Suryaa.co.in

Andhra Pradesh

హిందూత్వపై దాడి చేస్తున్న జగన్ రెడ్డి

– టీటీడీ బోర్డు సభ్యులుగా లిక్కర్ కేసు నిందితులు, హత్య – కేసు నిందితుడి అనుచరులా?
– తక్షణమే కళంకిత బోర్డును రద్దు చేసి
– తిరుమల పవిత్రతను కాపాడాలి
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

రాష్ట్రంలో హిందూత్వంపై జగన్మోహన్ రెడ్డి దాడిచేస్తున్నట్లుగా కనపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను మంటగలిపేలా ముఖ్యమంత్రి నిర్ణయాలు ఉన్నాయి. టీటీడీని వ్యాపార సంస్థతో పాటు రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. తాజాగా నియమించిన టీటీడీ బోర్డు సభ్యుల్లో లిక్కర్ కేసులో అరెస్టై అప్రూవర్ గా మారిన అరబిందో గ్రూప్ డైరెక్టర్ పెనక శరత్ చంద్రారెడ్డికి స్థానం కల్పించడం శ్రీవారి భక్తులను అవమానించడమే.

తిరుమల పుణ్యక్షేత్రంలో కళంకితులకు స్థానం కల్పించడం అంటే హిందువుల మనోభావాలు, దేవస్థానం పవిత్రతను దెబ్బతీయడమే అవుతుంది. అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఉన్న ఏ-2 విజయసాయిరెడ్డి అల్లుడు అన్న కావడమే శరత్ చంద్రారెడ్డి అర్హతా? కడప ఎంపీ, వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి అనుచరుడు ఆర్.వెంకట సుబ్బారెడ్డికి టీటీడీ బోర్డులో స్థానం కల్పించడం దుర్మార్గం కాదా?

అదేవిధంగా తన అవినీతిని కప్పిపెట్టుకునేందుకు బెంగళూరులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇల్లున్న యలహలంక ప్రాంత ఎమ్మెల్యేలకు టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారు. టీటీడీ అంటే పవిత్రతకు మారుపేరు. అలాంటి పవిత్ర సంస్థ పాలకమండలిలో సభ్యులుగా లిక్కర్ మాఫియా కేసుల్లో నిందితులు, హత్యకేసు నిందితుడి అనుచరులకు అవకాశం ఇవ్వడం మన దౌర్భాగ్యం.

గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు టీటీడీని అత్యున్నతంగా తీర్చిదిద్దగా.. నేడు మన ముఖ్యమంత్రి దేవాలయ ప్రాశస్త్యాన్ని తగ్గించే రీతిలో వ్యవహరించడ క్షంతవ్యం కాదు. మంత్రి పదవులు లభించని వారికి టీటీడీని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారు. తిరుమల అంటే కోట్లాది మంది హిందువులకు పవిత్ర ప్రాంతం. శ్రీవారిని నిత్యం కోట్లాది మంది భక్తులు దర్శనం చేసుకుని తన్మయత్వం పొందుతారు. అలాంటి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను పథకం ప్రకారం జగన్ రెడ్డి దెబ్బతీస్తున్నారు.

తిరుమలకు వచ్చే భక్తులకు సరైన భద్రత కల్పించడంలోనూ విఫలమయ్యారు. అనేక వివాదాస్పద నిర్ణయాలతో టీటీడీ ప్రతిష్టను దిగజారుస్తున్నారు. తిరుమల కొండపై పదేపదే అద్దెలు పెంచడం ద్వారా శ్రీవారిని భక్తులకు దూరం చేస్తున్నారు. దేవుడి పట్ల, హిందూమతం పట్ల నమ్మకం లేని వ్యక్తి కరుణాకర్ రెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి అప్పగించారు. అన్ని సాంప్రదాయాలను తుంగలో తొక్కి తన ఇష్టానుసారంగా జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.

దేవస్థానం పాలకమండళ్లలో 60శాతం పదవులు బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజికవర్గాలకు కేటాయిస్తామని చెప్పి మాటతప్పారు. టీటీడీ బోర్డులో ఐదోవంతు తన సొంత సామాజికవర్గానికే ప్రాధాన్యత ఇవ్వడం రాష్ట్రంలో పాలనకు నిదర్శనం.

టీటీడీ బోర్డులో కళంకితులను, వివిధ కేసుల్లో నిందితులుగా ఉన్నవారిని తక్షణమే తొలగించి నూతన బోర్డును వేయాలి. భక్తుల మనోభావాలను గౌరవించడంతో పాటు తిరుమల పవిత్రతను, వేంకటేశ్వరస్వామి ఔన్నత్యాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE