-జగనన్న విద్యుత్ భారాల పథకంతో ప్రజల రక్తం త్రాగుతున్నారు
-మూడున్నరుళ్లలో రూ.20,548 కోట్ల భారాలు ప్రజలపై మోపారు
-జగన్ రెడ్డి విధానాలతో స్విచ్ వేయక ముందే ప్రజలు షాక్ కి గురౌతున్నారు
– కిమిడి కళావెంకట్రావు
ప్రజలపైన బాదుడే బాదుడు కార్యక్రమాన్ని జగన్ రెడ్డి నిర్వీరామంగా కొనసాగిస్తున్నారు. ఆయన బాదుడికి రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. వైసీపీ ప్రభుత్వం డిస్కంలను టోల్ టాక్స్ కేంద్రాలుగా మార్చి ప్రజల రక్తం త్రాగుతోంది. జగన్ రెడ్డి తన అసమర్ధతకు, చేతగానితనానికి ప్రజలు బలవ్వాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది. డిస్కంలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా డిస్కంలు నష్టాల్లో ఉన్నాయంటూ ఏపీఈఆర్.సి ట్రూ అప్ ఛార్జీల వసూలుకు అనుమతివ్వడం చేతగానితనానికి నిదర్శనం కాదా?. విద్యుత్ అవసరం ఎంత ఉంటుందో ఏడాది ముందే ఇతర రాష్ట్రాలు గుర్తించి డిమాండ్ కు అనుగుణంగా ప్లాంట్లు నిర్మించుకోవడం, ఒప్పందాలు చేసుకోవడం చేస్తున్నాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏరోజుకారోజు అవసరాలకు బహిరంగ మార్కెట్ లో అత్యధిక ధరలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ఆ భారాన్ని ప్రజలపై మోపుతున్నారు. విద్యుత్ డిమాండ్ ను విశ్లేషించే అనుభవం కలిగిన నిపుణులు, సాంకేతిక పరిజ్జాన అందుబాటులో ఉంటే ప్రభుత్వం ఎందుకు వినియోగించుకోవడం లేదు. 2014-19 కాలంలో వినియోగించిన విద్యుత్ కు ట్రూఅప్ ఛార్జీల వసూలు ప్రజల రక్తం త్రాగుతున్నారు.
జగన్ సర్కార్ డిస్కంలకు కట్టాల్సిన రూ15,474 కోట్లు సబ్సిడీ బకాయిలు, వివిధ ప్రభుత్వ శాఖలు విద్యుత్ వాడుకున్నందుకు 30.09.2021 నాటికి రూ.9,783 కోట్లు కట్టకుండా ప్రజలను బలిపెడుతున్నాడు. మొత్తంగా ప్రభుత్వం గత సెప్టెంబర్ నాటికే రూ. 25,257 కోట్లు డిస్కంలకు ఎగనామం పెట్టారు. మే 2022 లో హైకోర్టుకు ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ లో రాష్ట్రంలోని విద్యుత్ డిస్కంలు దివాల తీశాయని ప్రభుత్వమే చెప్పింది. రూ.38,836 కోట్లు అప్పుల ఊబిలో డిస్కంలు కూరుకుపోయాయని జగన్ సర్కార్ నిస్సిగ్గుగా ఒప్పుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు రూ.13,011 కోట్లు తాము బాకీపడిన తమ ఘన కీర్తిని కూడా అఫిడవిడ్ లో చాటుకున్నారు. కేంద్రం ఏపీ జెన్ కో ను రెడ్ కేటగిరిలో పెట్టడంతో రాష్ట్రం పరువుపోయింది. డిస్కంలు ముందు జగన్ రెడ్డి ముక్కు పిండి బాకీలు వసూలు చేయాలి. డిస్కంల పేరుతో జగన్ రెడ్డి తీసుకున్న రూ. 38,836 కోట్లు ఎవరికి దోచిపెట్టారో చెప్పాలి. జెన్కోలకు ఉన్న రూ. 13 వేల కోట్ల బాకీ ఎప్పుడు కడతారో చెప్పాలి. విద్యుత్ చార్జీల పేరుతో ఒక్క పైసా ప్రజల నుంచి వసూలు చేసే అర్హత జగన్ రెడ్డికి లేదు.