Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్ర ఆరోగ్య వ్యవస్థపై నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు చెప్పిన జగన్ రెడ్డి

– విజయవాడ హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించడం యావత్ తెలుగుజాతినీ అవమానించడమే
– వైద్యరంగాన్ని భ్రష్టుపట్టించి దేవాలయంలాంటి అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెబుతావా?
– ఎన్టీఆర్ పేరు మార్పుపై గుడివాడ గుట్కా, వల్లభనేని వంశీకి తాడేపల్లి ప్యాలెస్ ముందు ధర్నా చేసే దమ్ముందా?
– రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయో తెలియని కూడా తుగ్లక్ నేడు చంద్రబాబుని విమర్శించడమేంటి?
– ఏపీలో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నెలకొల్పిన ఘనత నారా చంద్రబాబు కే దక్కుతుంది
– కరోనా మరణాలపైనా తప్పుడు లెక్కలు చెప్పి కేంద్రాన్ని తప్పుదారి పట్టించిన చరిత్ర జగన్ రెడ్డిదే
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్

తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి పేదలకు పట్టెడన్నం పెట్టి బడుగు, బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించిన మేరునగ ధీరుడు ఎన్టీఆర్ . అంతటి మహనీయుడికి జగన్మోహన్ రెడ్డి ఘోర అవమానం చేశారు.

విజయవాడలోని హెల్త్ యూనివర్సటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి దుస్సాహసానికి ఒడిగట్టారు. ఇది యావత్ తెలుగుజాతికి జరిగిన అవమానం. దేవాలయంలాంటి అసెంబ్లీలో యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపు సహా వైద్య రంగం అభివృద్ధిపై ముఖ్యమంత్రి పచ్చి అబద్ధాలు చెప్పారు. ఎప్పటిలాగే వాస్తవాలను వక్రీకరించారు. జగన్ రెడ్డి చెప్పిన అబద్ధాలేంటో అసలు వాస్తవాలేంటో చూద్దాం.

జగన్ రెడ్డి అబద్ధం:
హెల్త్ వర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పుపై చాలా ఆలోచించా. కరెక్టే అనిపించి నిర్ణయం తీసుకున్నా.
వాస్తవం:
దేశంలోనే మొదటి హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు గారికి జగన్ రెడ్డి ఘోర అవమానం చేశారు. ప్రపంచమంతా అన్నగారి శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ, ప్రతి తెలుగువాడు ఆ మహోన్నత వ్యక్తిని స్మరించుకుంటున్నవేళ తుగ్లక్ సీఎం దుర్మార్గపు నిర్ణయం తీసుకున్నాడు. విజయవాడ హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగించి వైఎస్సార్ పేరు పెడుతూ అసెంబ్లీలో బిల్లు ఆమోదించుకోవడం రాష్ట్ర చరిత్రలోనే చీకటిరోజు. ఈ ఘటనపై ప్రతి ఒక్క తెలుగువారు ఎంతో బాధపడుతున్నారు.
వైసీపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు జగన్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. రాష్ట్రమంతటా ప్రజాసంఘాలు ఆందోళన చేశాయి. ఎన్టీఆర్ పేరు మార్పుపై గుడివాడ గుట్కా కొడాలి నాని, వల్లభనేని వంశీ ఏం సమాధానం చెప్తారు? జగన్ రెడ్డి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తాడేపల్లి ప్యాలెస్ ముందు ధర్నా చేసే దమ్ముందా మీకు ?జగన్ రెడ్డి దుర్మార్గాన్ని ప్రశ్నించలేని మీకు అన్న గారి పేరు ఉచ్చరించే అర్హత ఎక్కడిది? టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటిరోజే వర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెడతాం.

