Suryaa.co.in

Andhra Pradesh

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి జగన్ ప్రభుత్వమే కారణం

– సాక్షిలో అబద్ధపు కథనాలతో వాస్తవాల్ని వక్రీకరించారు
-ఏ ప్రభుత్వ హయాంలో పెరిగాయో రుజువు చేస్తాం చర్చకు సిద్ధమా?
– మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్

పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి గత ప్రభుత్వమే కారణమని సాక్షి పత్రికలో కథనాలు రాయడం జనాన్ని తప్పుదోవ పట్టించడమేనని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ మండిపడ్డారు. సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

సాక్షి పత్రికలో అన్నీ అబద్ధాలు వండివార్చారు
సాక్షి పత్రికలో అన్నీ అబద్ధాలు వండి వార్చారు. జగన్ రెడ్డి అసమర్థత వల్లనే రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగాయి. సాక్షి పత్రికలో అన్నీ వక్రీకరిస్తూ.. అసత్యాలు వల్లెవేస్తారు. సాక్షి దినపత్రికను వైసీపీ కరపత్రిక అనొచ్చు. అందులోని రాతలు నిసిగ్గుగా, జుగుప్సాకరంగా ఉంటున్నాయి. ఆ పత్రికలో అన్ని అసత్యాలు, కోతలు తప్ప ఏమీ ఉండదు. పెట్రోల్, డీజల్ ధరలపై అన్నీ అబద్ధాలు రాశారు. సాక్షి ఎడిటర్ భారతీరెడ్డి, రాసిన వారు ఎవరైనా సరే చర్చకు వస్తే వివరించడానికి నేను సిద్ధం. జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో, పాదయాత్ర సమయంలో తన నటనను చూపాడు.
జగన్ నటనకు ఆస్కార్ అవార్డు కూడా చిన్నదేమో. నాడు పెట్రోల్, డీజిల్ ధరలు బాదుడే బాదుడు అని మాట్లాడిన జగన్ నేడు చుట్టుపక్కల గల రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా పెట్రోల్, డీజిల్ రూ.5 నుంచి 7 వరకు తక్కువకే లభిస్తోంది. అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ పూర్తిగా రద్దు చేస్తా అని హోరెత్తించిన జగన్ వాటి ధరలు విపరీతంగా పెంచేశారు. టీడీపీ హయాంలో పెట్రోల్ పై వ్యాట్ 31 శాతం ఉంటే వ్యాట్ ను తగ్గించిన ఘనత చంద్రబాబుది. అబద్ధాల రెడ్డి అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటేలా చేశాడు. అబద్ధానికి ప్యాంటు, షర్టు వేస్తే అచ్చం జగన్ రెడ్డిలా ఉంటుంది. 204 జీవోను గమనిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు ఎవరు పెంచారో అర్థమౌతుంది.

పెట్రోల్, డీజిల్ పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ 2022 మేలో నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోను పెట్రోల్ పై 8రూపాయలు, డీజీల్ పై 6 రూపాయల భారం తగ్గింది. రాష్ట్రంలో మాత్రం ఎందుకు తగ్గలేదు? దేశంలోని 23 రాష్ట్రాలు వ్యాట్ ను కూడా తగ్గించాయి. పెట్రోల్, డీజిల్ పై 7 రూపాయలు తగ్గాయి. మొత్తంగా చూస్తే పెట్రోల్ పై 15 రూపాయలు, డీజిల్ పై 13 రూపాయల వరకు ధరలు తగ్గాయి. రాష్ట్రంలో మాత్రం తగ్గలేదు. నేడు కుప్పం వద్ద గల శాంతిపురం మండలానికి కర్నాటక బార్డర్ లోని పెట్రోల్ బంక్ లో డీజిల్ ధర ఏపీ లో ఉన్న పెట్రోల్ బంక్ లోని డీజిల్ ధర కన్నా లీటరుకు 13 రూపాయలు తక్కువగా ఉంది. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా రాష్ట్రం వ్యాట్ ను తగ్గించేది లేదని ఆనాడు పౌర సరఫరా శాఖ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలు మరచిపోలేదు. 3 సంవత్సరాల 11 నెలల కాలంగా టీడీపీ నాయకులు గడ్డిపీకుతున్నారా?

