Suryaa.co.in

Andhra Pradesh

ఆరోగ్య‌శ్రీలో మ‌రో సంచ‌ల‌నం

-ఇంటింటికీ స‌రికొత్త కార్డుల పంపిణీకి జ‌గ‌న‌న్న ఆదేశాలు
-ఆరోగ్య‌శ్రీ కార్డు లేని పేద కుటుంబమే ఉండ‌టానికి వీల్లేదు
-రూ.25 ల‌క్ష‌ల వ‌ర‌కు పూర్తి ఉచితంగా ఆరోగ్య‌శ్రీ ద్వారా వైద్యం అందేలా చ‌ర్య‌లు
-ఆ మేర‌కు నూత‌న ఆరోగ్య‌శ్రీ కార్డుల పంపిణీ
-ఈ నెల 18 నుంచి పంపిణీకి సీఎం మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ
-ప్రతిఒక్క‌రి ఆరోగ్య వివ‌రాలు డిజిట‌లైజ్ చేయ‌డం జ‌గ‌న‌న్న ల‌క్ష్యం
-ఫ్యామిలీ డాక్ట‌ర్‌, జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష‌, ఆరోగ్య‌శ్రీ.. డేటా మొత్తం ఒకేచోట ఉండేలా చ‌ర్య‌లు
-జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష రెండో ద‌శ కార్య‌క్ర‌మానికి త్వ‌ర‌లో శ్రీకారం
-మ‌రింత ప‌కడ్బందీగా క్యాంపులు జ‌రిగేలా చ‌ర్య‌లు
-మ‌రిన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించేలా ఏర్పాట్లు
-రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని
-శాఖ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష స‌మావేశం

ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కానికి సంబంధించి త‌మ ప్ర‌భుత్వం మ‌రో సంచ‌ల‌నం దిశ‌గా అడుగులు వేస్తోంద‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. మంగ‌ళగిరిలోని ఏపీఐఐసీ ట‌వ‌ర్స్‌లో ఉన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్ర‌ధాన కార్యాల‌యంలో బుధ‌వారం వైద్య ఆరోగ్య‌శాఖ ఉన్న‌తాధికారుల‌తో ప‌లు అంశాల‌పై మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఉన్న‌త‌స్థాయి స‌మీక్ష స‌మావేశాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ త‌మ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని పూర్తి బ‌లోపేతం చేసేలా అడుగులు వేసిందని తెలిపారు.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆరోగ్య‌శ్రీ చికిత్స‌ల‌ను ఏకంగా 3257 కు తీసుకెళ్లార‌ని పేర్కొన్నారు. రూ.5 ల‌క్ష‌ల‌లోపు ఆదాయం ఉన్న ప్ర‌తి కుటుంబం ఆరోగ్య‌శ్రీ ప‌రిధిలోకి వ‌చ్చేలా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి చ‌ర్య‌లు తీసుకున్నార‌ని పేర్కొన్నారు. ఏకంగా రూ.25ల‌క్ష‌ల విలువైన చికిత్స‌లు సైతం ఆరోగ్య‌శ్రీ ద్వారా ఉచితంగా అందేలా మార్పులు తీసుకొచ్చార‌ని వివ‌రించారు. ఆరోగ్య‌శ్రీ ప‌థ‌కాన్ని పూర్తిస్థాయిలో బ‌లోపేతం చేసిన ఘ‌న‌త త‌మ ప్ర‌భుత్వానికే ద‌క్కుతుంద‌ని, ఆమేర‌కు ఆరోగ్య‌శ్రీ కార్డుల‌ను కూడా పూర్తిస్థాయిలో ఆధునికీక‌రించామ‌ని వెల్ల‌డించారు.

ఈ స‌రికొత్త ఆరోగ్య‌శ్రీ కార్డుల‌ను ప్ర‌తి కుటుంబానికి అతి త్వ‌ర‌లో అందేస్తామ‌ని పేర్కొన్నారు. ఇప్ప‌టికే కార్డుల త‌యారీ ప్ర‌క్రియ ప్రారంభ‌మైంద‌ని వెల్ల‌డించారు. ఈ నెల 18 నుంచి ఆరోగ్య‌శ్రీ నూత‌న కార్డుల పంపిణీకి శ్రీకారం చుట్టాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశార‌ని వివ‌రించారు. ఆ మేర‌కు అధికారులు వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.43 కోట్ల కుటుంబాల‌కు ఆరోగ్య‌శ్రీ కార్డులు ఇచ్చేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు.

