-మండలి దండగ, ప్రజా ప్రయోజనం లేదన్న జగన్ ఇప్పుడు ఏమొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు?
-గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీ ఇంచార్జ్ ల, నేతల పనితీరుకు పరీక్ష
-జగన్ తీవ్ర అసహనంలో ఉన్నాడు…అందుకే హింసకు దిగుతున్నాడు
-పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
-టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లకు చంద్రబాబు విజ్ఞప్తి
అమరావతి:- నాడు శాసన మండలి రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సిఎం వైఎస్ జగన్ కు ఇప్పుడు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఎక్కడిదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తన మాట నెగ్గలేదనే అహంకారంతో నాడు ఏకపక్షంగా జగన్ మండలి రద్దుకు తీర్మానం చెయ్యలేదా అని ప్రశ్నించారు.
శాసన మండలి వల్ల ప్రజా ప్రయోజనం లేదని…. ట్రెజరీ నుంచి ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం కూడా దండగే అని సిఎం జగన్ అనలేదా అని చంద్రబాబు ప్రశ్నించారు. మండలి లాంటి వ్యవస్థలను అగౌర పరిచిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టి…ఓట్లు అడుతారని చంద్రబాబు నాయుడు అన్నారు.
పట్ట భద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎన్నికలపై పార్టీ ఇంచార్జ్ లు, ముఖ్యనేతలతో చంద్రబాబు నాయుడు ఆన్ లైన్ లో సమావేశం అయ్యారు. నేతలంతా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో ప్రస్తుతం తీవ్ర ప్రభుత్వ వ్యతిరేక ఉందని…. అదే సమయంలో తెలుగుదేశానికి అనుకూలంగా పరిస్థితి ఉందని అన్నారు. ఈ పరిస్థితుల్లో వచ్చిన పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు నేతలకు సూచించారు. ఈ ఎన్నికలు ఇంచార్జ్ లు, నేతల పరితీరుకు, సమర్థతకు పరీక్ష గా ఉండబోతున్నాయని ఆయన అన్నారు.
ఈస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్, వెస్ట్ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి వి.చిరంజీవి రావు లను గెలిపించాలని ఆయన ఓటర్లకు పిలుపునిచ్చారు. పాలనలో అన్ని విధాలా విఫలమైన సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇప్పుడు తీవ్ర అసహనంతో ఉన్నాడని… అందులో భాగంగానే రాష్ట్రంలో టీడీపీ నేతల పర్యటనలు, సభలపై ఆంక్షలు పెడుతున్నారని అన్నారు. తాజా గన్నవరం దాడులు జగన్ ఆలోచనలకు, మనస్తత్వానికి నిదర్శనం అన్నారు.
ప్రజల్లో మార్పు వచ్చి…ప్రభుత్వ వ్యతిరేక గళం వినిపిస్తుండడంతో…దాడులు, హింసా ఘటనలతో భయపెట్టాలనే ప్రయత్నాలు మొదలు పెట్టారని అన్నారు. కరుడుగట్టిన ఉగ్రవాదిలా సిఎం ప్రవర్తిస్తుంటే…కొందరు పోలీసులు బాధ్యత మరిచి జగన్ కు ఊడిగం చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. గన్నవరంలో పోలీసుల సమక్షంలో, సహకారంతో దాడులు జరగడం, పైగా బాధితులపైనే హత్యాయత్నం వంటి కేసులు పెట్టడం జగన్ సైకో పాలన కు నిదర్శనం అని చంద్రబాబు నాయుడు అన్నారు.