అవినీతి, అరాచకాలు, అసమర్థ పాలనకు నిదర్శనమే డీజిల్ పెట్రోల్ ధరల పెరుగుదల:
మీ అవినీతి దాహానికి, మీ అరాచక, అసమర్థ పాలనకి ధరలు ఆకాశాన్నంటున్నాయి. పేదవాడు కొని తినలేని పరిస్థితులున్నాయి. మధ్య తరగతి కుటుంబాలు మాడి మసై పోతుంటే జగన్ మాత్రం తాడేపల్లె ప్యాలెస్ లో కూర్చొని పబ్జీ గేమ్ ఆడుకుంటున్నారు. రోడ్డు డెవలప్ మెంట్ సెస్ పేరుతో ప్రతి లీటరు పెట్రోల్, డీజిల్ పైన అదనంగా ఒక రూపాయి వసూలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడా ఒక్క గుంతను కూడా పూడ్చలేదు. సెస్ లు అధికంగా వేస్తున్నారు. వ్యాట్ ను అధికంగా పెంచారు. పెట్రోల్, డీజిల్ పై పన్నులు పెంచారు. మాకేమీ సంబంధంలేదు, గత ప్రభుత్వం పెంచిందని చెప్పడం విడ్డూరంగా ఉంది. కేంద్రం వల్ల పెరిగాయని కుంటి సాకులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రజలు అమాయకులని అనుకోవద్దు. జగన్ ది మేడిపండు ప్రభుత్వం. జగన్ అసలు స్వరూపం ప్రజానీకానికి అర్థమైంది. దోపిడీ మయం. టీడీపీ అధికారం నుండి దిగేనాటికి పెట్రోల్ 76 రూపాయలు, డీజిల్ 70 రూపాయలు ఉంది. నేడు పెట్రోల్ ధర 111 రూపాయలు, డీజల్ 87 రూపాయలు ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఉన్నాయి. వంట గ్యాస్ ధరని విపరీతంగా పెంచారు. వంట గ్యాస్ పై14.5 శాతం ఉన్న వ్యాట్ ని 24.5 శాతానికి పెంచుతూ సెప్టెంబర్ 12, 2020న జీవో తెచ్చారు.

ఒక్క ఛాన్స్, బాదుడే బాదుడు అని అధికారంలోకి వచ్చి జానాలను నిండా ముంచారు
ఒక్క ఛాన్స్, బాదుడే బాదుడు అని అధికారంలోకి వచ్చి జానాలను నిండా ముంచారు. జగన్ పాలనలో ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైంది. నేడు ప్రజలు కడుపు నిండా తినలేని పరిస్థితులు నెలకొన్నాయి. అధిక ధరలు, పన్నుల వల్ల ప్రజలు అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి వచ్చారు. నాడు తియ్యటి మాటలు చెప్పి నేడు గొంతులు కోస్తున్నారు. ఇకమీదట జగన్ అబద్ధాలు ఏమాత్రం చెల్లుబాటు కావు. ధరల బాదుడుపై చర్చకు ఎవరొచ్చినా నేను సిద్ధం.
బటన్ నొక్కుడు కార్యక్రమంతోపాటు గొంతు నొక్కుడు కార్యక్రమం కూడా చేస్తున్నారు. కుటుంబాల్లో ఆర్థిక ప్రగతి లేకుండా పోయింది. ప్రజల జీవితాలు ఎప్పుడు బాగుపడతాయో అని జనం ఎదురుచూస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్ పేర్కొన్నారు.

LEAVE A RESPONSE