Suryaa.co.in

Andhra Pradesh

నీ అవినీతి కేసులు కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతావా?

-జీఎస్టీ నష్టపరిహారంలో రాష్ట్రం నష్టపోయేలా కేంద్రానికి మద్దతు ఇవ్వడం దేనికి సంకేతం.?
-జీఎస్టీ కౌన్సిల్ లో ప్రజలపై భారాలు మోపుతున్నా నోరు మెదపరా?
– యనమల రామకృష్ణుడు

జీఎస్టీ నష్టపరిహారం మరో ఐదేళ్ల పాటు పొడింగించాలని చండీఘడ్ లో జరిగిన 47 వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో అన్ని రాష్ట్రాలు అడిగితే ఏపీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయింది. పుదుచ్చేరి, జార్ఖండ్ లాంటి చిన్న చిన్న రాష్ట్రాలు సైతం జీఎస్టీ నష్టపరిహారంపై గళం విప్పారు.. కేంద్రాన్ని ప్రశ్నించారు. జగన్ రెడ్డి, ఆయన ఆర్ధికమంత్రి మాత్రం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టేందుకే నిర్ణయించుకున్నారు. జీఎస్టీతో 17 రకాల పన్నులు కేంద్రం చేతుల్లోకి వెళ్లిన సంధర్బంలో నష్టపోయిన రాష్ట్రాలకు ఆదాయంలో కొంతభాగం చెల్లించాలని జీఎస్టీ చట్టంలోనే ఉంది. చట్టపరంగా రావాల్సిన హక్కులను సైతం అడగలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉండటం భాధాకరం.

రాష్ట్రపతి ఎన్నికల నేపద్యంలో ప్రత్యేకహోదా సాధించుకునే మంచి అవకాశం వచ్చినా.. ఎలాంటి షరతులు లేకుండా కేంద్రప్రభుత్వానికి మద్దతు ఇచ్చి రాష్ట్ర యువత భవిత మంటగలిపింది చాలక ఇప్పుడు ఆర్ధికంగా రాష్ట్రం నష్టపోతున్నా కేంద్రానికి మద్దతు తెలుపుతున్నారు. ప్రజలపై భారాలు పడకుండా చర్యలు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రజలపై భారాలు పడేలా కేంద్రం నిర్ణయాలు చేస్తున్నా వైసీపీ ప్రభుత్వం మద్దతు తెలపడం దుర్మార్గం. పెరుగు, తేనె, చేపలు, మాంసం వంటి ఆహార పదార్ధాలపై జీఎస్టీ విధిస్తామన్న నిర్ణయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ విధంగా మద్దతు పలుకుతుంది.? ప్రజలపై పడుతున్న భారాలను మీరు పట్టించుకోరా? రెవెన్యూ నష్టానికి సంబంధించి రాష్ట్రాలకు పరిహారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చే దానికంటే పోయేదే ఎక్కువ అన్న విషయం వాస్తవం కాదా?

జీఎస్టీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో తెలిపిన అంగీకార వివరాలను బహిర్గతం చేయాలి. రాష్ట్రంలో నెలకొన్న వాస్తవ పరిస్థితిని వివరించడంలో దారుణంగా విఫలమయ్యారు. విద్యుత్ ఆదా చేయడానికి ఉపయోగించే ఎల్.ఈ.డీ బల్బులపై కూడా పన్నులు పెంచుతుంటే ఆమోదం తెలపడం దేనికి సంకేతం? రైతులపై భారం పెంచేలా ఎలక్ట్రిక్ పంపులు, మిషన్ల పై ఉన్న పన్నును 12 నుంచి 18 శాతానికి పెంచినా గానీ మాట్లాడలేని స్థితిలో జగన్ ప్రభుత్వం ఉంది.

LEAVE A RESPONSE