– ఇంకా ప్రభుత్వం నుంచి రావాల్సిన సొమ్ము రూ.1192 కోట్లు
– చివరి రూపాయి విడుదల చేసేవరకు పోరాటం కొనసాగించండి
– టిడిపి నరేగా విభాగం సభ్యులకు చంద్రబాబునాయుడు ఆదేశం
అమరావతి: రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చినా నరేగా బిల్లలులపై జగన్ రెడ్డి సర్కారు ఇప్పటికీ సొమ్ము విడుదల చేయకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని టిడిపి ఉపాధి హామీ మండలి మాజీ సభ్యులు, నరేగా ఫిర్యాదుల విభాగం సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. టిడిపి నరేగా ఫిర్యాదుల విభాగం సభ్యులు వీరంకి గురుమూర్తి, పోతుగంటి పీరయ్య పార్టీ అధినేత చంద్రబాబునాయుడును కేంద్ర కార్యాలయంలో కలసి నరేగా బిల్లులపై తాజా పురోగతిని వివరించారు.
రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత మూడేళ్లుగా తెలుగుదేశం పార్టీ చేసిన న్యాయపోరాటం ఫలితంగా ఇప్పటివరకు 2, 133 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. ఇంకా 1192 కోట్ల రూపాయలు విడుదల కావాల్సి ఉందని నరేగా విభాగం సభ్యులు అధినేత దృష్టికి తెచ్చారు. క్వాలిటీ కంట్రోల్ పేరుతో 178 కోట్లు, డిసిసి పనులకు 21శాతం కోత పెట్టి రూ.328కోట్లు, ఎంసిసి కింద 6.3శాతం 22.26కోట్లు, ఎం.బుక్ కాలేదని, కన్వర్జెన్సీ సాకుతో 200 కోట్లు పెండింగ్ పెట్టారని తెలిపారు.
ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు స్పందిస్తూ చివరి రూపాయి విడుదలయ్యే వరకు పోరాటం కొనసాగించాలని సూచించారు. న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం వేధింపు చర్యలకు పాల్పడినట్లయతే ధిక్కరణ పిటిషన్ దాఖలుచేయాలని తెలిపారు. వైసిపి ప్రభుత్వం నిర్వాకం కారణంగా గత మూడేళ్లలో 50మందికి పైగా నరేగా బిల్లులు అందక ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు.