Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌ ప్రతిపక్ష నాయకుడు కాదు.. ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమే

– మంత్రి పయ్యావుల కేశవ్‌

అమరావతి: జగన్‌ ప్రతిపక్ష నేత కాదని వైఎస్సార్సీపీ ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమేనని మంత్రి పయ్యావుల కేశవ్‌ స్పష్టం చేశారు. మొత్తం సభ్యుల్లో పదో వంతు ఉంటనే ప్రతిపక్ష నేత హోదా వస్తుందన్నారు. ఆ విషయం తెలుసుకోకుండా లేఖలు రాయడం సిగ్గు చేటన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఒకలా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

వైఎస్సార్సీపీ అధినేత జగన్‌ ప్రతిపక్ష నేత కాదని ప్రతిపక్షంలో ఉన్న పార్టీకి ఫ్లోర్‌ లీడర్‌ మాత్రమేనని ఆర్థిక, శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్‌ అన్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం జగన్‌కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఆ హోదా రావడానికి ఆయనకు ఓ పదేళ్లు పడుతుందని వ్యాఖ్యానించారు.

జగన్‌కు ఆప్తుడైన కేసీఆర్‌ కూడా గతంలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తుచేశారు. స్పీకర్కు లేఖ రాసి జగన్ బెదిరించే ప్రయత్నం చేశారని పయ్యావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ కేవలం మద్యం, ఇసుక ఖాతాల పుస్తకాలే కాకుండా శాసనసభ, పార్లమెంటరీ నిబంధనలు ఉండే కౌల్‌ అండ్‌ షఖ్దర్‌ పుస్తకం, అసెంబ్లీ రూల్‌ బుక్‌ చదవాలని సూచించారు. ప్రతిపక్ష హోదా కోసం రాసిన లేఖ సలహాదారు సూచనల మేరకే రాశారా అని ఆయన ఎద్దేవా చేశారు.

LEAVE A RESPONSE