రైతులు, వ్యవసాయరంగ నిపుణులతో చంద్రబాబు ముఖాముఖి
రైతులు సంతోషంగా ఉంటే సమాజం బాగుపడుతుంది
జగన్ రెడ్డి సాగుని చంపేసి రైతుని ముంచేశాడు
పొలాల ముఖం చూడని ముఖ్యమంత్రికి రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయి? పోలవరాన్ని గోదాట్లో ముంచేసి రాష్ట్రానికి ద్రోహం
5 కోట్ల ప్రజలు ఒకపక్క… సైకో జగన్ ఒకపక్క.
అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ‘వ్యవసాయ సంక్షోభంపై ప్రజావేదిక’ కార్యక్రమంలో టీడీపీ అధినేత
ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే.. “ రాష్ట్రంలో అన్నింటికంటే ప్రధాన సమస్య వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సవాళ్లే. మనదేశం వ్యవసాయాధారిత దేశం. దేశానికి అన్నంపెట్టే రైతు సంక్షోభంలో ఉంటే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు.
కరువు కాటకాలతో విపత్తులతో ఇబ్బందులు ఎదుర్కొన్న జిల్లా అనంతపురం జిల్లా. తెలుగుదేశానికి, అనంతపురానికి అవినాభావ సంబంధం ఉంది. ఎన్టీఆర్ గారు హంద్రీనీవా ప్రాజెక్ట్ తో ఈ జిల్లాను రక్షించారు. 2014-19 లో టీడీపీ ప్రభుత్వం మొత్తం రాయలసీమలో సాగునీటి రంగానికి రూ.12వేల కోట్లు ఖర్చుపెడితే, అనంతపురం జిల్లాకు రూ.4,200కోట్లు ఖర్చుపెట్టింది.
రాష్ట్రంలో ఎక్కడాలేని మంచి భూములు ఇక్కడున్నాయి. వేరు శనగ పంట ఈ సంవత్సరం దెబ్బతిన్నది. టీడీపీ ప్రభుత్వంలో వేరుశనగ పైరు రక్షణ కోసం డ్రిప్ ఇరిగేషన్ విధానం తీసుకొచ్చాం. పంటలు దెబ్బతింటే ఇన్ పుట్ సబ్సిడీ, పంటలబీమాతో రైతుల్ని ఆదుకున్నాం. 90శాతం సబ్సిడీతో మైక్రో ఇరిగేషన్ పరికరాలు అందించాం.
రాయలసీమను హార్టికల్చర్ హబ్ గా చూడాలన్న ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసింది. వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసి రైతుని రాజుగా చూడాలన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటుచేశాం.
రైతులు, వ్యవసాయరంగ నిపుణుల అభిప్రాయాలు, ప్రశ్నలకు… చంద్రబాబు స్పందన
ఈ కార్యక్రమం ద్వారా రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. జగన్ రెడ్డి సాగును పూర్తిగా చంపేసి, రైతుని ముంచేశాడు. రాష్ట్రంలో ఏ ఒక్కరైతు ఆనందంగా లేడు. అనంతపురంలో వేరుశనగ రైతు, కర్నూల్లో పత్తిరైతు, పల్నాడులో మిర్చిరైతు, గోదావరి జిల్లాల్లో ధాన్యం రైతు, ఉత్తరాంధ్రలో జీడి రైతులు ఎవరూ సంతోషంగా లేరు. ఆక్వాకల్చర్, హార్టికల్చర్ అన్నీ దెబ్బతిన్నాయి.
అసమర్థ ప్రభుత్వ నిర్ణయాలతో దేశంలో రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం మూడో స్థానంలో ఉంది. కౌలురైతుల ఆత్మహత్యల్లో రెండోస్థానం. దేశంలో రైతులపై ఉన్న తలసరి అప్పు రూ.75వేలు అయితే, రాష్ట్రంలో ఒక్కో రైతుపై ఉన్న తలసరి అప్పు రూ.2,43,000లు. ఆదాయం లేనప్పుడు అప్పులు పెరుగుతాయి. గిట్టుబాటు ధర లేనప్పుడు, నష్టపోయిన పంటలకు పరిహారం అందనప్పుడు రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో 5.77లక్షల ఎకరాల్లో సాగు జరగాల్సి ఉంటే, 3 లక్షల ఎకరాల్లో కూడా పంటలు వేయలేదు. వేసిన పంటకూడా ఎండి పోయింది. సకాలంలో వర్షం పడితే 60రోజుల్లో వేరుశనగ పైరుకి పూత వస్తుంది. ఆ పరిస్థితి ఈ సంవత్సరం లేదు.
