Suryaa.co.in

Andhra Pradesh

పేదలకు వ్యతిరేకమైన 225జీవోను జగన్ రెడ్డి ఉపసంహరించుకోవాలి

– టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫి

పేదలు ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణలో పేదలకు వ్యతిరేకమైన 225జీవోను జగన్ రెడ్డి ఉపసంహరించుకోవాలని టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫి పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లో…

పేదల నుండి రూ.3,500 కోట్లు దండుకోవడానికి జగన్ రెడ్డి 21,ఆగస్టు 2021న 225 జీవో తెచ్చాడు. పేదలకు ఆక్రమించుకొని కట్టుకున్న 100 గజాల టెలిస్కోప్ విధానం ద్వారా ఇళ్లను ఉచితంగా క్రమబద్ధీకరిస్తానని చెప్పి దాన్ని 75 గజాలకే కుదించాడు. అందులో టెలిస్కోపిక్ విధానాన్ని ఎత్తివేయటం పేదలపాలిట ఆశనిపాతంగా మారింది. 225 జీవో ప్రకారం రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకున్న పేదలకు ఉపయోగంలేదు. ఇది కేవలం జగన్ రెడ్డి ఓటియస్ లో పేదల నుంచి డబ్బులు గుంజుకోవటానికి వేసిన ప్లాన్ లాగానే దీన్ని కూడా తీసుకొచ్చాడు. 225 జీవో ప్రకారం పేదలు ఉంటున్న ఇళ్లకు మార్కెట్ రేటుతో కలెక్టర్లు క్రమబద్ధీకరిస్తామని నోటీసులు పంపించటం అన్యాయం.

జగన్ రెడ్డి తక్షణం 225 జీవోను వెనక్కి తీసుకొని 2019 నవంబర్ 6వ తేదిన జారీ చేసిన 463 జీవో ప్రకారం అంతకు ముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరించిన విధానం ప్రకారంపేదలు ఆక్రమించుకున్న స్థలాలను క్రమబద్ధీకరించాలి. ఆ విధానం పేదలకు ఎంతో ఉపయోగపడింది. ఇప్పుడు జగన్ రెడ్డి తెచి్చన 225 జీవోని టీడీపీ వ్యతిరేకిస్తోంది. ఓటిఎస్ ద్వారా 4 వేల కోట్లు గుంజాలని జగన్ రెడ్డి చూశారు. అది సాధ్యం కాలేదు. అది అట్టర్ ఫ్లాప్ అయింది. ఓటిఎస్ లో 5వందల కోట్లు కూడా రాలేదు. ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమబద్ధీకరణ కోసం దాదాపు 43 వేల మంది దరఖాస్తు పెట్టుకున్నారు.

వంద గజాలు ఉన్నవాటికి 37 వేల మంది పట్టణాలు, నగరాలకు ఆనుకొని వున్నవాళ్లుగా తేలారు. వంద గజాలు కంటిన్యూ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా డబ్బులు రావు. కేవలం 4,620 దరఖాస్తులు మాత్రమే అర్హత అవుతాయి. అందుకోసం 100 గజాల స్థానంలో 75 గజాలకు జగన్ రెడ్డి ప్రభుత్వం కుదించింది. టెలిస్కోపిక్ విధానం తీసేసింది. ఒక వ్యక్తి 78 గజాల్లో ఇల్లు కట్టుకొని 75 గజాలే క్రమబద్ధీకరించుకునే అవకాశం లేదు. మిగతా 3 గజాలు ఉన్నాయి కాబట్టి టెలిస్కోపిక్ విధానం ఎత్తివేయడంవల్ల మొత్తం 78 గజాలకి మార్కెట్ రేటు ప్రకారంగా కలెక్టర్ల ఆదేశాలతో క్రమబద్ధీకరించాలని నోటీసులు జారీ చేయడం దుర్మార్గం.

