Suryaa.co.in

Andhra Pradesh

జగన్మోహన్ రెడ్డి నాకు రాజకీయ విరోధి కాదు… ప్రత్యర్థి మాత్రమే

  • జగన్మోహన్ రెడ్డి తో పోరాటం… పోరాటమే
  • రాజ్యాంగ విలువలకు కట్టుబడే అతడితో మాట్లాడా
  • రాష్ట్రంలో కూటమి గెలుపులో, జగన్మోహన్ రెడ్డి ఓటమిలో రచ్చబండ కార్యక్రమం కీలక పాత్ర పోషించింది
  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డిల వ్యవహార శైలి మధ్య అసలు పొంతనే లేదు
  • జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలంతా సెల్ఫ్ సెంట్రిక్ అయితే… చంద్రబాబు నాయుడు వ్యవహార శైలి పబ్లిక్ సెంట్రిక్ గా ఉంటుంది
  • రాష్ట్రంలోని అస్తవ్యస్త పరిస్థితులను చక్కదిద్దే సామర్థ్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉంది
  • ప్రతిపక్షాలు ఎన్ని మాటలు మాట్లాడిన ప్రజలు పట్టించుకునే పరిస్థితుల్లో లేరు
  • శరవేగంగా అమరావతి అభివృద్ధి చెందుతుంది అనడంలో అతిశయోక్తి లేదు
  • ఉండి నియోజకవర్గ ప్రజలకు నేనిచ్చిన హామీలతోపాటు, ఎన్నికల్లో హామీ ఇవ్వని పనులను కూడా చేస్తున్నాను
  • పదవి అని బాధ్యతను నాకు అప్పగిస్తే అప్పగించిన వారి, ప్రజల అంచనాల మేరకు పనిచేస్తాను
  • ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు

వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నాకు రాజకీయ విరోధి కాదు… ప్రత్యర్థి మాత్రమేనని ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడే ఆయనతో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడానని తేల్చి చెప్పారు.

ప్రతిపక్షం అన్నది లేకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండదన్న ఆయన, ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే ప్రతిపక్షం మాట్లాడాలి. అంతేకానీ సమస్యలన్నవి లేకుండా మాట్లాడితే ప్రయోజనం ఉండదు. నిజంగా ప్రజా సమస్యలుంటే వాటిపై ప్రతిపక్షం మాట్లాడితే, అధికార పక్షానికి ఎంతో కొంత భయం ఉంటుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

ఢిల్లీలో ఆయన ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి తో తన వ్యక్తిగత పోరాటం కొనసాగుతుందన్నారు. నేను దాఖలు చేసిన కేసులను త్వరితగతిన విచారించాలని న్యాయస్థానానికి విన్నవించాను. జగన్మోహన్ రెడ్డి పై నేను దాఖలు చేసిన కేసుల విచారణ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో, అవసరమైతే వేరే కోర్టుకు మార్చాలని కోరారు. నేను దాఖలు చేసిన పిటిషన్ ను రేపు కోర్టు ముందు విచారణకు రానుందని తెలిపారు.

ఒక శాసన సభ్యుడిగా, నా సహచర శాసన సభ్యుడైన జగన్మోహన్ రెడ్డి తో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా అసెంబ్లీకి హాజరుకావాలని సూచించాను. అసెంబ్లీకి హాజరవుతానని జగన్మోహన్ రెడ్డి కూడా తెలిపారని రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు.

బంగ్లాదేశ్ లో ఇటీవల జరిగిన ఎన్నికలలో షేక్ హసీనా పార్టీకి 225 స్థానాలలో ప్రజలు విజయాన్ని కట్టబెట్టారని, ప్రతిపక్ష జియా పార్టీని కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారన్నారు. ప్రతిపక్షం లేకపోవడం వల్ల నేను ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చునని షేక్ హసీనా భావించి ఉంటారన్న రఘురామ కృష్ణంరాజు, ప్రస్తుత బంగ్లాదేశ్ పరిస్థితికి అదొక కారణమై ఉండవచ్చునని పేర్కొన్నారు.

