– ఏపీఎస్ఏఎం వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపాటు
మంగళగిరి: మామిడి రైతులకు ప్రభుత్వం కల్పించిన మద్దతు ధర గురించి అవగాహన లేని జగన్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తూ రైతులను మభ్య ప్రయత్నాలు చేస్తున్నారుని ఏపీఎస్ఏఎం వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కేంద్రకార్యాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో ప్రధానంగా సాగు చేయబడే తోతాపురి మామిడి రకంపై చర్చ జరిగిందని.. ఈ రకం మామిడి సుమారు 80,000 హెక్టార్లలో (2 లక్షల ఎకరాలు) పండిస్తున్నారన్నారు. ఈ పంట దిగుబడి వాతావరణం, ప్రకృతి పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.
ఒక సంవత్సరం ఎక్కువ దిగుబడి వస్తే, మరో సంవత్సరం తక్కువ వస్తుంది. గత సంవత్సరం 2.5 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది, కానీ ఈ సంవత్సరం ఉద్యానవన శాఖ గణాంకాల ప్రకారం 6.7 లక్షల టన్నుల దిగుబడి అంచనాగా ఉందన్నారు.
తోతాపురి మామిడి కిలో రూ. 12 ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు, ఇందులో రూ. 8 ఫ్యాక్టరీలు చెల్లిస్తాయి, మిగిలిన రూ. 4 రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఈ ధర విధానం రైతులకు లాభదాయకంగా ఉంటుందని, వారి కుటుంబ ఆర్థిక అవసరాలను తీరుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జూన్ 9 తేదిన నుండే చర్యలు మొదలు పెట్టారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ నెలలోనే పల్ప్ ఫ్యాక్టరీ యజమానులతో చర్చలు జరిపారు. కరోనా సమయంలో 40,000 టన్నుల పల్ప్ నిల్వ ఉన్నట్టు తెలిసింది. ఈ నిల్వలను సమర్థవంతంగా నిర్వహించేందుకు మరియు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మామిడి ఎగుమతులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదనంగా, 20 పల్ప్ ఫ్యాక్టరీలకు ఆర్థిక సహాయం అందించేందుకు బ్యాంకర్లతో సంప్రదింపులు జరిపి, రుణాలు మరియు నిధులు సమకూర్చారు.
ఇప్పటివరకు చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 3,08,261 టన్నుల తోతాపురి మామిడిని ట్రేడర్లు, ప్రాసెసింగ్ యూనిట్లు కొనుగోలు చేశాయి. ఈ సీజన్లో మొత్తం 3,75,000 టన్నుల ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు, చివరి పండు వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చాం. అలాగే, 81,000 టన్నుల మామిడి ఇతర రాష్ట్రాలకు ర్యాంపులు, మండీల ద్వారా విక్రయించారు. మామిడి రైతులకు మద్దతు ఇవ్వడానికి రూ. 130 కోట్లు విడుదల చేయాలని ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
వైసీపీ నాయకుడు జగన్ రెడ్డి రైతులను తప్పుదోవ పట్టించేందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కర్ణాటకలో మామిడి కిలో రూ. 16కు కొనుగోలు చేస్తున్నారని తప్పుడు సమాచారం ప్రచారం చేశారు. వాస్తవంగా, కర్ణాటకలో మండీలలో కిలో రూ. 2, ఫ్యాక్టరీలలో రూ. 4కు కొనుగోలు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో మాత్రం కిలో రూ. 12 ధరతో రైతులకు మద్దతు ఇస్తున్నాం. వైసీపీ గత ఐదేళ్ల పాలనలో రైతుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసి, విధ్వంసకర రాజకీయాలకు పాల్పడిందని, ఇప్పుడు కూడా రైతులలో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తోందన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు సమాచారం అందించేందుకు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. చిత్తూరులో 27, తిరుపతిలో 6, అన్నమయ్యలో 1 పల్ప్ ఫ్యాక్టరీలను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి అవసరమైన సమాచారం, సౌకర్యాలు అందిస్తోంది. రైతులు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా, వారి మొత్తం పంట కొనుగోలు చేయబడేలా చర్యలు తీసుకుంటోంది.
మామిడి రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తూ, వారి కష్టాన్ని గౌరవిస్తూ సత్ఫలితాలు ఇచ్చే చర్యలు చేపడుతోంది. రైతులు సురక్షితంగా, భరోసాతో ఉండేలా కృషి చేస్తోంది. తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని, వాస్తవాలను తెలుసుకోవాలని ప్రజలను కోరుతున్నామని ఆయన స్పష్టం చేశారు.