– ఎన్డీయే మంత్రం అభివృద్ధి..వైసీపీ మంత్రం అవినీతి
– వైసీపీకి అవినీతి నిర్వహణ తప్ప రాష్ట్ర ఆర్థిక నియంత్రణ తెలియదు
– వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జెడ్ స్పీడ్
– మే 13న ఏపీలో కొత్త ఆధ్యాయం
– మోదీ గ్యారెంటీ..బాబు నాయకత్వం, పవన్ విశ్వాసం ఏపీకి అవసరం
– రాజమండ్రి ఎన్నికల సభలో ప్రధాని
మోదీ
రాజమండ్రి: చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని . అయితే అలాంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ వైసీపీ ప్రభుత్వం అప్పుల ఊబిలో నెట్టిందని ప్రధాని మోదీ విమర్శించారు. ఎన్డీయే మంత్రం అభివృద్ధి.. అభివృద్ధి.. అభివృద్ధి అని.. వైసీపీ మంత్రం అవినీతి..అవినీతి..అవినీతి.. అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే సర్కార్ ఏర్పడుతుందని ప్రధాని అన్నారు. ఏపీకి మోదీ గ్యారెంటీ.. బాబు నాయకత్వం, పవన్ విశ్వాసం అవసరం అని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిభావంతులైన యువతకు నెలవని అభివర్ణించారు.
అలాంటి రాష్ట్రంలో వైసీపీ పాలనలో అభివృద్ధి సున్నా. అవినీతి మాత్రం వంద శాతమని మోదీ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ది చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరమన్నారు. కేంద్ర ప్రాజెక్టులను సైతం వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు.
కేంద్రం చేపట్టిన అభివృద్ధి పనులను వైసీపీ ప్రభుత్వం అడ్డుకుందని ప్రధాని ఆరోపించారు. ఏపీ కోసం కేంద్రం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, వైసీపీ సర్కార్ మాత్రం ఏమీ చేయడం లేదని విమర్శించారు. విశాఖ రైల్వే జోన్ ఆఫీస్‌కి వైసీపీ సర్కార్ భూమి కూడా ఇవ్వలేదని, కేంద్రం భారీగా ఇళ్లు ఇచ్చినా ఈ ప్రభుత్వం నిర్మించలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టును జగన్ తండ్రి ప్రారంభించారని, పోలవరం నిర్మాణాన్ని మాత్రం జగన్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
వైసీపీ ప్రభుత్వం నిర్వాకం కారణంగా ఏపీలో అనేక చక్కెర పరిశ్రమలు మూత పడ్డాయని, వైసీపీ ప్రభుత్వ విధానాలతో చెరుకు రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని విమర్శించారు. డబుల్ ఇంజిన్ సర్కార్‌తో చెరుకు రైతుల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు. వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని, కర్ణాటకలో ట్యాంకర్, భూమాఫియా ప్రభుత్వం నడుస్తుంటే ఏపీలో శాండ్, ల్యాండ్ మాఫియా విజృంభిస్తోందని ఆరోపించారు.
రాజమండ్రిలో ఎన్డీయే కూటమి నిర్వహించిన ఎన్నికల సభలో మోదీ తెలుగులో తన ప్రసంగం ప్రారంభించారు. ఈ మోదీ సందర్భంగా ఏమన్నారంటే.. నా ఆంధ్రా కుటుంబసభ్యులకు నమస్కారాలు.ఈ నేల నుంచే ఇప్పుడు సరికొత్త చరిత్రను లిఖించబోతున్నాం. దేశంలో, ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ అధికారం. మే 13న ఏపీలో కొత్త ఆధ్యాయం కాబోతుంది.
ఏపీలో మద్యనిషేధం పేరు చెప్పి వైసీపీ అధికారంలోకి వచ్చింది.అధికారంలోకి వచ్చాక మద్యం సిండికేట్‌గా తయారయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి జెడ్ స్పీడ్‌తో పరిగెత్తింది. మూడు రాజధానులు చేస్తామన్నారు.. ఒక్కటీ చేయలేదు. మూడు రాజధానుల పేరుతో ఏపీని లూటీ చేసిన వైసీపీ. అవినీతి నిర్వహణ చేయడం తప్ప.. వైసీపీ ప్రభుత్వానికి ఆర్థిక నిర్వహణ తెలియదు.
రాష్ట్ర ఖజానాను వైసీపీ ప్రభుత్వం ఖాళీ చేసింది. రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.15వేల కోట్లు ఇవ్వాలని భావించింది. కేంద్ర నిధులను వైసీపీ సర్కారు అందుకోలేకపోయింది.మోదీ గ్యారెంటీ..బాబు నాయకత్వం, పవన్ విశ్వాసం ఏపీకి అవసరం.
కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పదేళ్ల క్రితం దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అథోగతిపాలు చేసింది. ఈడీ..ఈడీ..అంటూ ఇండి కూటమి గగ్గోలు పెడుతోంది.కాంగ్రెస్ నేతల దగ్గర గుట్టలకొద్దీ డబ్బు బయటపడుతోంది. కాంగ్రెస్ నేతల డబ్బును మిషన్లు కూడా లెక్కపెట్టలేకపోతున్నాయి.