Suryaa.co.in

Andhra Pradesh

చట్ట సభలను అగౌరవ పరుస్తున్న జగన్ రెడ్డి

-యనమల రామకృష్ణుడు

ప్రభుత్వ, ప్రతిపక్ష పార్టీలకు చట్టసభలు ప్రజాకోర్టు లాంటివి. ప్రభుత్వ పాలనా తీరు, ప్రజా సమస్యల పరిష్కారం చట్టసభలో చర్చించే వేదిక. ప్రజాస్వామ్యంలో చట్టసభల ప్రాధాన్యతను జగన్ రెడ్డి తగ్గించే కుట్ర చేస్తున్నారు. ప్రభుత్వ చేతగాని పాలనను ప్రతిపక్షాలు నిలదీస్తాయని జగన్ రెడ్డికి భయం పట్టుకుంది. శాసనసభలు విధిగా నిర్వహించడంలో ప్రభుత్వం దారుణంగా విఫలం అయ్యింది. చట్టసభలకు హాజరవ్వడం సభ్యుని ప్రధాన బాధ్యత. ఈ చట్టసభల నిర్వహణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తేనే ప్రజాస్వామ్యం మెరుగ్గా ఉంటుందని రాజ్యాంగ నిర్మాతలు కూడా భావించారు. కాని జగన్ ప్రభుత్వం మాత్రం రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది. ఏడాదికి సగటున 25 రోజులు మించి చట్టసభలు నిర్వహించలేదు. గత ఏడాది కేవలం 15 రోజులు మాత్రమే నిర్వహించారు. ఈశాన్య రాష్ట్రాల కంటే తక్కువ రోజులు సభలు నిర్వహించారు.

చట్టసభలు ఎక్కువ రోజుల నిర్వహిస్తేనే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చట్టసభలు నిర్వహించకుండా తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఆరాటపడుతుంది. వ్యవసాయం నుండి సంక్షేమం వరకు అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలం అయ్యింది. మౌలిక సదుపాయాలు, విద్యుత్, వ్యవసాయ రంగాలు పడిపోయాయి, జలవనరుల ప్రాజెక్టులు నత్తనడకన నడుస్తున్నాయి, రోడ్లు అధ్వానంగా ఉన్నాయి, విద్యా రంగం అట్టడుగు స్థాయికి చేరింది. అనేక సమస్యలతో ప్రజలు కొట్టు మిట్టాడుతున్నారు. వీటన్నింటిపై చట్టసభల్లో ప్రతిపక్ష పార్టీ ప్రశ్నిస్తుందన్న భయంతోనే తక్కువ రోజులు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.

ప్రజా సమస్యలపై మాట్లాడే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. ఆ హక్కునే లేకుండా జగన్ రెడ్డి చేస్తున్నారు. బీఏసీ, చట్టసభల్లోను మాట్లాడనివ్వకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కుతున్నారు. ప్రతిపక్షాలకు మాట్లాడే సమయంలో ఇస్తేనే ప్రజా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కాని జగన్ రెడ్డి మాత్రం అసెంబ్లీ సాక్షిగా ప్రతిపక్ష నాయకులను అవమానపరుస్తూ వికృత చేష్టకు పాల్పడుతున్నారు. చట్టసభలకు కనీస గౌరవం కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వడం లేదు.

ప్రజలు, ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న అంశాలు శాసనసభలో బలవంతంగా తీసుకువస్తున్నారు. సుప్రంకోర్టు కూడా తప్పు పట్టినా పట్టించుకోకుండా దొడ్డి దారిన మూడు రాజధానుల బిల్లును ప్రవేశపెడుతున్నారు. కేవలం బిల్లులు ఆమోదింపజేసుకోవడానికి మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. చట్టసభలో ప్రతిపక్షాలకు సమయం కేటాయించాలి. ప్రజా సమస్యలపై అర్ధవంతమైన చర్చ జరగాలంటే శాసనసభల సమావేశాలు జరగాలి.

LEAVE A RESPONSE