జగన్ రెడ్డి అబద్ధం:
నాడు నాన్నగారు 3 మెడికల్ కాలేజీలు తెచ్చారు. నేను 17 కాలేజీలు కడుతున్నా.
వాస్తవం:
ఆరోగ్య రంగం అభివృద్ధి, మెడికల్ కాలేజీల నిర్మాణంపై అసెంబ్లీలో జగన్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పాడు. రాష్ట్రంలో వైద్యరంగానికి ఆయన తండ్రి ఎంతో సేవ చేశారని, అందుకే వైఎస్ పేరును యూనివర్సిటీకి పెట్టామంటున్నారు. రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామంటూ జగన్మోహన్ రెడ్డి మూడేళ్లుగా అరచేతిలో వైకుంఠం చూపిస్తూనే ఉన్నారు. అలాగే రాష్ట్రంలో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయని అబద్ధాలు చెబుతున్నారు. ఏపీలో 13 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయని ఏ2 విజయసాయి ప్రశ్నకు 2021 డిసెంబర్ 14న కేంద్రం సమాధానం ఇచ్చింది .

రాష్ట్రంలో ఎన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయో కూడా ముఖ్యమంత్రికి తెలియకపోవడం దారుణం కాదా? కట్టు కథలు తర్వాత చెప్పొచ్చుకానీ ముందు కాలేజీల లెక్క సరిచేసుకోండి ముఖ్యమంత్రిగారూ. 13 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో నాలుగు (మంగళగిరి ఎయిమ్స్, తిరుపతి స్విమ్స్ , నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి, అనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను) చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారు. 3 మాత్రమే వైఎస్ తెచ్చినవి. మిగిలిన ఆరూ గతంలోవి. అలాగే చంద్రబాబు గారు తిరుపతిలో బర్డ్ ఆస్పత్రి, టాటా క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ సహా పలు ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయగా ఎన్టీఆర్ గారు హైదరాబాద్ లో నిమ్స్, విజయవాడలో హెల్త్ యూనివర్సిటీ ఇచ్చారు. ఈ వాస్తవాలు దాచాలన్నా దాగవని జగన్ రెడ్డి గుర్తిస్తే మంచిది.

అసెంబ్లీలో మాట్లాడేప్పుడైనా జగన్ రెడ్డి నిజాలు మాట్లాడాలి కదా. బటన్ నొక్కి శిలాఫలకాలు వేస్తే మెడికల్ కాలేజీలు పూర్తయినట్టేనా? జగన్ రెడ్డి చెబుతున్న 17 మెడికల్ కాలేజీలు బూటకమే. అనకాపల్లికి చెందిన సాయికుమార్ గారి సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు 2022, సెప్టెంబర్ 1 కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ స్పష్టమైన సమాధానం ఇచ్చింది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం కేవలం 7 మాత్రమే అప్లికేషన్లు పంపగా మూడింటికి ఆమోదం తెలిపి నాలుగు అప్లికేషన్లు తిరస్కరించినట్టు అందులో స్పష్టంగా ఉంది. దీన్ని బట్టి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం బూటకమని అర్ధమవుతోంది.

ఏలూరు, మార్కాపురం, పులివెందుల, విజయనగరం, పాడేరు, పిడుగురాళ్ల , మచిలీపట్నంలో మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అప్లై చేయగా పాడేరు, మచిలీపట్నం, పిడుగురాళ్లలో నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇచ్చినట్టు ఆర్టీఐ ద్వారా స్పష్టమవుతోంది. మరి దీనికి ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంబంధించి ముఖ్యమంత్రి సహా వైసీపీ నేతలు ఏం సమాధానం చెప్తారు?

జగన్ రెడ్డి అబద్ధం:
మూడేళ్లలో వైద్యరంగంలో 40 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మాదే
వాస్తవం:వైద్య రంగంలో ఉద్యోగాల విప్లవం తెచ్చామని, ఈ మూడేళ్లలో 40 వేలకు పైగా ఉద్యోగాలిచ్చామని జగన్ రెడ్డి గారు అసెంబ్లీలో కట్టుకథలు వినిపించారు. వాస్తవం ఏంటంటే… 2021-22 కు సంబంధించి ముఖ్యమంత్రి తన స్వహస్తాలతో భారీ పత్రికా ప్రకటనతో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ మూడేళ్లలో వైద్యరంగంలో ఇచ్చిన ఉద్యోగాల సంఖ్య కేవలం 13,987. అందులోనూ 10,341 కాంట్రాక్ట్ ఉద్యోగాలైతే శాశ్వత ఉద్యోగాలు కేవలం 1532 కాగా , 2114 ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇదేనా మీరు చెబుతున్న వైద్యరంగంలో విప్లవమంటే?

