Suryaa.co.in

Andhra Pradesh

అంబేద్కర్‌ ను అవమానించిన వ్యక్తి జగన్..

  • రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన ఘనుడు మాజీ సీఎం..
  • దళితుల హక్కులను కాలరాసి, ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేసిన దళిత వ్యతిరేకి జగన్ రెడ్డి…
  • చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు 

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నడిబొడ్డున స్మృతి వనంలో ఏర్పాటుచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం శిలా ఫలకంలో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ పేరు కంటే తన నామాన్ని పెద్ద అక్షరాలతో రాయించుకుని ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాతనే తీవ్రంగా అవమానించిన ఏకైక వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చిత్తూరు పార్లమెంటు సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాద్ రావు వ్యాఖ్యానించారు.

ఢిల్లీ పార్లమెంటు సమావేశాలకు హాజరైన  దగ్గుమళ్ళ ప్రసాదరావు .., రాష్ట్రంలో వైసిపి అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలను ఆదివారం ఢిల్లీలో తప్పుపట్టారు. అదే సమయంలో జగన్ రెడ్డిని సమర్థిస్తున్న వైకాపా నాయకుల వ్యాఖ్యలను ఖండించారు. గత వైసిపి పాలనలో ఎస్సీ, ఎస్టీల హక్కులను కాలరాసి, దళితులకు తీవ్ర అన్యాయం చేసిన దళిత వ్యతిరేకి జగన్ రెడ్డి అన్నారు. భారత రాజ్యాంగాన్ని పక్కనపెట్టి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలుపరిచిన ఫ్యూడలిస్ట్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని విమర్శించారు. తన స్వార్ధ రాజకీయాల కోసం రాజ్యాంగ స్ఫూర్తినే దెబ్బతీసిన ఘనుడు జగన్ రెడ్డి అని అన్నారు.

ఏపీలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు రాజకీయ లబ్ధి కోసం చేసిందేనని అన్నారు. కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరుతో జగన్ కుట్రలు చేసి చిచ్చు పెట్టారని మండిపడ్డారు. అంబేద్కర్ విదేశీ విద్యా పేరును తొలగించి జగనన్న విదేశీ విద్య పేరు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. అంబేద్కర్ కంటే జగన్ గొప్పవాడా..? అని నిలదీశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులపై జరిగిన దాడుల్లో ఏపీ మొదటి స్థానంలో ఉందన్నారు. దళితులపైనే SC, ST కేసులు పెట్టిన ఘనత జగన్ మోహన్ రెడ్డిదేనని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలోని పౌరులందరికీ స్వేచ్ఛనిచ్చి, అన్ని వర్గాలను ప్రోత్సహించాల్సిన జగన్ మోహన్ రెడ్డి.., విష సంస్కృతికి బీజం వేసి, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులను బలి తీసుకొని, రాష్ట్రంలో ధమన కాండ కొనసాగించారని దగ్గుమళ్ళ ప్రసాద్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

అంబేద్కర్ పేరు ఎత్తి, విగ్రహాన్ని తాకే అర్హత జగన్‌కి.. ఆయన్ను సమర్ధిస్తున్న వైసీపీ నేతలకు ఉందా..? అని నిలదీసారు. అంబేద్కర్ విదేశీ విద్యతో పాటు 27 సంక్షేమ పథకాలను రద్దుచేసి, దళితుల సంక్షేమాన్ని అడ్డుకున్న దళిత ద్రోహి జగన్ రెడ్డి అన్నారు. ఏపీ సీఎం  చంద్రబాబు నాయుడు ఉన్నత లక్ష్యంతో నాడు తీసుకొచ్చిన అంబేద్కర్‌ విదేశీ విద్య పథకం పేరును జగన్‌ విదేశీ విద్యానిధిగా ఎందుకు మార్చాడని నిలదీశారు . ఇంత కంటే సిగ్గుమాలిన చర్య ఉంటుందా అన్నారు. సబ్ ప్లాన్ నిధులు 40 వేల కోట్లు దారి మళ్లించి, ఎస్సీ, ఎస్టీ ల సంక్షేమాన్ని దెబ్బతీసిన వ్యక్తి జగన్ అని చెప్పారు.

హైదరాబాద్‌లో రూ.150 కోట్లతో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటైతే, అలాంటి విగ్రహానికే ఏపీలో రూ.400 కోట్లు ఖర్చు చూపటం దోపిడీ కాక మరేంటన్నారు.అంబేద్కర్ విగ్రహం వద్ద ఉండాల్సిన రాజ్యాంగ నిర్మాత పేరు స్థానంలో జగన్మోహన్ రెడ్డి పేరును ఏర్పాటు చేయించుకొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను తీవ్రంగా అవమానించడం కాదా అన్నారు. ప్రోటోకాల్ కు విరుద్ధంగా ఏర్పాటు చేసిన పేరును తొలగిస్తే.. అంబేద్కర్ పేరును తొలగించారంటూ.. వైసీపీ నాయకులు చేస్తున్న విషప్రచారంలో వాస్తవం లేదన్నారు.

ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే ధ్యేయంగా పని చేస్తున్న కూటమి ప్రభుత్వానికి వైకాపా నాయకులు సహకరించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునందిస్తే ప్రజలు హర్షిస్తారు గాని.., ప్రజాస్వామ్య విలువల్ని కాలరాసి, ఏపీ ప్రగతిని అడ్డుకుంటే.. ప్రజలు క్షమించరని చిత్తూరు ఎంపి ప్రసాద్ రావు హితవు పలికారు.

LEAVE A RESPONSE