స‌చివాల‌యాల వారీగా ప్ర‌తి ఒక్క‌రికి నూత‌న కార్డులు అందుతాయ‌ని చెప్పారు. కార్డుల జారీలో ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కుండా ప‌క్కాగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కొత్త‌గా రూపుదిద్దుకుంటున్న ఆరోగ్య‌శ్రీ కార్డుల్లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి సూచ‌న‌ల‌మేర‌కు అబా ఐడీ నంబ‌ర్లు కూడా ఉండేలా చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌న్నారు.

డేటా మొత్తం ఒక చోట ఉండాలి
మంత్రి విడ‌ద‌ల ర‌జిని మాట్లాడుతూ మ‌న రాష్ట్రంలోని ప్ర‌తి ఒక్క‌రి ఆరోగ్య వివ‌రాలు సుర‌క్షితంగా నిక్షిప్త‌మై ఉండాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ల‌క్ష్యం విధించార‌ని చెప్పారు. ఆ మేర‌కు ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఎన్నో సంస్క‌ర‌ణ‌లు చేపట్టింద‌న్నారు. మ‌న రాష్ట్రంలో వైద్యం పొందుతున్న అంద‌రి వివ‌రాల‌ను పూర్తి స్థాయిలో డిజిట‌లైజ్ చేస్తున్నామ‌న్నారు. జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష, ఫ్యామిలీ డాక్ట‌ర్ , ఆరోగ్య‌శ్రీ… ఇలా ఏ విధంగా వైద్యం పొందుతున్నా స‌రే ఆయా రోగులంద‌రి వివ‌రాలు ఒకే చోట అందుబాటులో ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ఆ మేర‌కు సాంకేతిక వ్య‌వ‌స్థ‌ను రూపొందించాల‌న్నారు. గ‌డిచిన ఐదేళ్లుగా ఆరోగ్య‌శ్రీ ద్వారా చికిత్స పొందిన వారి వివ‌రాల‌ను సేక‌రించి భ‌ద్ర‌ప‌ర‌చాల‌ని సూచించారు.

మ‌రింత మెరుగ్గా జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష – 2
జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష రెండో ద‌శ కార్య‌క్ర‌మాన్నినిర్వ‌హించేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశార‌ని, ఆ మేర‌కు అధికారులు ప్ర‌ణాళిక రూపొందించాల‌ని మంత్రి ర‌జిని పేర్కొన్నారు. రెండో ద‌శ జ‌గ‌న‌న్న ఆరోగ్య సుర‌క్ష శిబిరాల్లో మ‌రిన్ని స్పెషాలిటీ సేవ‌లు అందేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. వైద్య ప‌రీక్ష‌లు కూడా కొత్త‌వి చేర్చాల‌ని, అందుకు కావాల్సిన విధి విధానాలు రూపొందించాల‌ని చెప్పారు. ప్ర‌జ‌లంద‌రికీ మెరుగైన వైద్యం సులువుగా, పూర్తి ఉచితంగా అంద‌డ‌మే ల‌క్ష్యంగా జ‌గ‌నన్న ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు.

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆలోచ‌న‌లు అమ‌లు చేయ‌డ‌మే ల‌క్ష్యంగా మ‌న‌మంతా ప‌నిచేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌త్యేక ప్రధాన కార్య‌ద‌ర్శి ఎం.టి. కృష్ణ‌బాబు, వైద్య ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి, డాక్ట‌ర్ మంజుల‌, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్‌, సెకండరీ హెల్త్ డైరెక్టర్ మరియు ఆరోగ్య శ్రీ సిఇఓ డాక్టర్ వెంక‌టేశ్వ‌ర్ , డీఎంఈ డాక్టర్ న‌ర్సింహం త‌దిత‌రులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A RESPONSE