జగన్ రెడ్డి అబద్ధం: ఆరోగ్యశ్రీ పేదల పాలిట వరం
వాస్తవం:
ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని జగన్ రెడ్డి అబద్ధాలు అల్లేస్తున్నారు. కరోనా సమయంలో ఆరోగ్యశ్రీ కింద వైద్యం మా వల్ల కాదని సీఎం సొంత జిల్లాలోనే ఆస్పత్రులు బోర్డులు పెట్టింది వాస్తవం కాదా? మరిదీనికేం సమాధానం చెప్తారు? టీడీపీ హయాంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా రూ. 5 వేల కోట్లకు పైగా ఖర్చు చేశాం. కానీ నేటి జగన్ సర్కారు ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్న నెట్ వర్క్ ఆస్పత్రులకు దాదాపు రూ. 600 కోట్లకు పైగా బకాయిలు పెట్టి ఆ పథకాన్ని నిర్వీర్యం చేస్తోంది.
ముఖ్యమంత్రి సహాయనిధి:
రాష్ట్రంలో పేదలకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు వారిని ఆదుకునే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయనిధి పనిచేస్తుంది. 2014-19 మధ్య ఐదేళ్లలో CMRF ద్వారా చంద్రబాబు గారు ఎముకలేని చేయిలాగా సాయం చేశారు. రూ. 1523 కోట్లకు పైగా ముఖ్యమంత్రి సహాయనిధికి వెచ్చించి ఏడాదికి సగటున రూ. 304 కోట్లు ఖర్చు చేసి లక్షలాదిమందిని ఆదుకున్నారు. జగన్ రెడ్డి చేసింది ఏంటయ్యా అంటే ఈ మూడేళ్లలో సీఎంఆర్ ఎఫ్ ను ఐసీయూలోకి నెట్టేయడమే. దాని కింద ఈ మూడేళ్లలో కేవలం రూ. 429 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి పడేశారు. సీఎంఆర్ ఎఫ్ ద్వారా టీడీపీ ప్రభుత్వం ఏడాదికి సగటున రూ. 304 కోట్లు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి ఇచ్చింది కేవలం ఏడాదికి కేవలం సగటున 143 కోట్లు మాత్రమే. చంద్రబాబు గారు ఖర్చుచేసిన దానిలో సగం కూడా లేదు.

జగన్ రెడ్డి అబద్ధం:
ప్రభుత్వాసుపత్రుల్లో అధునాతన పరికరాలు అమర్చి రూపురేఖలు మార్చేశాం
వాస్తవం:
ప్రభుత్వాసుపత్రుల్లో కొత్త కొత్త పరికరాలు అందుబాటులోకి తెచ్చామని సీఎం అంటున్నారు. వైద్య పరికరాలు సరఫరా చేసిన కాంట్రాక్టర్ల సంఘం అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైజ్ ఇండస్ట్రీ వారు జగన్ సర్కార్ ఆస్పత్రులకు కొనుగోలు చేసిన వైద్య పరికరాలకు డబ్బులు చెల్లించకపోడం వల్ల రాష్ట్రానికి రెడ్ నోటీస్ జారీ చేసిన మాట వాస్తవం కాదా? రాష్ట్రానికి వైద్య పరికరాలు సరఫరా చేసే సందర్భంలో తయారీదారులు జాగ్రత్త వహించాలని, వంద శాతం అడ్వాన్స్ అందితేనే పరికరాలు రాష్ట్రానికి సరఫరా చేయాలని రెడ్ నోటీస్ లో పేర్కొంది నిజం కాదా? ఇదేనా ప్రభుత్వాసుపత్రుల రూపురేఖలు మార్చడమంటే?