ఎన్నికలకు ముందే రచ్చబండ కార్యక్రమంలో గత సంవత్సరం క్రితం కూటమికి 145 స్థానాలు వస్తాయని సర్వే పేపర్లను చేతిలో పెట్టుకొని చెప్పానని గుర్తు చేశారు. ఎప్పటికప్పుడు సర్వేలు చేయించడం వల్ల ప్రజానాడి తెలుస్తుందన్న ఆయన, నిజం చెప్పినప్పుడు దాన్ని స్వీకరించాలని అంతమాత్రాన దూరం పెట్టవద్దని పరోక్షంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై సెటైర్ వేశారు. నిజాలను వింటే ఇటువంటి ఉపద్రవాలు రావన్నారు.

నా ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర చేస్తున్నారని నాతో పాటు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 పై కేసులు నమోదు చేసిన జగన్మోహన్ రెడ్డి సర్కార్

రాష్ట్రంలో కూటమి గెలుపుకు , జగన్మోహన్ రెడ్డి ఓటమిలో రచ్చబండ కార్యక్రమం ప్రముఖమైన పాత్ర పోషించిందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. తన ఈ వాదనకు డాకుమెంటరీ ఎవిడెన్స్ ఉందన్న ఆయన, రచ్చబండ కార్యక్రమంలోని కంటెంట్ ను జగన్మోహన్ రెడ్డి కట్ చేసి, తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర చేస్తున్నారని కేసులు పెట్టారని గుర్తు చేశారు. ఏ 1 ముద్దాయిగా నా పేరు, ఏ 2 ముద్దాయిగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, ఏ 3 ముద్దాయిగా టీవీ5 పేర్లను చేర్చారన్నారు.

తన ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లు కూలదోసే ప్రయత్నం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అనలేదని గుర్తు చేశారు. కేవలం మన ముగ్గురిని మాత్రమే తన ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్ర చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి అన్నారని మీడియా సమావేశంలో పాల్గొన్న ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 ప్రతినిధులను ఉద్దేశించి పేర్కొన్నారు. రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు మనం ఉన్నది ఉన్నట్టే నిజం చెప్పాము.

మనం చెప్పిన నిజాలకు నిర్గాంతపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫ్రీజ్ అయిందన్నారు. ప్రజలకు అన్ని అర్థమయ్యే విధంగా గత ప్రభుత్వ తప్పుల్ని వివరించాం. ప్రజలకు నిజాలను తెలియజెప్పడంలో ఏబీఎన్, టీవీ5, ఈటీవీ కీలక పాత్ర పోషించాయి. మీకు ధన్యవాదాలు తెలియజేయడానికే నాలుగు నెలల అనంతరం, ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

రాష్ట్రంలో ప్రభుత్వం మారింది. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ముందుగా అనుకున్నట్లే నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని నూతన ప్రభుత్వం, ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ, ముందుకు వెళ్తోంది. ఈనెల 15వ తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరిన్ని కొత్త స్కీములను అమలు చేయనున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 55 రోజులు కూడా కాకముందే, ప్రతిపక్ష నాయకులు ఇప్పటికే అది చేయలేరు… ఇది చేయలేదని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత అప్పు చేశారన్నది తెలియడానికి వివరాలు అందుబాటులో లేవు. అప్పు ఎంత అన్నది తెలియకుండా, అప్పు పై వడ్డీ ఎంత కట్టాలన్న దానిపై స్పష్టత లేకుండా, రాష్ట్ర ప్రభుత్వంపై ఓవరాల్ గా బర్డెన్ ఎంత అనేది తెలియకుండానే బడ్జెట్ రూపొందించడం కష్టమని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

బడ్జెట్లో భాగంగా ఏ పథకానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ పథకాన్ని సెకండ్ ఫేజ్ లో అమలు చేయాలన్న దానికి ప్రణాళిక అనేది అవసరం. ప్రణాళిక అన్నది చేయడానికి , ఆలోచించడానికి వీలు లేకుండా మెదడు బ్లాంక్ అయ్యే పరిస్థితిని గత ప్రభుత్వం క్రియేట్ చేసిందన్నారు. ఈ పరిస్థితులను చక్కదిద్దుకునే సామర్థ్యం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఉంది. ప్రతిపక్షం ఎన్ని మాటలు మాట్లాడినా ప్రజలైతే ప్రశాంతంగా ఉన్నారు. ప్రజలేమి ప్రతిపక్ష నాయకుల మాటలను పట్టించుకునే పరిస్థితిలో లేరని రఘురామ కృష్ణంరాజు తెలిపారు.

