Suryaa.co.in

Andhra Pradesh

పార్టీ కోసం కష్టపడ్డ వారికి జగన్ పదవులిచ్చి గౌరవించారు

-తగిన రీతిలో ప్రతి కార్యకర్తకు న్యాయం
-అనుబంధ విభాగాల సమావేశాలలో విజయసాయిరెడ్డి

ప్రతిపక్షంలో ఉండగా పార్టీ కోసం పని చేసిన నాయకులు, కార్యకర్తలకు గతంలో ఎవరూ చేయని విధంగా అధికారంలోకి వచ్చాక జగన్ మోహన్ రెడ్డి పదవులిచ్చి గౌరవించారని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కోఆర్డినేటర్, పార్టీ అనుబంధ విభాగాల ఇంచార్జ్ వి.విజయసాయిరెడ్డి తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పార్టీ గ్రీవెన్స్ సెల్, సాంస్కృతిక విభాగాల అధ్యక్షులు, జోనల్ ఇంచార్జిలు, జిల్లా అధ్యక్షులతో విజయసాయిరెడ్డి సమావేశాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటికి పెద్దఎత్తున సంక్షేమ పధకాలు అందేలా చేస్తున్నారని అన్నారు. ఈ నాలుగేళ్ల పాలనాలలో విప్లవాత్మక సంస్కరణ తెచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతి, అక్రమాలకు తావు లేకుండా, మిక్కిలి పారదర్శకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు.

ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందుతున్న వారు సంతృప్తితో ఉన్నారని చెప్పారు. జగన్ పాలనపై జనామోదం వ్యక్తమవుతూనే ఉందని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన తరవాత నుండి ఇప్పటివరకు న్యాయం జరగని కార్యకర్తలను కూడా గుర్తించి వారికి తగిన రీతిలో న్యాయం జరిగేలా పార్టీ చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.. కింది స్థాయిలో పార్టీ కార్యకర్తల సమస్యలను పార్టీ గ్రీవెన్స్ విభాగం పరిష్కరించే బాధ్యత తీసుకోవాలని సూచనలు చేశారు. పార్టీ అనుబంధ విభాగాలలో కమిటిల నియామకం పూర్తి కాగనే కమిటిలలో ఉన్నవారందరికి ఐడి కార్డులు జారీ చెయ్యడం జరుగుతుందన్నారు.

జిల్లా,మండల స్థాయి కమిటిల ఏర్పాటులో స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలతో సమన్వయం చేసుకోని పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చెయ్యాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి అనుబంధ విభాగాల నాయకులు ఇచ్చిన సలహాలు,సూచనలను అమలు జరిగే విధంగా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.. గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు అంకంరెడ్డి నారాయణమూర్తి, సంస్కృతిక విభాగ అధ్యక్షురాలు వంగపండు ఉష నేతృత్వంలో ఈ సమావేశాలు జరిగాయి.. ఈ సమావేశాలలో పార్టీ కార్యాలయ ఇంచార్జ్, ఎమ్మెల్సీ లెళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE