• భూములు హక్కులు, సర్వేలు అంటూ శ్రీరంగనీతులు చెబుతున్నాడు
• రైతులభూములపై నీహక్కు, నీఫోటోలు ఏంటి జగన్ రెడ్డి?
• 2018లో టీడీపీప్రభుత్వం ఇచ్చిన జీవో575ని, 2022 అక్టోబర్ 7న జీవోఎం.ఎస్.నం-667గా ఎందుకు మార్చాడో జగన్ రెడ్డి, ఆయనప్రభుత్వం చెప్పాలి.
• 41నెలల పాటు టీడీపీ ప్రభుత్వమిచ్చిన జీవోని తొక్కిపెట్టి, చుక్కలభూముల సమస్యలకు తానే పరిష్కారం కనుగొన్నట్లు జగన్ రెడ్డి నాటకాలు ఆడుతున్నాడు.
• గ్రామాల్లో 4 అడుగులేస్తే సచివాలయం, 4అడుగులువేస్తే రైతుభరోసాకేంద్రం… డాక్టర్ కనిపిస్తారా?
• 4 అడుగులు వేస్తే నాలుగుగుంతల్లో పడి బొక్కలు విరగ్గొట్టుకుంటున్నారు జగన్ రెడ్డి.
• ఒకహత్య-100ప్రశ్నలు (వివేకాహత్యకేసు) అనే కథకు అవనిగడ్డలో ముఖ్యమంత్రి సమాధానం చెబుతాడనుకుంటే, కట్టుకథలు, శ్రీరంగనీతులు వల్లేవేశాడు
దేవినేని ఉమామహేశ్వరరావు
రాష్ట్రంలోని భూములసమస్య పరిష్కారానికి చంద్రబాబునాయుడి ప్రభుత్వం గతంలోనే భూధార్ ప్రాజెక్ట్ ను అమలుచేసి, పైలట్ ప్రాజెక్ట్ కింద జగ్గయ్యపేటలో అమలుచేసి, దశాబ్దాల నుంచి రైతులఎదుర్కొంటున్న భూవివాదసమస్యలకు పరిష్కారం చూపడం జరిగిందని, అవేవీ ప్రజలకు తెలియవన్నట్టుగా జగన్ రెడ్డి ఇప్పుడు మీ భూమి-మాహక్కు అంటూ శ్రీరంగనీతులు చెబుతున్నాడని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ఎద్దేవాచేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయనమాటల్లోనే మీకోసం…!
“జేట్యాక్స్ వసూళ్ల కోసమే జగన్ రెడ్డి నిషేధిత భూముల జాబితాను తారుమారు చేస్తున్నాడని చెప్పకతప్పదు. చంద్రబాబుహయాంలోనే భూముల సర్వేకోసం భూధార్ ప్రాజెక్ట్ ను తీసుకొచ్చారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలో దాన్ని అమలు చేసి, అద్భుతమైన ఫలితాలు సాధించారు. అదేవిధంగా 1954కు పూర్వం కేటాయించిన ప్రభుత్వభూముల సమస్యపరిష్కారానికి కూడా ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చారు. కానీ ఇవేవీ ప్రజలకు తెలియవన్నట్లు అవనిగడ్డలో ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్పుకొచ్చాడు. 40నెలల్లో జగన్ రెడ్డి భూదోపిడీ పర్వంయథేచ్చగా కొనసాగించి, రూ.40వేలకోట్ల విలువైన భూములు కబ్జాచేశాడు. అవనిగడ్డ పేరుని ఆవనిగడ్డ అంటున్న ముఖ్యమంత్రి ముందుగా, నవంబర్ 16, 2018న చంద్రబాబునాయుడి ప్రభుత్వమిచ్చిన జీవోఎం.ఎస్.నం 575 గురించి తెలుసుకొని మాట్లాడితే బాగుండేది. 1954కి పూర్వం కేటాయించిన ప్రభుత్వ భూములకు 1908 రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 22ఏ నుంచి తొలగిస్తూ ఇచ్చిన జీవో అది. చంద్రబాబుగారి ప్రభుత్వం ఇచ్చిన జీవో 575లో చాలాస్పష్టంగా 18-06-1954కి ముందు కేటాయించిన అసైన్డ్ భూములకు 1908 రిజిస్ట్రేషన్ చట్టంనుంచి మినహాయింపు ఇస్తున్నట్లు దానివల్ల రెవెన్యూసమస్యలకు, కోర్టుకేసులకు పరిష్కారం లభిస్తుందని పేర్కొనడం జరిగింది. 2018లో టీడీపీప్రభుత్వం ఇచ్చిన జీవో 575నికాదని, దాన్ని 2022 అక్టోబర్ 7న జీవోఎం.ఎస్.నం-667గా ఎందుకు మార్చాడో జగన్ రెడ్డి, ఆయనప్రభుత్వం చెప్పాలి. 40నెలల పాటు టీడీపీ ప్రభుత్వమిచ్చిన జీవోని తొక్కిపెట్టి, చుక్కలభూముల సమస్యలకు తానే శాశ్వతపరిష్కారం కనుగొన్నట్లు జగన్ రెడ్డి నాటకాలు ఆడుతున్నాడు.
