– జగన్ రెడ్డికి మంత్రి సత్యకుమార్ యాదవ్ సవాల్
– అరబిందోకు అప్పనంగా కట్టబెట్టలేదా?
– 30 రకాల ఆర్థిక నేరాల కేసులున్న జైలు పక్షి జగన్
– కేంద్ర ప్రభుత్వ విధానం కూడా పీపీపీనే
– అందుకని పీఎం మోదీని కూడా జైలుకు పంపుతారా?
– మీ తాటాకు చప్పుళ్లకు బెదిరేవారెవరూ లేరు జగన్
– గవర్నరునూ పక్కతోవ పట్టించే ప్రయత్నం
– పీపీపీ విధానంలో ప్రైవేటీకరణకు ఆస్కారమే లేదు
– జగన్ పై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిప్పులు
అమరావతి: మళ్లీ అధికారంలోనికి వచ్చి..2 నెలల్లోనే. పీపీపీ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణంలో అక్రమాలకు పాల్పడిన వారినందరినీ జైలుకు పంపిస్తానంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో ఎన్నికలకు ఇంకా మూడున్నర సంవత్సరాల సమయం ఉండగా..ఆ తరువాత అధికారాన్ని చేపట్టి.. సంబంధిత వ్యక్తులను జైలుకు పంపిస్తానంటూ వ్యాఖ్యలు చేయడం జగన్ రెడ్డి సహజమైన అధికార దుర్వినియోగ ధోరణిని వెల్లడిస్తుందని మంత్రి మండిపడ్డారు. పీపీపీ విధానం తప్పు అయితే..వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న తనను జైలుకు పంపాలని జగన్ కు మంత్రి సత్యకుమార్ సవాల్ విసిరారు.
పీఎం నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పీపీపీ విధానాన్ని ప్రోత్సహిస్తోందనీ, అలాగని పీఎం మోదీని కూడా జైలుకు పంపుతారా? అలాగే.. పార్లమెంటరీ స్థాయి సంఘం, నీతి ఆయోగ్, ఎన్ఎంసీ, న్యాయస్థానాలు సమర్ధించాయి? అందుకని..అందర్ని జైలుకు పంపుతారా? అని జగన్ పై సత్యకుమార్ ధ్వజమెత్తారు. రాష్ట్ర సచివాలయంలో గురువారం సాయంత్రం మంత్రి సత్యకుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
గవర్నర్ను కలిసే సమయంలోనూ బల ప్రదర్శన చేస్తారా?
రాజ్యాంగ బద్ధ హోదాలో ఉన్న గవర్నర్ ను కలిసేందుకు కూడా జగన్ బలప్రదర్శన ద్వారా ప్రజలకు ఆటంకాలు సృష్టిస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. కోటి సంతకాల పేరుతో గవర్నర్ ను కూడా పక్కదారిపట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పీపీపీ విధానంలో 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను అభివృద్ధి చేయడం కూటమి ప్రభుత్వ విధానమన్నారు. స్కాంల జగన్ రెడ్డికి అంతా అలాగే కనిపిస్తుందన్నారు.
రాష్ట్రంలో విజిటింగ్ పొలిటీషియన్ గా ఉన్న జగన్ కొత్త డ్రామాలకు తెరదీస్తున్నారని మండిపడ్డారు. గత..ఐదేళ్లపాలనా కాలంలో ఇదే రీతిన వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి మరల అదేబాటన నడుస్తున్నానని స్పష్టం చేయడాన్ని ప్రజలు గమనించాలని మంత్రి కోరారు. పేద విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్య, పేదలకు మెరుగైన వైద్యాన్ని కూటమి ప్రభుత్వం అందించడం జగన్ రెడ్డికి ఏ మాత్రం ఇష్టంలేదని మంత్రి సత్యకుమార్ అన్నారు.
పీపీపీ విధానంపై సిబిఐ విచారణకు డిమాండ్ చేసినా, కోర్టును ఆశ్రయించినా స్వాగతిస్తామన్నారు. అలాగే టెండర్ ద్వారా సంస్థల ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు. వైకాపా హయాంలో వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ.500 కోట్ల నుంచి రూ.600 కోట్ల వరకు ఖర్చు పెట్టేలా ఉత్తర్వులిచ్చి భారీ అవినీతి అక్రమాలకు బీజం వేశారన్నారు. తాజా పరిణామాలతో ఈ అక్రమాలన్నీ బయటికొస్తాన్న ఆందోళనతోనే ప్రజల దృష్టిని ఏమార్చేందుకు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని విరుచుకుపడ్డారు.