చంద్రబాబునాయుడు ప్రభుత్వం వంద నుండి 500 గజాల వరకు బీపీఎల్, ఏపీఎల్ ద్వారా క్రమబద్దీకరించుకునే అవకాశం ఇచ్చింది. అదీ టెలిస్కోప్ విధానం ద్వారా. దీని వల్ల పేద, మధ్య తరగతి ప్రజలకు ఎంత ఉపయోగం జరిగింది. దాన్ని మార్చి జగన్ మోహన్ రెడ్డి 500 గజాల స్థానంలో 300 గజాలకే క్రమబద్దీకరిస్తానని చెప్పటం అదీ టెలిస్కోపిక్ విధానం లేకుండా చేయటమనేది ఇది పేద, మధ్య తరగతి ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడే అంశం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రకమైన జీవో తీసుకొచ్చి పేదల్ని చాలా హింసిస్తోంది. రకరకాలుగా దోచుకుంటోంది. ప్రభుత్వ ఖజానాను నింపడానికి పేదల జీవితాలతో చెలగాటమాడుతోంది.

గత యేడాది ఆగస్టులో ప్రభుత్వం 225 జీవోను తీసుకొచ్చింది. ఈ జీవో ఉద్యేశం. 225 జీవో పేదలకు శరాఘాతంగా మారింది. 2019లో పాదయాత్రలో మీరు కట్టుకున్న ఇళ్లను ఒక్క రూపాయితో క్రమబద్దీకరిస్తానని చెప్పిన ఈ పెద్దమనిషి ఇవాళ పేదల నుంచి దొంగ చాటుగా డబ్బులు గుంజాలని చూస్తు్న్నాడు. ప్రజలు రోడ్లపైకి వస్తారు. వందలంటే కడతారు, వేలల్లో, లక్షల్లో కట్టలేరు. మూల విలువలో 15 శాతం కట్టమంటే కడతారు. మొత్తం కట్టమంటే కట్టలేరు. 125 గజాలకి టెలిస్కోపిక్ విధానం లేకుండా మార్కెట్ రేటు కట్టమంటే ఎలా?

ఈ విషయాలన్నీ ముందే చెప్పావా అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది. ఉన్న ఇంటిని కాపాడుకోవడానికి వాళ్లు ప్రయత్నం చేస్తుంటే వంద గజాలు ఉచితంగా ఇచ్చి టెలిస్కోపిక్ విధానం క్రమబద్దీకరించాల్సింది పోయి టెలిస్కోప్ విధానాన్ని ఎత్తివేసి మొత్తం స్థలానికి మార్కెట్ రేటు కట్టమనడం చాలా దుర్మార్గమైన చర్య. ఈ క్రమబద్ధీకరణలో పాత పద్దతిలోనే అమలు చేయాలని టీడీపీ కోరుచున్నది. తక్షణం టెలిస్కోపిక్ విధానాన్ని పునరుద్ధరించాలి. అలాగే వంద గజాల్ని ఉచితంగా క్రమబద్ధీకరించాలి. 225 జీవోని తక్షణం ఉపసంహరించుకోవాలి. కాకపోతే ఈ లబ్దిదారులు ప్రభుత్వంపై తిరగబడతారు. ఇప్పటికి వచ్చిన దరఖాస్తులే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది లబ్దిదారులు ఉన్నారు. వారు ఈ జగన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన 225 జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

ఈ కరోనాలో సంపద లేక, ఉపాధి లేక జనం సతమతమవుతుంటే జగన్ రెడ్డి ప్రభుత్వం పేద ప్రజల నుండి వివిధ రూపాల్లో ఖజానాని నింపుకోవడానికి జలగ లాగ రక్తం పీల్చుకునే కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలి. పేదలనుండి ఇలా ఓటిఎస్ ద్వారా, క్రమబద్ధీకరణ ద్వారా డబ్బులు గుంజాలని జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నించడం చూస్తుంటే ఇది పేదల వ్యతిరేక ప్రభుత్వంగా స్పష్టమైంది. రానున్న కాలంలో ఈ పథకంలో అర్హులైనవారందరిని సమీకరించి టీడీపీ ఆందోళన చేస్తుంది.

LEAVE A RESPONSE