Suryaa.co.in

Editorial

నవంబర్ తర్వాత జగన్ ప్రజా ఆశీర్వాద యాత్ర?

– అప్పటిదాకా ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలకు హోంవర్కు
– అది ముగిసిన తర్వాతే జనంలోకి జగన్?
– ఇక కొత్త హామీలిచ్చేదేమీ ఉండవట
– బాబు-పవన్‌పై విమర్శలకే పరిమితమా?
– మళ్లీ బిక్కుమంటూ జనంలోకి వైసీపీ ఎమ్మెల్యేలు
– ‘గడప గడపకూ ప్రభుత్వం’లోనే చుక్కలు చూస్తున్న ఎమ్మెల్యేలు
– హామీలకు నిధులు లేని దుస్థితి
– రోడ్డు, కరె ంటు బిల్లుల సమస్యలతోనే తలనొప్పి
– వేలరూపాయల కరెంటు బిల్లులపై పేదల ఆగ్రహం
– రోడ్లు వేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇప్పించలేని అసమర్థత
– పాత బిల్లులు ఇస్తే తప్ప కొత్త పనులు చేసేదిలేదంటున్న కాంట్రాక్టర్లు
– తమకంటే వాలంటీర్లకే విలువ ఎక్కువని సర్పంచుల ఆవేదన
– గ్రామాల్లో సర్కారీ కార్యక్రమాలకు సర్పంచులు దూరం
– వాలంటీర్లతో చేయించుకోండని ఎమ్మెల్యేలపై సర్పంచుల వ్యంగ్యాస్త్రాలు
– ఇంటలిజన్స్, వైసీపీ మీడియా నిఘాలతో ఎమ్మెల్యేల చికాకు
– ‘వై ఏపీ నీడ్స్ జగన్’, జగనన్న సురక్ష కార్యక్రమాలతో కొత్త తలనొప్పి
– అధికారపార్టీ ఎమ్మెల్యేలకు మళ్లీ అవస్థలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

మళ్లీ జనంలోకి వచ్చేందుకు ఏపీ సీఎం-వైసీపీ అధినేత జగన్ సిద్ధమవుతున్నారు. ‘‘ప్రజా ఆశీర్వాదయాత్ర’’ పేరుతో జనంలోకి వచ్చేందుకు, ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బహుశా నవంబర్-డిసెంబర్ నుంచి జగన్ ఆశీర్వాదయాత్ర ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. ఆలోగా పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిలను మరోసారి జనంలోకి పంపేందుకు, జగన్ తాజాగా షెడ్యూల్ కూడా ఇచ్చేశారు.

ఎన్నికల్లో మరోసారి విజయఢంకా మోగించే లక్ష్యంతో ఉన్న జగన్, ఆమేరకు తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే గడప గడపకూ ప్రభుత్వం పేరుతో, పార్టీ ఎమ్మెల్యే-నియోజకవర్గ ఇన్చార్జిలను జనంలో ఉంచిన జగన్.. నవంబర్ వరకూ మరికొన్ని కార్యక్రమాలు రూపొందించి, వారి ముందుంచారు. ఆ తర్వాతనే, అంటే.. నవంబర్ లేదా డిసెంబర్ నుంచి, ప్రజా ఆశీర్వాద యాత్ర జరగవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనిపై ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదు.

కాగా జగన్ ఆదేశాల ప్రకారం.. ‘వై ఏపీ నీడ్స్ జగన్’, జగనన్న సురక్ష కార్యక్రమాలతో మరో రెండు నెలల పాటు, ఎమ్మెల్యేలను జనంలోనే ఉంచే కార్యక్రమానికి తెరలేపనున్నారు. ఇప్పటికే గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో జనంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యేలు-నియోజకవర్గ ఇన్చార్జిలకు, ఇది అదనపు పనిభారంగా మారనుంది.

ఈ రాష్ట్రానికి మరో ఐదేళ్లు జగన్ అవసరాన్ని వివరిస్తూ.. ఎమ్మెల్యేలు-ఇన్చార్జిలు మరోసారి జనంలోకి వెళ్లబోతున్నారు. ఆమేరకు జగన్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను, మళ్లీ జనం వద్ద ఏకరవు పెట్టాలన్నమాట. దానికితోడు జగనన్న సురక్ష పథకం గురించి మూడోదశలో రంగప్రవేశం చేసి, దానిపైనా ప్రచారం చేయాలన్నమాట.

అయితే ఇప్పటికే గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో జనం ముందుకు వెళుతున్న ఎమ్మెల్యేలకు, ప్రజల నుంచి ప్రశ్నల సెగ తగులుతుండటం వారికి శిరోభారంగా మారింది. గ్రామాలు-మండల కేంద్రాల్లో రోడ్లన్నీ శిధిలావస్థకు చేరాయి. రోడ్ల పరిస్థితిని వెక్కిరిస్తూ విపక్షాలు, అక్కడ కాగితపు పడవులు పంపిస్తున్నారు. మరికొన్ని చోట్ల చిన్నపిల్లలను అందులో దూకి, ఈత కొట్టిస్తున్న ఫొటోలు తీస్తూ, సర్కారు పరువు తీస్తున్నారు. ఇవన్నీ సోషల్‌మీడియాలో వస్తుండటం, వైసీపీ ఎమ్మెల్యేలకు తలకొట్టేసినంత పనవుతోంది.