జైలుకు పోవడానికి నేను సిద్ధం
మొదటి దశల్లో పీపీపీ విధానంలో 4 ప్రభుత్వ వైద్య కళాశాలలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ విధివిధానాల మేరకు నలుగురు భాగస్వాములకు త్వరలో కేటాయించనున్నామని… ఈ విధానం అవినీతి, అక్రమాలతో కూడి ఉన్నదైతే తనను జైలుకు పంపడానికి జగన్ రెడ్డి తక్షణమే చర్యలు చేపట్టాలని మంత్రి సత్యకుమార్ సవాల్ విసిరారు. 30 రకాల ఆర్థిక నేరాల కేసులున్న జైలు పక్షి జగన్ మళ్లీ జైలుకు పోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు.
ప్రభుత్వ పీపీపీ విధానాలు, నియమాల మేరకు భాగస్వామ్యులుగా ఎంపికయ్యే వారిని జైలుకు పంపిస్తాననడం ఏ విధంగా సబబు అని చెప్పడం జగన్ రెడ్డి ధిక్కార స్వరానికి నిదర్శనమని మంత్రి దుయ్యబట్టారు. ఇప్పటివరకు పీపీపీ భాగసామ్యులు ఎవరు జైలుపాలైన దాఖలాలు లేవని జగన్ రెడ్డికి మంత్రి గుర్తుచేశారు.
ప్రపంచ వ్యాప్తంగా పలుఅభివృద్ధి కార్యక్రమాలకు సాధకంగా ఉపయోగపడుతున్న పీపీపీ విధానాన్ని కోర్టులు, ఉన్నతస్థాయి, పార్లమెంటరీ స్థాయీ సంఘం, నీతి ఆయోగ్, ఎన్ఎంసీ, నిపుణులు సమర్ధించారని.. వారి కంటే జగన్ ఎక్కువ మేధావా అని మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రశ్నించారు. వీరిపై కూడా జగన్ కేసులు పెడతారా అని మంత్రి సత్యకుమార్ నిలదీశారు.
కొనసాగుతున్న జగన్ రెడ్డి విధ్వంసక మనస్తత్వం
అధికారంలో ఉన్న ఐదేళ్లు రాష్ట్రంలో అన్ని రాజ్యాంగ, పాలన, సంక్షేమ, ఆరిక వ్యవస్థలను విధ్వంసానికి గురిచేసి రాష్ట్రాన్ని అధఃపాతాళానికి దిగజార్చిన మాజీ ముఖ్యమంత్రి తన వినాశకర వైఖరిని ఏ మాత్రం విడవకుండా ప్రతిపక్షంలో ఉండి కూడా అదే ధోరణిని కొనసాగిస్తున్నారని, ఆయన ఈ మనస్తత్వం రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు పెనుప్రమాదకరమని ప్రజలు, ముఖ్యంగా యువత గుర్తించాలని మంత్రి విజ్ఞప్తిచేశారు.
పీపీపీ విధానంలో ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్వహణకు ఎంపికైన వారిని అధికారంలోనికి వచ్చాక జైలుకు పంపిస్తానంటూ బెదిరించడం కుట్రపూరిత చర్య అని, ఆయా కళాశాలల నిర్మాణాలకు ఎవరూ ముందుకురాకుండా చూడడం జగన్ దురుద్దేశమని, ఆయన కుట్ర నెరవేరదని, పీపీపీ విధానం దివ్యంగా ముందుకుసాగుతుందని మంత్రి స్పష్టంచేశారు.
అసత్య ప్రచారం
పీపీపీ విధానంలో ముందుకుసాగే ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నచోట ప్రస్తుతం నడుస్తున్న అనుబంధ ప్రభుత్వ ఆసుపత్రులు ఎల్లప్పుడూ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తాయని మంత్రి స్పష్టంచే శారు. సదరు ఆసుపత్రుల సిబ్బంది జీతాలను ప్రభుత్వం చెల్లించడం తప్పు ఎలా అవుతుందని మంత్రి ప్రశ్నించారు. అవినీతిలో పుట్టిపెరిగిన వారు అదే భ్రాంతితో జీవితాంతం ఉంటారని మంత్రి ఎద్దేవాచేశారు. ఈ విషయంలో జైలు పక్షి జగన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదన్నారు.
జగన్ మరల జైలుకు పోవడం తథ్యం
నాడు తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని వేలాది కోట్లు దోచుకుని విస్తృత వ్యాపార సామాజ్య అధినేతగా అనతికాలంలోనే ఎదిగి, ఆ పాపఫలంగా పలు సీబీఐ కేసుల్లో 16నెలలపాటు కారాగారవాసాన్ని అనుభవించిన మాజీ ముఖ్యమంత్రి త్వరలో మళ్లీ చువ్వలు లెక్కబెట్టడం తధ్యమని.. ఈ తరుణంలో ఆయన ఇతరులను జైలుకు పంపిస్తాననడం జగన్ భయంతో కూడిన మానసిక స్థితిని వెల్లడిస్తోందని మంత్రి అన్నారు.