జగన్ రెడ్డి అబద్ధం:
రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థను దేశంలోనే మెరుగ్గా తీర్చిదిద్దాం.
వాస్తవం:
కేంద్ర ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ ప్రతి ఏడాది విడుదల చేసే నేషనల్ హెల్త్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ పరిశీలించినట్టయితే జగన్ రెడ్డి చెప్పింది ఎంత పచ్చి అబద్ధమో అర్ధమవుతుంది. 2017-18లో చంద్రబాబు హయాంలో విడుదల చేసిన నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ ర్యాంకింగ్స్ లో మన రాష్ట్రానికి ఇంక్రిమెంటల్ ర్యాంకింగ్ లో 4వ స్థానం దక్కగా అదే జగన్ సర్కారులో 2019-20లో మన రాష్ట్రం యొక్క ఇంక్రిమెంట్ ర్యాంకు 10వ స్థానానికి పడిపోయిన మాట వాస్తవం కాదా? ఇదేనా ఏపీ వైద్య రంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలపడమంటే?

జగన్ రెడ్డి అబద్ధం:
104, 108 సేవలను మెరుగు పరిచి వేలమంది ప్రాణాలు కాపాడాం:
వాస్తవం:
108, 104 అంబులెన్స్ ల గురించి జగన్ రెడ్డి పెద్ద గొప్పలు చెబుతున్నారు. నువ్వు ఫోన్ చేయగానే కుయ్ కుయ్ మంటూ వచ్చేస్తాయన్న అంబులెన్స్ లు కరోనా విపత్తులో సకాలంలో రాక వేలాదిగా ప్రాణాలు కోల్పియింది వాస్తవం కాదా? ఒక్కో అంబులెన్స్ లో 15, 20 మందిని లెక్కన కుక్కి కుక్కి తరలించిన దృశ్యాలు మనం చూడలేదా? 108 వాహనాల కొనుగోలు , నిర్వహణ పేరుతో ఏ2 విజయసాయి రెడ్డి అల్లుడు కంపెనీ అరబిందోతో ఒప్పందం కుదుర్చుకుని రూ. 307 కోట్లు అవినీతికి పాల్పడింది వాస్తవం కాదా జగన్ రెడ్డీ? ఆ రోజు మేము ఆధారాలతో సహా రుజువు చేశాం. ముందు వాటికి సమాధానం చెప్పు.

జగన్ రెడ్డి అబద్ధం: కరోనా సేవల్లో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచాం.
వాస్తవం:
జగన్ రెడ్డి అసమర్థత, నిర్లక్ష్యానికి రాష్ట్రంలో కొవిడ్ విలయతాండవాన్ని అందరూ చూశారు. కరోనా సమయంలో జగన్ రెడ్డి ప్రభుత్వంతో ఆక్సిజన్ సకాలంలో సరఫరా చేయకపోవడతో రాష్ట్రవ్యాప్తంగా 110 మంది చనిపోయారు. కరోనా కిట్లు , బ్లీచింగ్ పౌడర్ కొనుగోలులో కోట్ల అవినీతికి పాల్పడ్డారు. చివరకు కరోనా మరణాలపైనా తప్పుడు లెక్కలు చెప్పారు. ఏపీలో కరోనా బారిన పడి 14,733 మంది చనిపోయారని అధికారిక లెక్కలు చెప్పి 47,228 మందికి నష్టపరిహారం చెల్లించామని కేంద్రానికి లేఖ రాశారంటే ఇంతకంటే మోసకారి ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? గతంలో కరోనా మృతుల కుటుంబాలకు చెల్లించాల్సిన రూ. 1100 కోట్ల నిధులను రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి నుంచి పీడీ ఖాతాలకు మళ్లించడంపై సుప్రీంకోర్టు చివాట్లు పెట్టినా వైసీపీ ప్రభుత్వానికి సిగ్గు రాలేదు.

నేటి ప్రభుత్వాసుపత్రుల దుస్థితి:
మూడేళ్లుగా ప్రభుత్వాసుపత్రులను నరక కూపాలుగా మార్చేశారు. కనీస మౌలిక సదుపాయాలు లేక రోగులు ఇబ్బందులు పడుతుంటే చోద్యం చూస్తున్నారు. నెల్లూరులోని ఆస్పత్రలో వైద్యులు లేక సెక్యూరిటీ గార్డు, స్వీపర్లు వైద్యం చేయడంతో రోగి మృతి చెందాడు. ఒక్క నెల్లూరే కాదు అన్ని ఆస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అబద్ధాలు కట్టబెట్టి ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలి. ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలి. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తొలగింపుపై రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తాం. ఇప్పటికే ఈ వ్యవహారంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెడతాం.

LEAVE A RESPONSE