ఉమ్మడి జిల్లాలోని రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి ఏనాడు సమీక్ష చేయలేదు. చేసినా అతనికి అవగాహన ఉండదు. తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయడు. ఇతని మూర్ఖత్వంతో రాష్ట్ర రైతాంగం మునిగిపోయే పరిస్థితి. టీడీపీ ప్రభుత్వంలో వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ పెట్టాం. ఐదేళ్లలో రూ.41,194 కోట్లు వ్యవసాయానికి కేటాయించాం. మొత్తం బడ్జెట్లో 5.81 శాతం నిధులు వ్యవసాయానికే కేటాయించి, ఐదేళ్లలో 11శాతం గ్రోత్ రేట్ సాధించాం.
ఈ ప్రభుత్వం వచ్చాక వ్యవసాయానికి నిధులు బాగా తగ్గించింది. ముఖ్యమంత్రి పొలాల్లోకి వెళ్లి, రైతులతో మాట్లాడితే వారి సమస్యలు తెలుస్తాయి. రైతుభరోసా కేంద్రాలు రైతు దగా కేంద్రాలుగా మారాయి. వ్యవస్థల పేర్లుమారిస్తే సరిపోదు.. వాటితో సక్రమంగా పని చేయించాలి.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ హయాంలో ఎన్టీఆర్ జలసిరి కింద 6 లక్షల పంటకుంటలు తవ్వించాం. వర్షపు నీరు కుంటల్లోకి వెళ్తే, భూగర్భ జలాలు పెరుగుతాయని భావించాం. 23 వేల ట్రాక్టర్లు రైతురథం కింద అందించాం. మనిషికి ఆరోగ్యపరీక్షలు ఎంత ముఖ్యమో, భూమికి భూసార పరీక్షలు అలా. అందుకోసం ఉచితంగా భూసార పరీక్షలు నిర్వహించి, నేలను బట్టి రైతులకు జిప్సం, బోరాన్, జింక్ వంటివి అందించాం. యాంత్రీకరణ పథకం కింద రూ.4వేలకోట్లు ఖర్చు పెట్టాం. మైక్రో ఇరిగేషన్ కింద ర.1250కోట్లు ఖర్చుపెట్టాం.
ఇన్ పుట్ సబ్సిడీ కింద రూ.3,759కోట్లు రైతులకు అందించాం. ధరల స్థిరీకరణ నిధికి రూ.3,556కోట్లు వెచ్చించాం. రైతు రుణమాఫీతో రైతులను అప్పులనుంచి విముక్తుల్ని చేశాం. లక్షా 50 వేల రుణమాఫీ ప్రకటించి, ఒకేసారి రూ.50వేలు మాఫీ చేసి అందుకోసం రూ.15,300కోట్లు ఖర్చు పెట్టాం. కౌలురైతులకు కూడా రూ.4,300కోట్ల రుణాలు అందించాం. రాష్ట్రంలో 7 లక్షల మంది కౌలురైతుల్ని గుర్తించి, చనిపోయిన కౌలురైతుల కుటుంబాలకు చంద్రన్న బీమా ద్వారా ఆర్థిక సాయం అందించాం.
లక్ష రుణానికి సక్రమంగా వడ్డీ లేకుండా చేశాం. ఇతను రైతుభరోసా అన్నాడు. ఏటా ప్రతిరైతుకి రూ.12,500లు ఇస్తానన్నాడు.. ఇస్తున్నది మాత్రం ర.7,500 లే. పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీ, గిట్టుబాటుధర లేకుండా చేశాడు. రైతులు తీసుకునే రుణాలపై 7 శాతం వడ్డీ వేస్తున్నారు. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక పోయినట్టుగా చేశాడు.
తప్పుడు ఆలోచనలు.. మూర్ఖపు నిర్ణయాలతో రైతుల్ని దగాచేశాడు. రైతుల మెడలకు ఉరితాళ్లు బిగించేలా వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టిస్తున్నాడు. తెలంగాణ ప్రభుత్వం మీటర్లు పెట్టమంటే, ఇతను పెడతాను అన్నాడు. రైతులన్నా… వ్యవసాయమన్నా ఈ ముఖ్యమంత్రికి చులకన.