జగన్ ఆలోచన ప్రకారం దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు పీపీపీ విధానంలో వేలాది కిలోమీటర్ల జాతీయ రహదారులను, పదుల సంఖ్యలో విమానాశ్రయాలను, నౌకాశ్రయాలను నిర్మించిన వారిని జైలుపాలు చేయాల్సి ఉంటుందన్నారు. ఇది సబబా అని మంత్రి ప్రశ్నించారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు వందలాది డయాగ్నస్టిక్ పరికరాలను ప్రభుత్వాసుపత్రుల్లో పీపీపీ పద్ధతుల్లో నియమించారని, అది తప్పు అని కూటమి ప్రభుత్వం భావించలేదు కనుకనే వారెవ్వరినీ ఇబ్బందులకు గురిచేయలేదని మంత్రి తెలిపారు.
అరబిందోకు అప్పనంగా కట్టబెట్టలేదా?
రాష్ట్ర వ్యాప్త 108, 104 సేవలను పీపీపీ విధానంలో అరబిందోకు ఎటువంటి పారదర్శకత లేకుండా జగన్ కట్టబెట్టలేదా? అని మంత్రి ప్రశ్నించారు. పేదలకు లభిస్తున్న ఆరోగ్యశ్రీ(ఎన్టీఆర్ వైద్యసేవ) సేవలను పీపీపీ పద్ధతిలో అందుతున్నాయా? లేవా? ఇవన్నీ తప్పు కానప్పుడు…పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు నిర్శిస్తే తప్పు ఎలా అవుతుంది? జగన్ అని మంత్రి సత్యకుమార్ విరుచుకు పడ్డారు.
జగన్కు ప్రశ్నలు సంధించిన మంత్రి సత్యకుమార్
పీపీపీ విధానంపై దుష్ప్రచారం చేస్తున్న మాజీ ముఖ్యమంత్రికి మంత్రి సత్యకుమార్ యాదవ్ కొన్ని ప్రశ్నలు సంధించి, సమాధానాలు కోరారు:
1.నాలుగు సంవత్సరాల్లో 2,545 ఎంబీబీఎస్ ప్రవేశాలు కల్పిస్తామన్న జగన్ ఎందుకు పూర్తిగా విఫలమయ్యారు
2.చిత్త శుద్ధి ఉంటే నాలుగు సంవత్సరాల్లో మొత్తం ఆమోదిత ఖర్చు రూ.8,480 కోట్లలో కేవలం రూ.1,550 కోట్లు మాత్రమే ఖర్చుచేస్తే సకాలంలో కాలేజీలు నడుస్తాయా?
3.అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల పల్లవి ఎత్తుకున్న మీరు ఇతర కళాశాలలను విస్మరించి పులివెందుల కోసం 80% ఎందుకు వెచ్చించారు?
4.పులివెందుల కళాశాలకు రూ.391 కోట్లు మీరు వెచ్చించినా ఎందుకు ప్రవేశాలు జరగలేదు?
5.అంత ఖర్చుచేసినా పులివెందుల కళాశాల పరిస్థితి ఆ విధంగా ఉంటే కేవలం రూ.28 కోట్ల నుంచి రూ.48 కోట్లు మాత్రమే ఖర్చుచేసిన మార్కాపురం, మదనపల్లె, ఆదోని కళాశాలల్లో ప్రవేశాలు ఎలా సాధ్యం?
6. మిగిలిన కళాశాలలు పునాదులు, అత్తెసరు నిర్మాణాలతో ఆగిపోలేదా?
7.పార్వతీపురం వైద్య కళాశాల కోసం మీ ప్రభుత్వం భూసేకరణను కూడా ఎందుకు చేయలేదు?
8.ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వార్షిక ఫీజులను రూ.12 లక్షలు (బి.కేటగిరి), రూ.20 లక్షలు(సి.కేటగిరి)గా నిర్ధారించిన మీరు నేడు పీపీపీ విధానాన్ని ప్రైవేటీకరణ అనడం సబబా?
9.సంవత్సరానికి కేవలం వెయ్యి కోట్ల రూపాయల చొప్పున వెచ్చిస్తే అన్ని 17 కళాశాలలు విద్యార్థులకు అందుబాటులోనికి వచ్చేవి అంటున్న మీరు మీ ఐదేళ్లలో ఆ పనిని ఎందుకు చేయలేదు?