– కప్పిపెట్టుకునేందుకు ఇతరులపై నిందలు
– మాజీ మంత్రి కొల్లు రవీంద్ర
రాష్ట్రంలో జగన్ రెడ్డిని మించిన పెత్తందారు మరెవరూ లేరు. తన దోపిడీ లక్షణాన్ని ఎదుటివారికి అంటగట్టడం జగన్ రెడ్డి నైజం. ఆయన దేశంలోనే రిచెస్ట్ సి.ఎం అని ‘ది ప్రింట్ మ్యాగజైన్’ పేర్కొన్నది. భారతీ సిమెంట్స్, సండూర్ పవర్, సరస్వతీ పవర్, సాక్షి మీడియా లాంటి 16 భారీ కంపెనీలతో పాటు మరో 50కు పైగా బినామీ షెల్ కంపెనీలు ఉన్నాయి. వేల ఎకరాల భూములు ఉన్నాయి. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ఇడుపులపాయ, పులివెందుల, తాడేపల్లిలలో ఇంధ్రభవనాలు లాంటి 6 ప్యాలెస్ లు ఉన్నాయి.
2004 లో రూ.1.73 కోట్ల ఆస్తి కలిగి హైదరాబాద్ లో ఉన్న ఇల్లు సైతం అమ్ముకునే స్థితిలో ఉన్న జగన్ రెడ్డి 18 ఏళ్లలోనే 3 లక్షల కోట్లకు నడమంత్రంగా పెరగడం పెత్తందారీతనం కాక మరేమిటీ? జగన్ రెడ్డిపై 40 క్రిమినల్ కేసులుండగా అందులో 24 సెక్షన్లు 420 కేసులే. కడప ఎంపీ సీటుపై భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన బాబాయిపై గొడ్డలివేటు వేయించడం, నరహంతకుల్ని కాపాడటం పెత్తందారితనం కాక మరేమౌతుంది?
తండ్రి ఆస్తిలో న్యాయమైన వాటా అడిగిన తల్లిని, చెల్లిని తరిమేయడం పెత్తందారితనం కాదా? ఎంపీ రఘురామకృష్ణంరాజును కస్టోడియల్ టార్చర్ చేయించి ఆ వీడియో చూసి ఎంజాయ్ చేయడం పెత్తందారీతనం కాదా? ప్రజావ్యతిరేక విధానాలు, కుంభకోణాలు, ప్రశ్నించిన నేతల ఇళ్లను ధ్వంసం చేయించడం, పార్టీల కార్యాలయాలు దగ్ధం చేయించడం పెత్తందారీతనం కాదా?
పంచాయతీలు, పురపాలక సంఘాల తీర్మానాలు లేకుండా ఆ సంస్థలకు చెందిన రూ.12 వేల కోట్ల నిధులు దారిమళ్లించడం పెత్తందారీతనం కాదా? ప్రభుత్వ ప్రకటనల్లో మంత్రుల పోటోలు తీసేసి తన ఒక్కడి ఫోటో మాత్రమే వేసుకోవడం పెత్తందారీతనం కాదా? రాష్ట్రంలోని అన్ని పార్టీలు, రాష్ట్ర హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తించినా తాను గుర్తించకపోవడం పెత్తందారీతనం కాదా?
అంబేడ్కర్ విదేశీ విద్యలో అంబేడ్కర్ పేరును తొలగించి జగనన్న విదేశీ విద్యగా మార్పుచేయడం పెత్తందారీతనం కాక మరేమౌతుంది? జగన్ రెడ్డిని మించిన పెత్తందారు, గజదొంగ దేశంలో మరెవరున్నారు? తన దోపిడీతనాన్ని కప్పిపెట్టుకునేందుకు ఇతరులపై నిందలు వేయడం మానుకోవాలి. దోచుకో, పంచుకో, తినుకో పేటెంట్ జగన్ రెడ్డిదే అన్న విషయాన్ని గుర్తించాలి.