రైతుల కష్టాలు, బాధలు గమనించే అన్నదాత పథకం తీసుకొచ్చాను. అధికారంలోకి రాగానే ప్రతిరైతుకి ఏటా రూ.20వేల ఆర్థికసాయం అందిస్తాను. దేవుడిదయతో రాష్ట్రానికి ఆదాయం పెరిగితే, రైతులకు ఇంకా మంచి సాయం చేస్తాం. ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చేలా చేస్తాను. సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి జోడిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
ఇవన్నీ జరగాలంటే ఒక్కటే జరగాలి. ‘రైతు బతకాలంటే జగన్ పోవాలి’ ఈ వాస్తవాన్ని ప్రతి ఒక్కరైతు గుర్తుంచుకోవాలి. అవగాహనలేని దుర్మార్గపు, అహంకార ప్రభుత్వంతో ఏ వర్గానికి న్యాయం జరగదు. భవిష్యత్ లో తెలుగుదేశం పార్టీ రూపొందించే మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన సూచనలు, సలహాలతో కొత్త అంశాలు పొందుపరుస్తాం.
రైతు సంక్షేమానికి, వ్యవసాయరంగ పటిష్టతకు అనేక కార్యక్రమాలు చేపట్టాను. ఏ రైతు ఇబ్బంది పడకూడదన్న లక్ష్యంతో పనిచేశాను. నాణ్యమైన విద్యుత్ తక్కువధరకే రైతులకు అందించాం. సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాం. రాయలసీమలో బిందు, తుంపర సేద్యానికి ప్రాధాన్యత ఇచ్చాం.
ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెట్టి, ప్రపంచంలో ఎక్కడా చేయని ప్రయోగాలు రాష్ట్రంలో చేశాం. సమాజం దశాబ్దాల నుంచి ఎదుర్కొంటున్న అనేక సమస్యల్ని పరిష్కరించాను. డ్వాక్రా సంఘాలతో ఆడబిడ్డల్ని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ప్రోత్సహించాను. వారికోసమే ఇప్పుడు మహాశక్తి కార్యక్రమం తీసుకొచ్చాను. రైతులు, మహిళలు సంతోషంగా ఉంటే సమాజం ఎంతో బాగుపడుతుంది.
ప్రభుత్వం ఇరిగేషన్ , వ్యవసాయ రంగాల్లో పూర్తిగా విఫలమైంది. రాష్ట్రంలో అనేక నదులున్నా గోదావరిలో పుష్కలంగా నీళ్లుంటాయి. ఆ నీటిని సద్వినియోగం చేసుకోవడం కోసమే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాం. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం టీడీపీ హయాంలో రూ.69 వేల కోట్లు ఖర్చుపెడితే, వైసీపీప్రభుత్వం వచ్చాక కేవలం రూ.12 వేల కోట్లు మాత్రమే పెట్టింది. ఎంత వ్యత్యాసం ఉందో మీరు గమనించాలి.
సాగునీరు అందుబాటులో ఉంటే ఈ ప్రాంతం ఎంత సస్యశ్యామలం అవుతుందో చెప్పాల్సిన పనిలేదు. దానికి ఉదాహరణ హంద్రీనీవానే. టీడీపీ హయాంలో జీడిపల్లి, చెర్లోపల్లి, మారాల, గొల్లపల్లి రిజర్వాయర్లు పూర్తి చేశాం. కియా పరిశ్రమ తీసుకొచ్చాం. హంద్రీనీవా నుంచి భైరవాని తిప్ప ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు తరలించాలని, కల్యాణదుర్గం నియోజకవర్గానికి నీళ్లు అందించాలని ఆలోచన చేశాం.
అందుకోసం ప్రణాళికలు వేసి, డబ్బులు కూడా మంజూరు చేసి 26 శాతం పనులు టీడీపీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ ప్రభుత్వం ఆ పనులన్నీ ఆపేసింది. దాంతో రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే గతంలో జిల్లాలో ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి సాగు, తాగునీరు అందిస్తాం. ఈ జిల్లాకు నీళ్లు అందిస్తే ఇక్కడి రైతులు అద్భుతాలు సాధిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ఒక సంవత్సరంలో పూర్తిచేసి గోదావరి నీటిని కృష్ణాడెల్టాకు అందించి, కృష్ణాడెల్టాకు వినియోగించే నీటిని శ్రీశైలంలో నిల్వ చేసి, ఆ నీటిని హంద్రీనీవా, గాలేరు-నగరి ద్వారా రాయలసీమకు అందించింది టీడీపీ ప్రభుత్వమే. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే, గోదావరి నీటిని అమరావతి సమీపంలోని వైకుంఠపురంలో రిజర్వాయర్లో నిల్వచేసి, అక్కడి నుంచి ఆ నీటిని నాగార్జున సాగర్ కుడికాలువకు తరలించి, సాగర్ లోని నీటిని శ్రీశైలంలో పొదుపుచేసి, రాయలసీమలోని ఒక్కో జిల్లాకు 60, 70 టీఎంసీల నీరు ఇచ్చేది. దాంతో ఇక్కడ నీటి సమస్యే ఉండేది కాదు.