శరవేగంగా అమరావతి అభివృద్ధి

అమరావతి అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని నేను కచ్చితంగా చెప్పగలనని రఘురామకృష్ణం రాజు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా, నిర్మాణాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు. దోపిడీకి కాదేది అనర్హం అన్నట్లుగా రోడ్లను తవ్వుకు పోయారు.

ఈ దోపిడీలో స్థానిక ఎంపీ కి కూడా పాత్ర ఉన్నట్లుగా వార్తలు వెలుపడ్డాయి. రోడ్లను కూడా గత పాలకులు దోపిడీ చేశారు. నిర్మాణాలు పూర్తయిన భవనాలకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఇటీవల నిర్మాణ దశలో ఉన్న భవనాలను పరిశీలించడానికి ఒక సాంకేతిక బృందం పడవల్లో వెళ్లి చూడాల్సిన దుస్థితిని గత ప్రభుత్వం కల్పించింది.

అమరావతి నిర్మాణానికి యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్ల రూపాయల గ్రాంట్ ఇచ్చిందనుకున్నాం. అయితే ఎఫ్ ఆర్ బి ఎం పరిధిలోకి రాకుండా, రుణాన్ని కేంద్ర ప్రభుత్వమే ఆరెంజ్ చేస్తోంది. 15వేల కోట్ల రూపాయలతో అమరావతి నిర్మాణ పనులన్నీ కిక్ స్టార్ట్ అవుతాయి. అమరావతి లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యాలయం, ఫైనాన్స్ మినిస్ట్రీ ఆఫీసు ఏర్పాటు చేయాలని కోరగా, అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అడ్డుపడింది.

ఇప్పుడు అమరావతిలో ఆ కార్యాలయాల ఏర్పాటు కు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చొరవ తీసుకుంటున్నాయి. 121 సంస్థలకు ప్రభుత్వం స్థలాలను మంజూరు చేయడం జరిగింది. త్వరలోనే స్థలాలు మంజూరు చేసిన సంస్థలన్నీ ప్రణాళికలను సిద్ధం చేసుకుని, నిర్మాణాలను ప్రారంభిస్తాయి. అమరావతిలో రోడ్ల నిర్మాణం జరిగితే అభివృద్ధి దానంతట అదే జరుగుతుందని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

రాష్ట్ర రాజధానిగా అమరావతి ఖరారు

రాష్ట్ర రాజధానిగా అమరావతిని ఖరారు చేయడంతో, నిర్మాణరంగ కార్యకలాపాలు ఊపందుకున్నాయని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. గతంలో రైతుల వద్ద నుంచి గజానికి 15 వేల రూపాయలు వెచ్చించి స్థలం కొనుగోలు చేయడానికి సుముఖత చూపని స్థిరాస్తి వ్యాపారులు, ఇప్పుడు 40 వేల రూపాయలను గజానికి చెల్లించడానికి సిద్ధమయ్యారు.

భూములకు ధరలు అమాంతం ఎలా పెరిగాయంటే… కూటమి ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పైన ఉన్న విశ్వాసమే కారణమని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. రాష్ట్రానికి ఒకటే రాజధాని అమరావతిని స్పష్టంగా తేల్చి చెప్పడంతో, రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమ్మకం ఏర్పడిందన్నారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో స్థిరాస్తి వ్యాపారం స్తబ్దుగా ఉందని, రాష్ట్రంలో మాత్రం భూముల ధరలు పెరుగుతున్నాయన్నారు.

ఆంధ్రాలో భూముల ధరలకు మూవ్మెంట్ వచ్చిందన్న రఘురామకృష్ణంరాజు, తెలంగాణలో భూముల ధరలు 10 నుంచి 15% వరకు పడిపోయాయని తెలిపారు. దీనంతటికీ ఒకే ఒక కారణం జగన్మోహన్ రెడ్డి పోవడం… ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావడమేనని పేర్కొన్నారు. అమరావతి అభివృద్ధి శరవేగంగా ముందుకు దూసుకు వెళ్లడం ఖాయమని రఘురామ కృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు.

