* దోచుకోడానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం
* వైసీపీ నాయకుల కంపెనీలకు పనుల అప్పగింత
* అనుమతులు లేకపోవడంతో అడ్డుకున్న ఎన్జీటీ
* రూ.2,745 కోట్ల ప్రజాధనం వృథా
* లిఫ్ట్ ఇరిగేషన్ పై మాట్లాడకుండా 18 నెలలుగా ఏం చేస్తున్నావ్…?
* జగన్ ఎన్ని బెదిరింపులకు దిగినా అమరావతిని నిర్మించి తీరుతాం
– బీసీ సంక్షేమ శాఖ మంత్రి మంత్రి సవిత
పెనుకొండ/శ్రీసత్యసాయి : జగన్ ఎన్ని బెదిరింపులకు దిగినా ప్రజా రాజధాని అమరావతిని నిర్మించి తీరుతామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్పష్టంచేశారు. అన్ని వ్యవస్థలను నాశనం చేసి, వేల కోట్లు దోచుకున్న జగన్ అతి పెద్ద చోర్ అని ఆరోపించారు.
దెయ్యాలు వేదాలు వల్లించినట్లు చేసిన రాయలసీమకు తీవ్ర ద్రోహం చేసి కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. అమరావతే రాజధాని అని, తన సొంతింటిని తాడేపల్లిలో కట్టుకున్నానని ప్రజలను నమ్మించాడన్నారు. అధికారంలోకి రాగానే, రాజధాని పేరుతో మూడు ముక్కలాట ఆడారన్నారు.
అయిదేళ్లు పాటు రాజధాని లేకుండానే పాలించిన ఘనుడు జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఏక కాలంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను సీఎం చంద్రబాబు అమలు చేస్తుండడంతో, జగన్ ఓర్వలేకపోతున్నాడని మంత్రి సవిత విమర్శించారు.
18 నెలలుగా ఏం చేస్తున్నావ్..?
ప్రజాధనాన్ని దోచుకోవడానికి రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరుతో జగన్ పెద్ద కుట్రకు తెర తీశారని మంత్రి సవిత మండిపడ్డారు. ఎటువంటి అనుమతులూ లేకుండా వైసీపీ నాయకుల సొంత కంపెనీలకు రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు అప్పగించారన్నారు. ఎటువంటి అనుమతులు లేకుండా లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు చేపట్టడడంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ కోర్టు(ఎన్జీటీ) అడ్డుకుందన్నారు.
కేవలం డీపీఆర్ కోసమే రూ.900 కోట్లకు పైనా ఖర్చు చేశారని, ఎత్తిపోతల పథకం పేరుతో రూ.2,745 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేశారన్నారు. అక్రమార్జన కోసం రాయలసీమకు, రాష్ట్ర ప్రజలకు జగన్మోహన్ రెడ్డి తీవ్ర ద్రోహం చేశారన్నారు. రాయలసీమపై జగన్ కు నిజంగా ప్రేమే ఉంటే, 18 నెలల నుంచి ఏం చేస్తున్నారని, రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇన్నాళ్లూ ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు.
తమ రాజకీయ ఉనికి కోసం తెలంగాణా రాజకీయ పార్టీలు సీఎం చంద్రబాబు పేరును వాడుకుంటాయని, జగన్ కూడా తప్పుడు ఆరోపణలతో విషం చిమ్ముతున్నాడని మంత్రి సవిత మండిపడ్డారు.రాయలసీమకు తాగు నీరు, సాగు నీరు అందించిన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు.
అన్ని చెరువులను నీటితో నింపామన్నారు. రాయలసీమలో అన్ని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.6,613 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ ద్వారా కుప్పానికి, మడకశిరకు నీరందించామని మంత్రి సవిత గుర్తు చేశారు.
అమరావతిని నిర్మించి తీరుతాం…
జగన్ ఎన్ని బెదిరింపులకు పాల్పడినా, ప్రజా రాజధాని అమరావతిని నిర్మించి తీరుతామని మంత్రి సవిత స్పష్టంచేశారు. ఏపీకి రాజధాని అమరావతేనని, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాని రాష్ట్ర ప్రజలను జగన్ మభ్యపెట్టారన్నారు. అధికారంలోకి రాగానే మూడు ముక్కలాట ఆడుతూ, ఏపీకి రాజధాని లేకుండా చేశారన్నారు. వైజాగ్ ఎయిర్ పోర్టులో ఈగలు తోలుకుంటున్నారని, ఎర్ర బస్సు కూడా రాని భోగాపురంలో ఎయిర్ పోర్టు ఎందుకని ఆనాడు జగన్ ప్రశ్నించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగనే భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణ పనులు శరవేగంగా పూర్తి చేస్తోందన్నారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్ పోర్టు ఘనత తనదేనని జగన్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. అన్ని అనుమతులున్నా అయిదేళ్లలో భోగాపురంలో ఎయిర్ పోర్టు నిర్మించలేకపోవడం, 73 శాతానికి పైగా పనులు పూర్తయిన పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయలేకపోవడం జగన్ అసమర్థత అని మంత్రి సవిత విమర్శించారు.