– సీఎంకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ లేఖ
విద్యుత్ శాఖలో పనిచేస్తున్నకాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, సీఎం జగన్ కు లేఖ రాశారు. ఎన్నికల ముందు వారికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన సీఎంను కోరారు. లేఖ సారాంశం ఇదీ..
గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు,
ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్
అమరావతి
విషయం: ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీ మేరకు విద్యుత్ కాంట్రాక్టు కార్మికులని రెగ్యులర్ చేయాలి, థర్డ్ పార్టీ వ్యవస్థ రద్దు చేసి, యాజమాన్యమే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.
ముఖ్యమంత్రి గారూ..
ప్రతిపక్షనేతగా వున్నప్పుడు మీరు ప్రజాసంకల్ప యాత్రలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చిన హామీలు గుర్తు చేద్దామని ఈ లేఖ రాస్తున్నాను. ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో కాంట్రాక్టు కార్మికుల కోసం ఆనాడు కార్చింది మొసలి కన్నీరు అని నేటి మీ నిర్లక్ష్య వైఖరి ద్వారా స్పష్టం అవుతోంది. పాదయాత్రలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికుల దీక్ష శిబిరాల వద్దకి వెళ్లారు. ప్రతీ జిల్లాలోనూ కాంట్రాక్టు కార్మికులూ తమ సమస్యలతో కూడిన వినతిపత్రాలు మీకు ఇచ్చినప్పుడు ఏ హామీలిచ్చారో మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను.
మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యార్హత, అనుభవం, సర్వీసుని పరిగణనలోకి తీసుకుని రెగ్యులర్ చేస్తామని, యాజమాన్యానికి-కార్మికులకు మధ్య ఉన్న దళారీ వ్యవస్థని రద్దు చేసి విద్యుత్ సంస్థ నుంచే జీతాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. నేను హామీ ఇవ్వలేదనడానికి కూడా వీలు కాదు. అన్నీ రికార్డెడ్‌గా వున్నాయి. మోసపూరిత హామీలిచ్చిన మీరు అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోయింది. విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకి ఇచ్చిన హామీని ఇప్పటికైనా గుర్తుకుతెచ్చుకుని నెరవేర్చేందుకు కృషి చేస్తారని కోరుతున్నాను. దశాబ్దాలకాలంగా ఏపీ ట్రాన్స్‌కో, జెన్ కో, డిస్కంలలో 26 వేల మంది కాంట్రాక్టు కార్మికులు ఉద్యోగభద్రత లేకుండా పనిచేస్తున్నారు.
చాలీచాలని వేతనాలు థర్డ్ పార్టీ దళారీలు మింగేయగా మిగిలింది మీరు విపరీతంగా పెంచేసిన ధరలకి ఆహారం అవుతోంది. కుటుంబ జీవనం కష్టంగా మారిన పరిస్థితుల్లో కాంట్రాక్టు కార్మికులు…మీవైపు ఆశగా చూస్తున్నారు. పాదయాత్రలో 13 జిల్లాల్లోనూ కాంట్రాక్టు కార్మికులు మిమ్మల్ని కలిసినప్పుడు ఇవే హామీలు అన్నిజిల్లాల్లోనూ ఇచ్చారు. థర్డ్ పార్టీ వ్యవస్థ రద్దు, సమాన పనికి సమానవేతనం, రెగ్యులర్ చేస్తామని చెప్పినవాటిలో ఏ ఒక్కటికీ ఇప్పటికీ ప్రతిపాదన దశకి కూడా రాలేదంటే, ఉద్దేశపూర్వకంగానే కాంట్రాక్టు కార్మికులని మీరు మోసం చేశారని అర్థం అవుతోంది.
ప్రతిపక్షనేతగా వున్నప్పుడు మీ అడుగులో అడుగు వేసి మీ వెంట నడిచిన కాంట్రాక్టు కార్మికులని సీఎం అయ్యాక విస్మరించడం దగా చేయడమే. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు కార్మికులని విద్యుత్ సంస్థలో విలీనం చేసుకుని ప్రొబేషనరీ కాలం ముగిశాక 24 వేలమందికి పైగా రెగ్యులర్ చేశారు. విద్యుత్ జేఏసీ ఆందోళనలకి పిలుపునిచ్చిన నేపథ్యంలో విద్యుత్‌శాఖా మంత్రి, ఇంధనశాఖ కార్యదర్శి, విద్యుత్ యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేశారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు-అవుట్ సోర్సింగ్ కార్మికులకు యాజమాన్యం నుంచే వేతనాలు అందించేందుకు, ఆరోగ్యబీమా, ప్రమాదబీమా, పదవీ విరమణ ప్రయోజనాలు, కారుణ్య నియామకాలు తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో ఎలా అమలుచేస్తున్నారో అధ్యయనం చేసి సిఫారసు చేయాలని 60 రోజులు గడువు విధించారు.
ఈ మినిట్స్ ఆఫ్ మీటింగ్ 17.11.2020న అప్పటి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఏడాది 16.2.2022న నిర్వహించిన మీటింగ్‌లోనూ కమిటీ ఇచ్చే నివేదికపై ఆధారపడి ప్రయోజనాల కల్పన ప్రణాళిక ఉంటుందని తేల్చేశారు. 60 రోజులు కాస్తా 660 రోజులు దాటిపోయింది. విద్యుత్‌శాఖా మంత్రి కూడా మారిపోయారు. సీఎం ఇచ్చిన ఒక్క హామీ నెరవేరలేదు. కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ కార్మికులకి వేతనాలు ఇచ్చే థర్డ్ పార్టీ సంస్థ కమీషన్లు, జీఎస్టీ రూపంలో ఏడాదికి 149 కోట్లు కార్మికుల కష్టాన్ని మింగేస్తోంది. దళారీ సంస్థ దోపిడీ వల్ల కాంట్రాక్టు కార్మికునికి 26 వేలు వేతనం రావాల్సి వుంటే..కటింగులన్నీ పోను చేతికి 18,500 వస్తోంది. సెలవుల్లేకుండా, రాత్రీ పగలనే తేడా లేకుండా ప్రమాదకరమైన పనులు చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు అరకొర జీతాలతో జీవితాలు అగమ్యగోచరం అయ్యాయి.
ప్రమాదమో, ఆరోగ్య సమస్య తలెత్తితే చందాలు ఎత్తితే తప్పించి కష్టం ఒడ్డెక్కే పరిస్థితి లేదు. మీరు సీఎం అయ్యి మూడేళ్లు అవుతోంది..ఇప్పటికైనా కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చిన మేరకు హామీ నెరవేర్చాలని కోరుతున్నాను. చాలామందికి వయస్సు దాటిపోతుంది. మరికొందరు ప్రమాదాలు, అనారోగ్యాలతో రెగ్యులర్ ఆశని చంపేసుకుంటున్నారు. మానవత్వంతో ఆలోచించి, రెగ్యులర్ చేస్తామనే ఆశతో వారి ఓట్లును దండుకున్నామనే విషయాన్ని మరొక్కసారి గుర్తుకు తెచ్చుకుని మీ మాట తప్పుడు ఆనవాయితీని బ్రేక్ చేయాలని ఆశిస్తున్నాను. థర్డ్ పార్టీ వ్యవస్థని రద్దు చేసి, విద్యుత్ యాజమాన్యమే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు విద్యార్హత, వయస్సు,అనుభవం పరిగణనలోకి తీసుకుని తక్షణమే రెగ్యులర్ చేయాలి.