జగన్మోహన్ రెడ్డి ది డిస్ట్రక్టివ్ విజన్ అయితే… చంద్రబాబు నాయుడు ది కన్స్ట్రక్టివ్ విజన్

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ది డిస్ట్రక్టివ్ విజన్ అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ది కన్స్ట్రక్టివ్ విజన్ అని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మాట్లాడే విధానంలో ఉన్న తేడా గురించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ… జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు మాట్లాడే విధానానికి అసలు పొంతనే లేదని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ సెంట్రిక్ గా మాట్లాడితే, చంద్రబాబు నాయుడు పబ్లిక్ సెంట్రిక్ గా మాట్లాడుతారు. అక్కడ గోల వేరు, ఇక్కడ గోల వేరు. అసలు సంబంధమే లేదు. చంద్రబాబు నాయుడుది అంతా పాజిటివ్ గోల.

రాబోయే 10 ఏళ్లలో ఎలా అభివృద్ధి చేయాలి… రాబోయే 20 ఏళ్లలో ఎలా అభివృద్ధి చేయాలని తపనే తప్ప మరొకటి కనిపించదు. చంద్రబాబు నాయుడు ది కన్స్ట్రక్టివ్ విజన్ అయితే, జగన్మోహన్ రెడ్డి ది డిస్ట్రక్టివ్ విజన్ అని అన్నారు. ఐఏఎస్ అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల గురించి ఒక మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ఆయన స్పందిస్తూ, తాను ఢిల్లీలో ఉండడం వల్ల పూర్తిగా ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వినలేదని సమాధానంగా చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లా కలెక్టర్ తో పాటు కొన్ని జిల్లాల కలెక్టర్లు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించిన విధానం చూశామని గుర్తు చేశారు.

గతంతో పోలిస్తే, ఐఏఎస్ అధికారులకు గౌరవం తగ్గిందని రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ కార్యదర్శి పేర్కొనడం పరిశీలిస్తే, గతంలో నిర్వహించుకున్న రచ్చబండ కార్యక్రమంలో మనం కూడా ఐఏఎస్ లు కాస్తా, అయ్యా ‘ఎస్ ‘ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని మాట్లాడుకున్నాం. మీరు, నేను అంటే కామెంట్ చేశామని అంటారు. ఇప్పుడు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారే కామెంట్ చేశారంటే, మనం మాట్లాడితే తప్పులేదు. ప్రస్తుత ప్రభుత్వంలో ఐఏఎస్ లు తమ పూర్వ వైభవం రావాలని కోరుకుంటున్నట్లుగా ప్రస్ఫుటమవుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుల కంటే ఐఏఎస్ లకే అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే అంగీకరించారు.

గతంలో మాదిరిగా కాకుండా, ఈసారి ఐఏఎస్ లతో పాటు ఎమ్మెల్యేలకు తగిన ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి తగినంత సమయం ఇస్తే, వారి నియోజకవర్గ సమస్యలను చెప్పుకోవడానికి వెసులుబాటు లభిస్తుంది. మాజీ జగన్మోహన్ రెడ్డి , శాసనసభ్యులకు తగినంత సమయం కేటాయించకపోవడం వల్లే లెవన్ మోహన్ రెడ్డి గా మారారు .

ఎమ్మెల్యేలకు తగిన గౌరవం ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడే, ప్రజలు వారికి గౌరవాన్ని ఇస్తారని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. శాసనసభ్యులు కూడా పరిపాలనలో భాగమేనన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి తప్పు చేశారని, అందుకే ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారన్నారు.

జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ కి ఏడాదికి 90 కోట్ల రూపాయల ఖర్చు అవసరమా?

జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ కోసం ఏటా 90 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం అవసరమా అని రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.. తనకు 900 మందితో సెక్యూరిటీ కల్పించాలన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డిమాండ్ ను ఒక మీడియా ప్రతినిధి ఆయన దృష్టికి తీసుకురాగా, 900 మంది సెక్యూరిటీ సిబ్బందికి నెలకు 7. 50 కోట్ల చొప్పున, సంవత్సరానికి 90 కోట్లు ఖర్చవుతుందన్నారు.