మూడున్నరేళ్లలో చేయాల్సిన భూదోపిడీ చేసేసి, ఇప్పుడు నీతులా…?
ఆయన చెప్పుచేతుల్లో ఉండే కొందరు కలెక్టర్లతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న భూములన్నీ అడ్డగోలుగా దోచేసి, ఇప్పుడు ఏమీతెలియనట్లు మాట్లాడుతున్నాడు. ఒక్క విశాఖపట్నం లోనే 40వేలకోట్ల విలువైన భూములకు 70వేలరిజిస్ట్రేషన్లు జరగడంలోని మతలబు ఏంటో ముఖ్యమంత్రి చెప్పాలి? మూడున్నరేళ్లలో చేయాల్సినభూదోపిడీ అంతాచేసేసిన జగన్ రెడ్డి, ఇప్పుడు శ్రీరంగ నీతులు చెబుతున్నాడు. ఆయనే భూమ్మీద కొత్తగా భూసర్వేచేపట్టినట్టు, డ్రోన్ లు తానేకనిపెట్టినట్టు, సర్వేయర్లను తానే తయారుచేసినట్లు మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో ఎక్కడైనా ఇద్దరురైతులమధ్య ఉన్న భూవివాదానికి సంబంధించిన సరిహద్దుసమస్యకు ఈ ముఖ్యమంత్రి ఇన్నేళ్లలో పరిష్కారం చూపించాడా అని ప్రశ్నిస్తు న్నాం. ఈనామ్, వక్ఫ్ భూములు, అసైన్డ్ ల్యాండ్స్ ఎన్ని కొట్టేశారో చెప్పండి? వక్ఫ్ భూములపై కన్నేసిన పైరవీ రాజ్ ఎవరో మాట్లాడరు.. విజయసాయిరెడ్డి భూకబ్జాలపై, ధర్మానప్రసాదరావు కాజేసిన 70ఎకరాల గురించి జగన్ రెడ్డి నోరెత్తడు. సర్వీస్ ఈనామ్స్ కు సంబంధించిన రెసిడెన్షియల్ ఆర్డినెన్స్ ఏ ప్రభుత్వంలో వచ్చింది? చంద్రబాబునాయుడి ప్రభుత్వం చేసినవి జగన్ రెడ్డి కళ్లకు కనిపించడంలేదా? 100ఏళ్ల నుంచిఉన్న సమస్యలకు తానే పరిష్కారం కనుగొన్నట్లు జగన్ రెడ్డి సొల్లుకబుర్లు చెబుతుంటే నమ్మడానికి ఎవరూ సిద్ధంగాలేరు. 40 నెలలనుంచీ చేయాల్సిన భూదోపిడీ చేసి, ఇవాళ జగనన్నభూహక్కు అంటున్నాడు.
ప్రజలభూములపై నీహక్కు..నీఫోటోలు ఏంటి జగన్ రెడ్డి?
ఈరోజు ఉండి రేపు జగన్ రెడ్డి ఫోటో రైతుల పట్టాదార్ పాస్ పుస్తకాలపై వేయడమేంటి?
మూర్ఖుడుచెప్పాడని తప్పులుచేసే సీనియర్ అధికారులు తగిన మూల్యం చెల్లించుకుంటారు. ముఖ్యమంత్రి బొమ్మలేసి తైతక్కలాడతామంటే చూస్తూఊరుకోవాలా? 12పేజీల పట్టాదార్ పుస్తకంలో 8పేజీల్లో జగన్ రెడ్డి ఫోటోలా..ఏమిటీ ప్రచారపిచ్చి? రైతులభూమికి నీ హామీ ఏంటయ్యా? గ్రామాల్లో 4 అడుగులేస్తే సచివాలయం, 4అడుగులువేస్తే రైతుభరోసాకేంద్రం… డాక్టర్ కనిపిస్తారా? 4అడుగులు వేస్తే నాలుగుగుంతల్లో పడిబొక్కలు విరగ్గొట్టుకుంటున్నారు జగన్ రెడ్డి. మహాత్మా గాంధీ తీసుకొచ్చిన గ్రామస్వరాజ్యానికి తూట్లుపొడిచిన జగన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థ గొప్పదా? రైతుభరోసా కేంద్రాల్లో జరిగే అడ్డగోలు దోపిడీ, అవకతవకలు కోకొల్లలు. రైతులకే తెలియకుండా వారిభూముల్ని కాజేసే స్థాయికి రైతుభరోసా సిబ్బంది, వాలంటీర్లు వచ్చారు. మైలవరంమండలం పుల్లూరుగ్రామంలో ఈక్రాప్ ఈకేవైసీ అవకతవకలపై రైతుభరోసా సిబ్బంది అంతా గతసంవత్సరం సస్పెండ్ అయ్యారు. ఈ ఏడాదికూడా రమణ అనేరైతు ఫిర్యాదుపై సబ్ కలెక్టర్ కొద్దిరోజుల్లో విచారణ చేయనున్నారు. ఇలా