ఏటా 2వేల టీఎంసీల గోదావరి నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఆ నీటిలో 500టీఎంసీలు రాయలసీమకు తరలించవచ్చు. గోదావరి నీటిని నాగార్జున సాగర్ కింద నిల్వచేసి, నల్లమల అటవీప్రాంతంలో ఒక సొరంగం తవ్వి, ఆ మార్గంలో నేరుగా బనకచర్లకు నీళ్లు తీసుకొస్తే, అక్కడినుంచి సీమలోని అన్ని ప్రాజెక్టులకు గోదావరి నీళ్లు అందించవచ్చు.
ఇలాంటి ఆలోచనలతో టీడీపీ ప్రభుత్వం తయారుచేసిన ప్రణాళికలను ఈ ముఖ్యమంత్రి విధ్వంసం చేశాడు. ఈ జిల్లాతో పాటు సీమకు నీళ్లిచ్చే బాధ్యత నాది. నేను అనుకున్నది జరగాలంటే రైతులు కూడా చైతన్యవంతులై దుర్మార్గులపై పోరాడాలి.
5 కోట్ల ప్రజలు ఒకపక్క… సైకో జగన్ ఒకపక్క. నాలుగునెలలు ఈ దుర్మా ర్గ ప్రభుత్వంపై పోరాడండి. జమిలి ఎన్నికలు వస్తే నాలుగునెలలు.. లేకపోతే ఆరునెలలు. టీడీపీ ప్రభుత్వం రాగానే వీళ్లు చేసిన వాటికి లెక్క కట్టి మరీ సమాధానం చెబుతాం.
గతంలో తుంగభద్ర డ్యామ్ కు నీళ్లొచ్చినా, కేంద్రం వేసిన ఇరురాష్ట్రాల కామన్ బోర్డు చెప్పినా హెచ్.ఎల్.సీ ద్వారా అనంతపురానికి నీళ్లు వచ్చేవి కావు. అప్పుడు కర్ణాటక సీఎంగా ఉన్న సిద్ధరామయ్యతో మాట్లాడి కర్ణాటక సరిహద్దుల్లోని హెచ్.ఎల్.సీ నుంచి అనంతపురానికి నీళ్లు రావడంలేదని, దాని బాగుకోసం అవసరమైన డబ్బులు మేమే ఇస్తామని, మీరు నీళ్లివ్వండి అని చెబితే ఆయన ఒప్పుకున్నారు.
కాలువల ఆధునికీరణ పనులు కొంతవరకు పూర్తిచేశాం. ఈ ప్రభుత్వం రాగానే ఆ పనులన్నీ ఆగిపోయాయి . పై రాష్ట్రాల నుంచి మనకు రావాల్సిన నీటికోసం న్యాయంగా పోరాడతాం. అదంతా ఒకెత్తు అయితే, గోదావరి నీళ్లను రాష్ట్రమంతా తీసుకెళ్లడమనేది ఇంకా ముఖ్యం.
దానికోసం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని72శాతం పూర్తి చేయించాం. ఎప్పటికప్పుడు అధికారులు, కేంద్రప్రభుత్వంతో మాట్లాడుతూ, కాంట్రాక్టర్లకు చెప్పి వేగంగా పనులు జరిగేలా చేశాను. తెలుగుదేశం పార్టీ గెలిచి ఉంటే 2020 జూన్ కే పోలవరం పూర్తై, రాష్ట్రమంతా నీళ్లు వచ్చేవి. ఇతను వచ్చి రివర్స్ టెండర్లు అని మొత్తం ప్రాజెక్ట్ నే గోదాట్లో ముంచేశాడు.