ఒక శాసనసభ్యుడికి వన్ ప్లస్ వన్ సెక్యూరిటీని కల్పిస్తారని, ప్రాణహాని ఉన్న శాసనసభ్యులకు అయితే ఫోర్ ప్లస్ ఫోర్ సెక్యూరిటీని కల్పిస్తారు. జగన్మోహన్ రెడ్డికి సిక్స్ ప్లస్ సిక్స్ సెక్యూరిటీని కేటాయిస్తే సరిపోతుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రాణాలకు ఇప్పుడు ప్రజల వల్ల ముప్పు లేదు. ప్రజలకు ఇప్పుడు ఆయన వల్ల ముప్పు లేదని అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజలతో కలిసి వెళ్లాల్సిన సమయం. 900 మంది సెక్యూరిటీతో ఎక్కడకు వెళ్తారని ప్రశ్నించారు. విదేశాల్లో చదువుకునే ఆయన కూతుర్లకు సెక్యూరిటీ ఏమీ అవసరం అని ప్రశ్నించారు.

శాసనసభ పని దినాలు పెంచాలి

శాసనసభ పని దినాలను పెంచాలని శాసనసభ నాయకుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడును సభలోనే కోరినట్టుగా రఘురామ కృష్ణంరాజు తెలిపారు. పార్లమెంట్ గతంలో ఏడాదికి 100 పని దినాల పాటు సమావేశం కాగా, పది రోజులపాటు కోత విధించి 90 రోజులు సమావేశం అవుతుంది. శాసనసభ విషయానికొస్తే గత ఐదేళ్లలో ఏడాదికి 35 నుంచి 40 రోజులు కూడా సమావేశం కాలేదు. అటువంటప్పుడు అసెంబ్లీ బిల్డింగు ఎందుకు?, స్పీకర్ ఎందుకు?? అని ప్రశ్నించిన రఘురామ కృష్ణంరాజు, ప్రజా సమస్యలను చర్చించడానికి అసెంబ్లీ ఒక వేదిక అని పేర్కొన్నారు.

ఆ వేదికను ఉపయోగించుకోవడంలేదని తెలిసి మనసు చివుక్కుమంది. పని దినాలను పెంచడంతోపాటు, చర్చలు అర్థవంతంగా జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పార్లమెంటులో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు కేవలం ప్రశ్నకే పరిమితం అవుతారు. మంత్రులు కూడా సోది చెప్పకుండా, సమాధానం మాత్రమే చెబుతారు. అసెంబ్లీలో అలా కాకుండా సభ్యులు ప్రభుత్వాన్ని ఎలా నడపాలో సూచిస్తున్నారని, ప్రశ్నలు మాత్రమే అడిగే విధంగా చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కలిసి కోరడం జరిగిందన్నారు.

వారానికి ఐదు రోజులు నియోజకవర్గంలోనే…

శాసనసభ్యుడిగా ఎన్నికైన తరువాత వారంలో ఐదు రోజులపాటు నియోజకవర్గంలోనే ఉంటూ 13 గంటలు ప్రజలతో మమేకమవుతున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ప్రజలతో మమేకమవడాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పిన ఆయన, 2020 జూన్ లో రచ్చబండ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. నాలుగేళ్ల పాటు కొనసాగించాం. ఆ నాలుగేళ్లలో నియోజకవర్గానికి వెళ్లలేదన్న బాధ ఉన్నప్పటికీ, మన వంతు పాత్ర పోషించామన్న సంతృప్తి మిగిలింది. మనది కన్సిడర్బుల్ పాత్ర అని చెప్పగలనని రఘురామ కృష్ణంరాజు అన్నారు. ఓవరాల్ గా నా నియోజకవర్గ అభివృద్ధిలో పెద్దగా పాల్గొనక పోయినప్పటికీ, రాష్ట్రాన్ని పెద్ద విపత్తు నుంచి తప్పించడానికి మనము ఇక్కడ నుంచి చేసిన కృషి వల్ల అక్కడ లేననే బాధ కవర్ అయ్యిందని తెలిపారు.

పార్టీ ఇచ్చిన హామీలు కాకుండా వ్యక్తిగతంగా నేనిచ్చిన హామీల అమలుకు కృషి

ఎన్నికలకు ముందు పార్టీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలుకే కాకుండా, వ్యక్తిగతంగా ప్రజలకు నేనిచ్చిన హామీల అమలుకు కృషి చేస్తున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు మంచినీళ్లు అందిస్తానని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినట్లుగా ఆయన తెలిపారు. అలాగే ఎన్నికల ముందు ఎక్కడకు వెళ్లినా ప్రజలు ప్రధానంగా డ్రైన్ల సమస్యను నా దృష్టికి తీసుకు రావడం జరిగింది. ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే డ్రైన్ల సమస్య పరిష్కారాన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

