– జగన్ రెడ్డి మానసిక పరిస్థితి బాగోలేదు
* ఏపీని తానే అభివృద్ధి చేసినట్లు భ్రమలో బతికేస్తున్నారు
* రైతుల సంక్షేమ ప్రభుత్వం మాది
* అపద్కాలంలో రైతన్నలను ఆదుకున్నాం
* పట్టాదారుల పాస్ బుక్ లపై రాజముద్రతో రైతులకు సర్వ హక్కులు
* కడప జిల్లా వీరప్పనాయునిపల్లెలో ఉల్లి రైతులకు నష్టపరిహారం పంపిణీ చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత
కడప : గత ప్రభుత్వంలోని అక్రమాలకు ఒక్కొక్కటిగా వెలికి తీస్తున్నామని, అక్రమార్కులెవరినీ వదలే ప్రసక్తే లేదని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టంచేశారు. లండన్ మందులు వాడినా జగన్ మానసిక పరిస్థితి బాగాలేదని, రాష్ట్రాన్ని తానే అభివృద్ధి చేసినట్లు భ్రమపడుతున్నారని ఎద్దేవా చేశారు.
రైతుల సంక్షేమ కూటమి ప్రభుత్వ ప్రథమ కర్త్యమని, పంట నష్టపరిహారాన్ని సకాలంలో అందించి అండగా నిలిచిందని తెలిపారు. కమలాపురం నియోజక వర్గం వీరప్పనాయునిపల్లెలో స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి, జిల్లా కలెక్టర్ సీహెచ్.శ్రీధర్ తో కలిసి మంగళవారం ఉల్లి రైతులకు నష్టపరిహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, రైతు సంక్షేమమే సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు.
ప్రకృతి వైపరీత్యాలు, ఇతర కారణాలతో రైతుల ఇబ్బందుల పాలైనప్పుడు కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. కర్నూలు, కడప జిల్లాలకు చెందిన 37,752 మంది ఉల్లి రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున రూ.128.33 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. కడప జిల్లా ఉల్లి రైతులకు రూ.28.40 కోట్లకు పైగా కోట్ల పరిహారం అందజేశామన్నారు.
కమలాపురం నియోజకవర్గ రైతులకు రూ.11.32 కోట్లు, మైదుకూరు రైతులకు రూ.7.73 కోట్లు, పులివెందుల రైతులకు రూ.6.16 కోట్లు, జమ్మలమడుగు రైతులకు రూ.2.99 కోట్లు అందజేశామన్నారు. చిన్న రైతు,పెద్ద రైతు అన్న తేడా లేకుండా అందరికీ న్యాయం చేశామన్నారు. కోకో పొగాకు, మామిడి, మిర్చి రైతులకు ధరల వల్ల నష్టపోకుండా మద్ధతు ధర అందజేశామన్నారు. అన్నదాత సుఖీభవ కింద రెండు విడతులుగా 46 లక్షలకు పైగా రైతులకు 6,310 కోట్లు అందజేశామన్నారు.
కూటమి వ్యవసాయం యాంత్రీకరణకు అధిక ప్రాధాన్యమిస్తోందని, డ్రిప్ ఇరిగేషన్ కు ప్రోత్సాహమిస్తోందని వెల్లడించారు. సర్వారాయ సాగర్ ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి సీఎం చంద్రబాబు సుముఖతతో ఉన్నారని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని మంత్రి సవిత వెల్లడించారు.
జగన్ మానసిక పరిస్థితి బాగోలేదు…
గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను ఒక్కొక్కటిగా వెలికి తీసుకున్నామని, అక్రమార్కులెవరినీ వదలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి సవిత స్పష్టంచేశారు. జగన్ రెడ్డి మానసిక పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతోందని, ఆయనకు లండన్ మందులు పని చేయనట్లుందని, ఏపీని తానే అభివృద్ధి చేసినట్లు భ్రమలో బతికేస్తున్నారని ఎద్దేవా చేశారు.
భోగాపురం ఎయిర్ పోర్టు తానే నిర్మించానని, విశాఖకు డెటా సెంటర్ ను కూడా తెచ్చింది ఆయనేనని జగన్ చెప్పుకోవడం ఆయన దిగజారిన మానసిక పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం క్రెడిట్ అంతా సీఎం చంద్రబాబుదేనన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోవడానికి కారణం జగనేనని మంత్రి సవిత స్పష్టంచేశారు. ఆయన అసమర్థత వల్ల ఆ ప్రాజెక్టు నిలిచిపోయిందన్నారు.
రాజముద్రతో రైతులకు సంపూర్ణ హక్కులు
రైతుల పట్టాదారు పాస్ బుక్ లపైనా, సర్వేరాళ్లపైనా జగన్ తన బొమ్మను ముద్రించుకుని రైతులను, భూ యజమానులు భయబ్రాంతులకు గురిచేశారని మంత్రి సవిత మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం రాగానే జగన్ తీసుకొచ్చిన చీకటి చట్టం ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశామన్నారు. పట్టాదారు పాస్ బుక్ లపై జగన్ బొమ్మను తొలగించి, రాజముద్ర వేసి రైతుల భూ హక్కులకు రక్షణ కల్పించామన్నారు.
రైతులకు తమ భూములపై సంపూర్ణ హక్కులు కల్పించామన్నారు. అయిదేళ్లలో జగన్ అయిదు పర్యాయాలు విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై ఆర్థిక భారం మోపారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రతి యూనిట్ పై 13 పైసల చొప్పున్న ట్రూ అప్ ఛార్జీలు తగ్గించిందన్నారు.
స్మార్ట్ వ్యవసాయంతో అధిక లాభాలు : జిల్లా కలెక్టర్ శ్రీధర్
మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా రైతులు పంటలు వేసి లాభాలు ఆర్జించాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సూచించారు. ఉల్లి రైతులు నష్టపోవడానికి ప్రధాన కారణం ధర లేకపోవడం, స్థానిక మార్కెట్ కు అవసరం లేని రెడ్ ఉల్లిని ఉత్పత్తి చేయడంతో పాటు ప్రకృతి వైపరీత్యాలు కూడా మరో కారణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం హార్టీ కల్చర్ ను ప్రోత్సాహిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఏయే పంటల వేయాలో హార్టీకల్చర్, అగ్రికల్చర్ అధికారులను అడిగి రైతులు సాగుచేయాలన్నారు. స్మార్ట్ వ్యవసాయంతోనే అధిక లాభాలు సాధ్యమవుతాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి మాట్లాడుతూ, ఉల్లి రైతుల సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లగానే, నష్టపరిహారం పంపిణీకి అంగీకరించారన్నారు.
గత వైసీపీ ప్రభుత్వం 60 నెలల్లో చేయని అభివృద్ధిని 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. సర్వారాయ సాగర్ ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి సీఎం చంద్రబాబు అంగీకరించారన్నారు. త్వరలోనే పనులు ప్రారంభించే అవకాశం ఉందని ఎమ్మెల్యే కృష్ణచైతన్య రెడ్డి తెలిపారు. అనంతరం ఉల్లి రైతులకు రూ.28.40 కోట్ల మెగా చెక్ ను కలెక్టర్ శ్రీధర్ తో కలిసి మంత్రి సవిత అందజేశారు.
అంతకుముందు ఉల్లి రైతులకు నష్టపరిహారం పంపిణీకి విచ్చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రి సవితకు, జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కు, స్థానిక ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డికి, టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డికి వీరప్పనాయునిపల్లె వాసులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు,మాజీ ఎమ్మెల్సీ పుత్తా నర్సింహారెడ్డి, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.