• ఉపాధ్యాయులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఒంటిపూట బడులకు ఎగనామం
-టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాం గోపాల్ రెడ్డి
తన అసమర్థ పాలనతో విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యార్థుల సంక్షేమం, బాగోగులనూ గాలికొదిలేయడం దుర్మార్గం. మార్చి నెల ముగుస్తున్నా ఒంటిపూట బడులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడం ఒక్క రాజారెడ్డి రాజ్యాంగంలోనే సాధ్యమవుతోంది. ఎండలు మండిపోతుంటే హాఫ్ డే స్కూల్స్ పెట్టడానికి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేంటో అర్ధం కావడంలేదు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం మార్చి మొదటి లేదా రెండో వారంలో ఒంటిపూట బడులు పెట్టడం దశాబ్ధాలుగా అమలవుతోంది. ఉపాధ్యాయులపై కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ఒంటిపూట బడులు పెట్టడంలేదు. పైగా దీనిపై ప్రశ్నించిన ఉపాధ్యాయులపై విద్యామంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేయడం సిగ్గుచేటు. ఒంటిపూట బడులు పిల్లలకా? మీకా అంటూ మంత్రి చులకనగా మాట్లాడటం నీతిమాలినచర్య. ఏసీ రూముల్లో, ఏసీ కార్లలో తిరిగే ముఖ్యమంత్రి, మంత్రులకు స్కూలు పిల్లల కష్టాలు ఏం తెలుస్తాయి?
అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఒక్క బడినైనా పూర్తిస్థాయిలో సందర్శించారా? పిల్లల ఇబ్బందులు తెలుసుకున్నారా? పట్టుమని పదిరోజులు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించమంటే అన్ని రోజులు మా వల్ల కాదని వైసీపీ నేతలు కళ్లు తేలేస్తారు. చిన్నపిల్లలు మాత్రం మండే ఎండల్లో రోజంతా స్కూళ్లలో ఉండాలా? ప్రభుత్వం ఇప్పటికైనా ఉపాధ్యాయులపై కక్షసాధింపు ధోరణి పక్కనపెట్టాలి. విద్యార్థుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని ఒంటిపూట బడులు నిర్వహించాలి.