అలాగని రోడ్ల పునర్మిర్మాణాలకు నిధులు ఇప్పించలేని దుస్థితి. ఇక కరెంటు చార్జీలు పెరగటంతో, పేదల నుంచి వచ్చే బిల్లుల ప్రశ్నలకు జవాబివ్వలేని దయనీయం. ఇవన్నీ ప్రభుత్వ విధాన నిర్ణయాలు కావడంతో, ఎమ్మెల్యేలు ఏమీ చేయలేని దుస్థితి. ఎలాంటి హామీలు ఇవ్వలేని నిస్సహాయత. అందుకే మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ పరిస్థితి అధిగమించేందుకు, తమ పార్టీ నేతలకు పట్టున్న వార్డులు- గ్రామాలు ఎంచుకుంటున్న వైనం.

ప్రధానంగా గ్రామాల్లో రోడ్లు నిర్మించాలంటే, కాంట్రాక్టర్లు ముందుకురాని పరిస్థితి ఉందంటున్నారు. ఇప్పటివరకూ కాంట్రాక్టర్లు తమ ఒత్తిడి మేరకే పనిచేశారని, కానీ ఇంతవరకూ వారికి బిల్లులు చెల్లించలేని దుస్థితి ఉందని వాపోతున్నారు. జిల్లా కలెక్టర్, జిల్లా మంత్రికి, చివరకు సీఎంఓ అధికారులకు ఎన్నిసార్లు మొత్తుకున్నా కంఠశోషనే తప్ప, ఎలాంటి ఫలితం కనిపించడం లేదంటున్నారు. రోడ్లు నిర్మించాలని తాము కాంట్రాక్టర్లను ఒత్తిడి చేస్తుంటే, పాత బిల్లులు ఇప్పించాలంటున్న వారి డిమాండ్లకు, తమ వద్ద జవాబు లేదని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

ఇక గడప గడపకూ మన ప్రభుత్వం వంటి కార్యక్రమాలు.. గ్రామాల్లో పేలవంగా జరుగుతున్నాయని, మెజారిటీ ఎమ్మెల్యేలు అంగీకరిస్తున్నారు. గ్రామాలపై పట్టున్న సర్పంచులకు సైతం.. బిల్లులు ఇప్పించలేని అసమర్థ పరిస్థితిలో ఉన్నామని, ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గడపడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాలకు హాజరుకావాలని ఎమ్మెల్యేలు సర్పంచులకు ఫోన్లు చేస్తున్నారు. అయితే ‘‘మాతో మీకు-జగనన్నకు అవసరం లేదు కదా? వాలంటీర్లు ఉన్నారు క దా? రేపు ఓట్లు కూడా వారితోనే వేయించుకోండి’ అని సర్పంచులు వ్యంగ్యంగా బదులిస్తున్నారని.. గుంటూరు జిల్లాకు చెందిన ఓ వైసీపీ ఎమ్మెల్యే అసలు విషయం బయటపెట్టారు.

తాము నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నందున, ఇక కొత్తగా ఇలాంటి కార్యక్రమాలు ఎందుకని, పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు. రోడ్లకే డబ్బులు లేకపోతే మళ్లీ జనంలోకి ఏం చెప్పాలంటున్నారు. ప్రతిపక్షాల కంటే తామే నిరంతరం ప్రజల్లో ఉంటున్నామని, అందరికీ అందుబాటులో ఉంటున్నామని గుర్తు చేస్తున్నారు. ఇంకా తమకు ముఖ్యమంత్రే అందుబాటులో ఉండటం లేదని ఎత్తిపొడుస్తున్నారు.

అయితే తామెంత ప్రజల్లో ఉంటున్నా.. వాలంటీర్లకు ఉన్న విలువ-గుర్తింపు తమకు ఉండటం లేదని పలువురు ఎమ్మెల్యేలు వాపోతున్నారు. ‘ప్రజలకు పథకాలు తామే ఇస్తున్నప్పటికీ, వారు మాత్రం తమకు వాటిని వాలంటీర్లు ఇస్తుంటే తలకొట్టేసినంత పనవుతోంది. దానివల్ల మా విలువ తగ్గిపోతోంద’ని, అనంతపురం జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.

తాము ఉదయాన్నే జనంలోకి వెళ్లి సమస్యలు పరిష్కరిస్తుంటే.. ప్రజలు మాత్రం తమకు అన్ని పథకాలూ వాలంటీర్లే ఇస్తున్నారని చెప్పడం, మాకు అవమానమే కదా అని ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. తాము ప్రచారం కోసం సోషల్‌మీడియా బృందాన్ని డబ్బు పెట్టి ఏర్పాటుచేసుకుంటే, వాలంటీర్లు మాత్రం పైసా ఖర్చు లేకుండా, జనాలకు దగ్గరవుతున్నారని అసలు విషయం బయటపెట్టారు.

తాము సొంత వ్యాపారాలు ఒదులుకుని ఇంటింటికీ తిరుగుతూ, ప్రజల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అయినప్పటికీ తమపై ఇంటలిజన్స్- పార్టీ మీడియా వర్గాలు- సర్వే సంస్థలు తమపై నిఘా వేయడాన్ని, మెజారిటీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది తమను అవమానించడమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపధ్యంలో త్వరలో ప్రారంభం కానున్న ‘వై ఏపీ నీడ్స్ జగన్’, జగనన్న సురక్ష కార్యక్రమాలు వైసీపీ ఎమ్మెల్యేలకు ఇబ్బందికరంగా పరిణమించాయి.

LEAVE A RESPONSE