1959లో చెన్నారెడ్డి హయాంలో డ్రైన్ల లో రాష్ట్రవ్యాప్తంగా పూడిక తీశారని, గత ఐదేళ్లలో రూపాయి పని చేయలేదన్నారు. కెనాల్స్, డ్రైన్లపై గుర్రపు డెక్క ఆకు పేరుకుపోగా, కింద సిల్ట్ నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటుందన్నారు. సిల్ట్ ను యంత్రాల సహకారంతో తొలగించాలి. గట్లపై ఆక్రమణలు పెరిగిపోయాయి. గట్ల పైనున్న ఆక్రమణలను తొలగించి, పూడికతీత పనులను ప్రారంభించినట్లు తెలిపారు. రెండు నెలల వ్యవధిలో పూడికతీత పనులు పూర్తి అవుతాయన్నారు. మంచినీటిని కూడా అన్ని గ్రామాలకు సరఫరా చేస్తామని ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేస్తానని తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను కాకుండా, ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని అన్ని స్కూళ్లలో పచ్చదనంతో కూడిన వాతావరణంలో పెంపొందించడానికి చర్యలు చేపట్టాం. క్రీడా ప్రాంగణాలలో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగించి, షటిల్, వాలీబాల్ కోర్టులను ఏర్పాటు చేశాం. సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు మంచాలు, దుప్పట్లు అందజేయడమే కాకుండా, బాత్రూంలను పునర్నిర్మించి, ఓవర్ హెడ్ ట్యాంకుల ద్వారా నీటి సరఫరాకు చర్యలు తీసుకున్నాం. ఈ పనులన్నిటికీ ఖర్చు తక్కువే అయినప్పటికీ, ఎంతో ఉపయోగకరమైన వని తెలిపారు.

ఆగస్టు 15న జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పార్కు ప్రారంభం

నియోజకవర్గ పరిధిలో అసాంఘిక శక్తులకు అడ్డాగా మారి, ఆక్రమణకు గురైన పార్కు స్థలాన్ని తిరిగి స్థానికుల సహకారంతో అభివృద్ధి చేయడం జరిగిందని, ఆ పార్కును ఈ నెల 15వ తేదీన జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రఘురామ కృష్ణంరాజు తెలిపారు. పార్కును ఐదు నుంచి ఏడు లక్షల రూపాయలు వెచ్చించి నేనే అభివృద్ధి చేయాలనుకున్నాను. ఆక్రమణలను తొలగించిన వెంటనే స్థానికులే ముందుకు వచ్చి నాతో ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయించకుండా, వారే పార్కును సొంతంగా అభివృద్ధి చేసుకున్నారు.

ఒక హాస్టల్ కు నాలుగు లక్షల రూపాయలను కేటాయించగా, స్థానికంగా హాస్టల్లో ఎక్కువగా ఉండే మత్స్యకార కుటుంబాలకు చెందినవారు ముందుకు వచ్చి తాము సగం ఖర్చు భరిస్తామని చెప్పారు. హాస్టల్ పనులను వారికే అప్పగించగా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హాస్టల్ పనులను చేపట్టారని రఘురామకృష్ణం రాజు తెలిపారు. మంచి పని చేస్తామంటే, తాము వెచ్చించే ప్రతి రూపాయి సద్వినియోగం అవుతుందంటే ముందుకొచ్చి డబ్బులు ఇవ్వడానికి దాతలు ఎంతోమంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. కావలసిందల్లా వారిలో నమ్మకం కలిగించడమేనని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు.

ప్రజలు పదవులను ఇస్తూనే ఉన్నారు

ప్రజలు ఇప్పటికే నాకు మంత్రి పదవి, స్పీకర్ పదవి, టీటీడీ చైర్మన్ పదవి ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని రఘురామకృష్ణంరాజు తెలిపారు. పదవి అనేది ఒక బాధ్యత అని ఆ బాధ్యతను అప్పగిస్తే ప్రజలు మెచ్చే విధంగా, అప్పగించిన వారు సంతృప్తి చెందే విధంగా పనిచేయగలనన్న నమ్మకం నాకుందని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఏ పదవి ఇచ్చినా దానికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తానన్న ఆయన, ఏ పదవి దక్కకపోయినా ఉండి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు.

LEAVE A RESPONSE