ఇతను పోలవరం ముంచేసి రాష్ట్రానికి చాలా పెద్ద ద్రోహం చేశాడు. పోలవరంతో మాకేం పని అని ఇక్కడి రైతులు అనుకోవచ్చు..అది తప్పు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో నదుల అనుసంధానం చేసి అటు ఉత్తరాంధ్రకు, ఇటు సీమకు నీళ్లు అందించవచ్చు. కచ్చితంగా అది చేసి తీరతాం.
ఏ ప్రభుత్వం ఉన్నా సంపదసృష్టి గురించి ఆలోచించాలి. రైతుకు ఆదాయం పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. అలానే పరిశ్రమలు వస్తే ప్రభుత్వానికి ఆదాయం వచ్చి నిరుద్యోగసమస్య పరిష్కారం అవుతుంది. వ్యవసాయం, పారిశ్రామికరంగం అభివృద్ధి చెందితే సేవారంగం వృద్ధి చెందుతుంది.
ఇవన్నీ జరగాలంటే నీళ్లు ఉండాలి. కియామోటార్స్ రావడానికి కారణం సకాలంలో నీళ్లు అందించడమే. ఆ పరిశ్రమ కోసం కర్ణాటక, తమిళనాడు సహా, అనేక రాష్ట్రాలు పోటీపడ్డాయి. భవిష్యత్ లో ఇంకా మెరుగ్గా చేయాలనుకుంటున్నాం.
రాయలసీమకంటే దారుణమైన కరువు పరిస్థితి ఉన్న రాష్ట్రాలు దేశంలో ఉన్నాయి. పశ్చిమబెంగాల్ కరువుతో దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంది. కరువు నివారణకు నీటి వనరుల సద్వినియోగమే పరిష్కారం. ధవళేశ్వరం బ్యారేజ్ కట్టకముందు గోదావరి జిల్లాలు కూడా కరువును ఎదుర్కొన్నాయి. అది పూర్తయ్యాక ఆ జిల్లాలు నాగరికతలో ముందు నిలిచాయి.
ఉమ్మడి రాష్ట్రంలో మహబూబ్ నగర్ , అనంతపురం జిల్లాలు తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల్ని అనుభవించాయి. అనంతపురంలో ఒక దశలో పశువులకు మేతలేని దుస్థితి వచ్చింది. అప్పుడు పశువుల రక్షణకోసం ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేసి, గ్రాసం..దాణా అందించాం. అనంతపురం కరువు పోవాలంటే నీరు అందించడం ఒక్కటే పరిష్కారమని ఆలోచించాను. మహాబూబ్ నగర్ జిల్లాకు కూడా అప్పట్లోనే కల్వకుర్తి – నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు అందించాం.
నా జీవితంలో చాలా కరువులు చూశాను. సాంకేతిక పరిజ్ఞా నం, దూరదృష్టితో సమస్యలు పరిష్కరించుకోవాలి. గంగా-కావేరి అనుసం ధానం జరిగితే దేశంలో కరువు అనేదే ఉండదు. నదుల అనుసంధానం పెద్ద కష్టమేమీ కాదు. నీరు రైతులతో పాటు, అందరికీ అవసరమే. నీటితోనే గ్రీన్ హైడ్రోజన్ తయారీతో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. దానితో పాటు సోలార్, పవన విద్యుదుత్పత్తి చేయగలిగితే, 80శాతం విద్యుత్ తయారు చేసుకోవచ్చు. దాంతోనే రైతులు వారి వ్యవసాయ, గృహవసరాలు తీర్చుకోవచ్చు. ఇది జరిగితే విద్యుత్ ఛార్జీల భారంతో పాటు ఇంధన ధరలు కూడా తగ్గుతాయి.
విద్యాభ్యాసానికి సంబంధించి ఇక్కడ తలెత్తుతున్న లోకల్ – నాన్ లోకల్ సమస్యను టీడీపీ ప్రభుత్వం రాగానే పరిష్కరిస్తాం. విద్యాభ్యాసం విషయం లో వ్యత్యాసాలు మంచిదికాదు.
ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటి…చేసేదొకటి. ప్రభుత్వం శాశ్వతం కాదు.. సమాజం శాశ్వతం. సమాజహితం కోసం పనిచేసేవారు తప్పుడు పనులు చేయరు. టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చిన స్థలాలు వెనక్కుతీసుకొని వేరేవాళ్లకు ఇవ్వడం ఏమిటి? పేదలంటే ఎవరైనా పేదలే. వారిలో పార్టీలు..కులమతాలు చూడటం సరైన విధానం కాదు.”