని, చంద్రబాబు చేసుకున్న ఒప్పందాలన్నీతప్పని ఆ ఒప్పందాన్ని అధికారం లోకి వచ్చినవెంటనే జగన్ రెడ్డి రద్దుచేశాడు. తానురద్దుచేసిన ఒప్పందాలనే తిరిగి దావోస్ వేదికగా ఈనెల 17వతేదీన జగన్ రెడ్డి తిరిగి ఎందుకు చేసుకున్నాడో ఆయనే సమాధానంచెప్పాలి. జగన్ రెడ్డిది రెండునాల్కలధోరణి అనడానికి ఇదే నిదర్శనం. ఇదేమాదిరి అదానీగ్రూప్ విషయంలోనూ వ్యవహరించాడు. చంద్రబాబు హయాంలోజరిగిన పారిశ్రామిక ఒప్పందాలు అక్రమమన్న జగన్, అవే ఒప్పందాలకోసం దావోస్ వరకు వెళ్లడం సిగ్గుచేటు.

అసలు ముఖ్యమంత్రి దావోస్ వెళ్లింది పారిశ్రామికవేత్తలకోసమా… ఫ్యామిలీకోసమా? దావోస్ పర్యటన పేరుతో రూ.14.40కోట్ల ప్రజలసొమ్ముని జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగంచేశాడు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానిక డబ్బులు లేవంటున్న ముఖ్యమంత్రి, దావోస్ పర్యటన కోసం అంతసొమ్ము తగలేశాడు. చంద్రబాబు ఎప్పుడుదావోస్ వెళ్లినా ప్రభుత్వఖజానా నుంచి రూపాయికూడా వినియోగించలేదు. జగన్ పాలనలో ఏపీకి ఎన్నికంపెనీలు, ఉద్యోగాలు వచ్చాయనే దానిపై తక్షణమే శ్వేతపత్రం విడుదలచేయాలని డిమాండ్ చేస్తున్నాం.

చంద్రబాబు హయాంలో 16లక్షలకోట్ల పెట్టుబడులు, 30లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు జరిగాయి. దేశంలో పెట్టుబడులఆకర్షణ, కంపెనీల ఏర్పాటుపై పేటెంట్ రైట్స్ చంద్రబాబువే అనే పేరుంది. దావోస్ తో పాటు ప్రపంచం నలుమూలలా చంద్రబాబు కాలికి బలపం కట్టుకొని తిరిగి, ఏపీకి అంతర్జాతీయ కంపెనీలను తీసుకొచ్చారు. 2014 – 2019మధ్యన 39,450 పరిశ్రమలు రాష్ట్రానికివస్తే, 5లక్షల13వేల ఉద్యోగాలు వచ్చాయని ఈప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా ఒకప్రశ్నకు సమాధానంగా చెప్పింది.

టీడీపీహాయాంలో రూ.70వేలకోట్ల పెట్టుబడితో, లక్షా10వేల ఉద్యోగాలతో విశాఖపట్నంలో పాగావేయాల్సిన అదానీగ్రూప్ ఏమైందంటే మరలా జగన్ రెడ్డి 22వతేదీన దావోస్ లో అదే అదానీసంస్థతో ఒప్పందం చేసుకోవడంద్వారా తిరిగి ఏపీకిరాబోతుందా?

దావోస్ పర్యటన ద్వారా ఏపీకి లక్షా10వేలకోట్ల పెట్టుబడులు వస్తున్నాయంటున్న జగన్ రెడ్డి, దానిలో లక్షకోట్ల పెట్టుబడి తాలూకా ఒప్పందాలు (అదానీగ్రూప్, గ్రీన్ కో సంస్థలతో) గతంలో చంద్రబాబు చేసుకున్నవే అనేవాస్తవం మర్చిపోతే ఎలా? నిరుద్యోగులు, యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన జగన్, చివరకు తన అసమర్థత తో 300మంది నిరుద్యోగుల్ని పొట్టనపెట్టుకున్నాడు. కేవలం ఉద్యోగాలురావని, కుటుంబాల్ని ఎలాపోషించుకోవాలన్న ఆందోళనతోనే వారంతా ఆత్మహత్య చేసుకున్నారు. దావోస్ వెళ్లిన ముఖ్యమంత్రి వాస్తవంగా ఎన్నిపరిశ్రమలు ఏపీకి రాబోతు న్నాయో, ఎన్నిఉద్యోగాలు వస్తున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలి.

2018-19లో రాష్ట్రపారిశ్రామికాభివృద్ధిరేటు 10.24. చేతగానిముఖ్యమంత్రి హయాంలో ఇప్పుడు మైనస్ 2.6కి చేరింది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక అమర్ రాజా కంపెనీలు, కియా అనుబంధపరిశ్రమలు, లులూగ్రూప్, అదానీ గ్రూప్, రిలయన్స్ ఎలక్ట్రానిక్స్, ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ మిల్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, బి.ఆర్.షెట్టికంపెనీ, రుషికొండ, గన్నవరంలోని ఐటీ కంపెనీలు రాష్ట్రం విడిచిపోయాయి.”

LEAVE A RESPONSE