చెబితే చాలానే ఉన్నాయి. రైతులపంటబీమా సొమ్ము, ఇన్ పుట్ సబ్సిడీ, ధాన్యంకొనుగోళ్ల తాలూకా సొమ్ము అంతా రైతుభరోసా కేంద్రాలసిబ్బంది, స్థానిక వైసీపీనేతల జేబుల్లోకే వెళ్తున్నాయి జగన్ రెడ్డి. ఇంత అడ్డగోలుగా నీవు తీసుకొచ్చిన వాలంటీర్, సచివాలయ, రైతుభరోసా వ్యవస్థలు దోపిడీచేస్తుంటే, ఏదో ఘనకార్యం చేసినట్టు డబ్బాలు కొడుతున్నావా జగన్ రెడ్డీ? వ్యవస్థలను భ్రష్టుపట్టించి పరిపాలన చేయడం చేతగాక, ప్రజలదృష్టి మళ్లించడానికే జగన్ రెడ్డి బూతులపంచాంగం మొదలెట్టాడు. ఆ పంచాంగంలో భాగంగానే ప్రత్యేకంగా బూతులు మాట్లాడటానికే గతంలో ఒకమంత్రిని పెట్టాడు. అతనికంటే ఘనులన్నట్లు ఇప్పుడున్న మంత్రులు మరింత రెచ్చిపోతున్నారు. 100ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకెళ్లినట్లు, ప్రతిపక్షనేతను, ఆయన కుటుంబాన్ని బూతులతో తిట్టించి పైశాచిక ఆనందం పొందిన జగన్ తనను బూతులు తిడుతున్నారంటున్నాడు. అసలు బూతుల గురించి మాట్లాడే నైతిక అర్హత జగన్ రెడ్డికి ఉందా?
ఒకహత్య-100ప్రశ్నల కథపై ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడు?
తాడేపల్లి నుంచి ముఖ్యమంత్రి ఈరోజు బయటకువస్తే, బాబాయ్ గొడ్డలిపోటు గురించి మాట్లాడతాడేమో అని ప్రజలు అనుకున్నారు! వివేకాహత్యకేసులో సీబీఐ వేసిన ఛార్జ్ షీట్ లోని వివరాలు, వ్యక్తులపేర్లు చూస్తే జగన్ రెడ్డి బాగోతం అర్థమవుతోంది. వివేకానందరెడ్డి మృతదేహానికి కుట్లు వేసింది ఎవరు జగన్ రెడ్డి.. సీబీఐ ఛార్జ్ షీట్ లో అవినాశ్ రెడ్డి పేరుసంగతేంటి? అప్రూవర్ దస్తగిరి వాంగ్మూలం సంగతేంటి? వివేకాహత్యకోసం సుపారీ ఇచ్చిన పెద్దతలకాయ ఎవరు? హంతకులతో కుమ్మక్కై, వారిని కాపాడటానికి సీబీఐని అడ్డుకుంది ఎవరు? వివేకాహత్యకేసు విచారణ సీబీఐకి అప్పగించాలని కోర్టులో పిటిషన్ వేసిన జగన్ రెడ్డి, తరువాత దాన్ని ఎందుకు వెనక్కు తీసుకున్నాడు? దస్తగిరి గన్ మెన్లను ఎందుకు తొలగించారు? తనకు ప్రాణభయం ఉందని దస్తగిరి ఎస్పీకి చెబితే ఎందుకు అతను హేళనగా మాట్లాడాడు? జిల్లా ఎస్పీ, డీజీపీ దస్తగిరికి ఎందుకు ధైర్యం చెప్పలేకపోతున్నారు? శంకరయ్యను బెదిరించింది ఎవరు? అతనికి ఇచ్చిన పోస్టింగ్ లు, ప్రమోషన్ల కథేంటి? ఇలా ఒకహత్య-100ప్రశ్నలు అనే కథకు అవనిగడ్డసభలో ముఖ్యమంత్రి సమాధానం ఎందుకు చెప్పలేకపోయాడు? సుప్రీంకోర్టు వివేకాహత్యకేసుపై చేయాల్సిన వ్యాఖ్యలు చేశాక కూడా జగన్ రెడ్డి తనపదవికి ఎందుకు రాజీనామా చేయడు. తండ్రిని చంపినవారిని శిక్షించడానికి వివేకా కుమార్తె వై.ఎస్.సునీత ఢిల్లీలో చెమటలు కక్కుతూ తిరుగుతుంటే, జగన్ రెడ్డి తాడేపల్లి కొంపలో తాపీగా ఏసీలో కూర్చోవడం ఏమిటి? ఇలా ప్రజలమనస్సుల్లో ఉన్న ప్రశ్నలకు సమాధానంచెప్పలేని ముఖ్యమంత్రి పరనింద, ఆత్మస్తుతి ప్రసంగాలతో ప్రజలను ఏమార్చాలని చూస్తున్నాడు” అని దేవినేని తెలిపారు.